మందులివ్వండి మహాప్రభో

Emergency Medicines Shortage in Government Hospitals - Sakshi

     పెద్దాస్పత్రుల్లో అత్యవసర మందుల కొరత

     చిన్నాస్పత్రుల్లో మరీ అధ్వానం

     రెండో త్రైమాసిక నిధులు విడుదల చేయని  రాష్ట్ర ప్రభుత్వం

     బెనిఫీషియరీ మ్యాపింగ్‌ పేరుతో మందులకు బ్రేకులు

     తీవ్ర ఇక్కట్లు పడుతున్న రోగులు

     మరోవైపు కాలం చెల్లిన రూ.60 కోట్ల విలువైన మందులు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లేవు. పెద్దాస్పత్రుల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వరకూ ఇదే పరిస్థితి. దీంతో పేద రోగులు మందులు కొనలేక అవస్థలు పడుతున్నారు. ఈఎంఎల్‌ (ఎసెన్షియల్‌ మెడిసిన్స్‌ లిస్ట్‌)లో ఉన్నవే సరఫరా చేయకపోవడం ప్రభుత్వ తీరును బయటపెడుతోంది. గత కొన్ని నెలలుగా ఏపీఎంఎస్‌ఐడీసీ (రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ) మందుల సరఫరా అస్తవ్యస్తంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాకినాడ, కర్నూలు సర్వజనాస్పత్రుల్లో ఇన్‌పేషెంట్లు వెయ్యి మందికి పైనే.. గుంటూరులో అంతకంటే ఎక్కువ.. నెల్లూరులో 800 మందికి పైనే.. ఇలా ఏ ఆస్పత్రిలో చూసినా వందల్లో ఇన్‌పేషెంట్లుగా ఉన్నారు. కానీ వారికి మందులే లేవు. కనీసం రక్తపోటుకు, వాంతులు, విరేచనాలకు కూడా మందులివ్వలేని స్థితిలో పెద్దాసుపత్రులున్నాయి. ఇక ప్రాణాంతక కేన్సర్‌ వంటి వ్యాధుల విషయంలో మందుల సరఫరా మరీ ఘోరంగా ఉంది. కర్నూలు, కాకినాడ, చినకాకాని, నెల్లూరు, విశాఖపట్నం, గుంటూరు తదితర ఆస్పత్రుల నుంచి మందులు కావాలని డీఎంఈకి, ఏపీఎంఎస్‌ఐడీసీకి చాలాకాలం క్రితం లేఖలు రాసినా ఇప్పటికీ ఆయా ఆస్పత్రులకు మందులు చేరలేదు. 

రెండో త్రైమాసికం నిధులే ఇవ్వలేదు
ఏడాదిలో ప్రతి మూణ్నెళ్లకోసారి మందులకు బడ్జెట్‌ ఉంటుంది. మొదటి త్రైమాసికానికి రూ. 60 కోట్లు ఇచ్చారు.  రెండో త్రైమాసికం కూడా గడిచిపోతున్నా ఇప్పటికీ నిధులు ఇవ్వడంలేదు. ఇప్పటికే సరఫరా అయిన మందులకు కూడా 8 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు మందులు సరఫరా చేయడానికి కంపెనీలు ముందుకు రావడం లేదు. సీఎఫ్‌ఎంఎస్‌ (కాంప్రెహెన్సివ్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం) వ్యవస్థను తీసుకొచ్చి.. బెనిఫిషియరీ మ్యాపింగ్‌ పేరుతో ప్రతి రోగి ఎన్ని మందులు తీసుకున్నాడు, వాటి విలువ ఎంత, ఎప్పుడు తీసుకున్నాడు వంటి వివరాలన్నీ ఇస్తేనే మళ్లీ మందులిస్తామనే నిబంధన పెట్టారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో సిబ్బంది లేక అల్లాడుతున్న పరిస్థితుల్లో ఈ పని జరగడంలేదు. దీనివల్ల కూడా మందులు సరఫరా చేయడం లేదని వైద్యులు చెబుతున్నారు.

రూ. 60 కోట్ల మందులు ఎక్స్‌పెయిరీ
ఒకవైపు మందులు లేకుండా రోగులు అల్లాడుతుంటే.. మరోవైపు రూ. 60 కోట్ల విలువైన మందులు కాలం చెల్లిపోయాయి. కమీషన్ల కోసం కొనడం, వాటిని సరఫరా చేయకుండా సెంట్రల్‌ డ్రగ్‌స్టోర్‌లలో ఉంచి కాలం చెల్లినతర్వాత సరఫరా చేసిన వారికే అంటగట్టి బిల్లుల్లో కోత వేస్తుండటంతో ఏపీకి సరఫరా అంటేనే కంపెనీలు ముందుకురాని పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగులు చెబుతున్నారు. 

20 శాతం మందులు వచ్చాయి
కొన్ని అత్యవసర మందుల అవసరం ఏర్పడటంతో ఉన్నతాధికారులకు ఇండెంట్‌ పెట్టాం. వాటిలో ఇప్పటివరకూ 20 శాతం మందులు వచ్చాయి. మిగతావి రావాల్సి ఉంది. ఏపీఎంఎస్‌ఐడీసీ నుంచి సకాలంలో మందులు రావడం లేదు.
– డా.చంద్రశేఖర్, సూపరింటెండెంట్, కర్నూలు జనరల్‌ ఆస్పత్రి

బడ్జెట్‌ అయిపోగానే లేఖ రాస్తున్నాం
మా ఆస్పత్రికి ప్రతి మూడు నెలలకు రూ.1.80 కోట్లు మందుల బడ్జెట్‌ కేటాయిస్తారు. ఈ డబ్బు అయిపోగానే లేఖలు రాస్తున్నాం. కొన్ని అత్యవసర మందులకు లేఖ రాశాం. లేని మందులను కొన్ని స్థానిక కొనుగోళ్ల కింద కొనుక్కోవాల్సి వస్తోంది.
–డా.రాఘవేంద్ర, సూపరింటెండెంట్, కాకినాడ జనరల్‌ ఆస్పత్రి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top