‘గుడ్లు’ తేలేస్తున్నాయి!

Eggs Prices Down Fall - Sakshi

భారీగాపతనమైన ధర

రూ.2.90కుదిగజారిన వైనం

మరింత తగ్గే అవకాశం

ట్రేడర్ల మాయాజాలం అంటున్న రైతులు

సాక్షి, విశాఖపట్నం:కొన్నాళ్లుగా కొండెక్కి కూర్చున్న కోడి గుడ్ల ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. నాలుగైదు నెలల నుంచి సామాన్యుడికి అందనంతగా వీటి రేట్లు ఎగబాకాయి. ఇలా గత నవంబర్‌ నెల 18న గుడ్డు ధర రూ.5.32కి చేరి ఆల్‌టైం రికార్డు సృష్టించింది. దీంతో అప్పట్లో రిటైల్‌ మార్కెట్‌లో గడ్డు ఒక్కంటికి రూ.6 నుంచి 6.50 వరకు  అమ్మకాలు సాగించారు. అప్పట్నుంచి ప్రతి నెలా తగ్గు తూ వచ్చింది. జనవరిలో రూ.3.70–4.12 మధ్య, ఫిబ్రవరిలో రూ.3.40–4.00 మధ్య కొనసాగింది. మార్చి ఆరంభంలో రూ.3.50 ఉన్న ధర క్రమంగా దిగజారుతూ శనివారం నాటికి రూ.2.90కి దిగజారింది. గడచిన మూడు నాలుగేళ్లలో గుడ్ల ధరలు ఇంతలా క్షీణించలేదని పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులను బట్టి మరింతగా తగ్గుముఖం పడతాయన్న వార్తలతో వీరు కలవరపడుతున్నారు. గుడ్డు ధర రూ.3.50 ఉంటేనే తమకు పెట్టుబడి గిట్టుబాటు అయి నష్టం వాటిల్లదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుత ధరలతో ఒక్కో గుడ్డు వద్ద తాము 60 పైసలు నష్టపోతున్నామని అంటున్నారు.

ఉత్తరాంధ్రలో రోజుకు25 లక్షల గుడ్లు ఉత్పత్తి
ఉత్తరాంధ్ర జిల్లాల్లో రోజుకు దాదాపు 25 లక్షల గుడ్లు ఉత్పత్తవుతున్నాయి. ఇందులో ఏడెనిమిది లక్షలు విశాఖ జిల్లా నుంచే ఉత్పత్తి జరుగుతుంది. ఉత్తరాంధ్రలో ఉత్పత్తయ్యే కోడిగుడ్లలో రోజుకు 20 లక్షల వరకు ఈ మూడు జిల్లాల్లోనే అమ్ముడవుతాయి. వీటిలో ఒక్క విశాఖ నగరం, జిల్లాలోనే 15 లక్షల గుడ్లు వినియోగమవుతాయి. మిగిలిన ఐదు లక్షల గుడ్లు పొరుగున ఉన్న ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. గత నవంబరులో డజను గుడ్లు ధర రూ.75 ఉండగా.. ఇప్పుడు అందులో సగానికి పడిపోవడంతో వినియోగదార్లు వీటిని విరివిగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం గుడ్డు ఒక్కంటికి హోల్‌సేల్‌ ధర రూ.2.90 (వంద గుడ్లు రూ.290) ఉండగా, రిటైల్‌ మార్కెట్లో రూ.3.50కి విక్రయిస్తున్నారు.

ఎందుకిలా?
మార్కెట్లో కోడిగుడ్ల ధరలు ఇంతలా పతనమవడానికి ట్రేడర్ల మాయాజాలమేనని రైతులు ఆరోపిస్తున్నారు. ట్రేడర్లు వ్యూహా త్మకంగా గుడ్ల కొనుగోలును తగ్గిస్తారు. పౌల్ట్రీల్లో రోజూ ఉత్పత్తయ్యే లక్షలాది గుడ్లను రైతులు ఎక్కువ రోజులపాటు నిల్వ ఉంచుకోలేరన్న ఉద్దేశంతో ధర తక్కువగా నిర్ణయిస్తారని చెబుతున్నారు. ఇలా తక్కువ రేటుకు కొనుగోలు చేసిన గుడ్లను వర్తకులు తమ కోల్డ్‌ స్టోరేజీల్లో రెండు, మూడు నెలల పాటు భద్రపరుస్తారని, అప్పటికి ధరలు పెంచి వీటిని విక్రయించి లాభాలార్జిస్తారని పేర్కొంటున్నారు.

మరింత తగ్గే అవకాశం..
ప్రస్తుత పరిస్థితులను బట్టి మరికొద్ది రోజులు కోడిగుడ్ల ధరలు ఇవే కొనసాగుతాయి. ఆ తర్వాత గుడ్డుకు మరో పది పైసలు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం దిగజారిన ధరలతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ట్రేడర్లు వ్యూహాత్మక వైఖరి వల్లే గుడ్ల ధరలు తగ్గడానికి కారణం. మరికొన్నాళ్ల తర్వాత వీటి రేట్లు పెరిగితే పౌల్ట్రీ రైతు కోలుకుంటాడు.–భరణికాన రామారావు, నేషనల్‌ ఎగ్‌కోఆర్డినేషన్‌ కమిటీ (నెక్‌)జాతీయ కార్యవర్గ సభ్యుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top