చినుకమ్మా! ఎటుబోతివే..!!

Effect of kharif cultivation with Rainfall Shortage - Sakshi

నిండుకున్న జలాశయాలు

పాతాళానికి చేరిన భూగర్భ జలమట్టం

గ్రామాల్లో దాహం దాహం

నైరుతీ రుతు పవనాలు పక్షం ఆలస్యం

ఎండిపోయిన పండ్లు, కూరగాయల తోటలు

నెలాఖరులోపు వర్షాలు కురుస్తాయని ఆశాభావం

సాక్షి, అమరావతి: నైరుతి రుతు పవనాలు పక్షంరోజులుగా మొహం చాటేశాయి. కరువు ఛాయలు ప్రస్ఫుటం అవుతున్నాయి. రైతులు అష్ట కష్టాలు పడి కన్న బిడ్డల్లా పెంచుకున్న మామిడి, బొప్పాయి, అరటి, బత్తాయి లాంటి పండ్ల తోటలు నీరందక ఎండిపోతున్నాయి. జూన్‌ నెల వచ్చి 20 రోజులవుతున్నా రాష్ట్రంలో చినుకు జాడలేదు. జోరుగా వ్యవసాయ పనులు సాగాల్సిన కాలంలో పంట భూములు ఎడారిని తలపిస్తున్నాయి. రిజర్వాయర్లన్నీ నిండుకున్నాయి. భూగర్భ జలమట్టం దారుణంగా పాతాళానికి పడిపోయిది. ఉన్న బోర్లు ఎండిపోతుండగా... కొత్తగా బోర్లు వేసినా నీటి జాడలేని పరిస్థితి. అనంతపురం, వైఎస్సార్‌ కడప, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో వేల ఎకరాల్లో పండ్ల తోటలు నిలువునా మాడిపోతున్నాయి. మిరప, టమోట, వంగ, బెండ తదితర కూరగాయల తోటలు కూడా ఎండిపోయాయి. మార్కెట్‌లో కిలో టమోటా రూ.45 చేరడానికి ఇది కారణమని వ్యాపారులు అంటున్నారు.

అనంతపురం జిల్లాలో కంది పోకుండా పండ్ల తోటల్లో కాయలను ఎండ నుంచి కాపాడుకోవడం కోసం పాత చీరలను దానిమ్మ చెట్లకు కప్పుతున్నారు. కొందరు రైతులు ఇలా టమోటా, దానిమ్మ పంటలను ఎండ నుంచి కాపాడుకునేందుకు మార్కెట్‌లో వేలాది రూపాయలు వెచ్చించి పాత చీరలను కొనుగోలు చేశారు. అయిదేళ్లు కరువును ఎదుర్కొన్న రైతులు ఈ ఏడాదైనా సకాలంలో వర్షాలు కురుస్తాయని, పంటలు వేసుకుని తిండి గింజలతోపాటు నాలుగు రూపాయలు సంపాదించుకుందామని ఆశించిన రైతులకు ప్రకృతి తీవ్ర నిరాశ కలిగిస్తోంది. రుతుపవనాలు ఒకటి రెండు రోజుల్లో వస్తే నెలాఖరులోపు మంచి వర్షాలు కురుస్తాయని రైతులు ఆశలు పెట్టుకున్నారు.

ఖరీఫ్‌ సాగుపై దుష్ప్రభావం 
నైరుతీ రుతు పవనాలు సకాలంలో రానందున ఖరీఫ్‌ సాగుపై దుష్ప్రభావం తప్పకపోవచ్చని వ్యవసాయ, విపత్తు నిర్వహణ శాఖల నిపుణులు అంటున్నారు. సాధారణంగా జూన్‌ అయిదో తేదీలోగా నైరుతీ రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాలి. రుతు పవనాల రాకకు ముందస్తు సూచికగా జూన్‌ ఆరంభం నుంచి వర్షాలు కురవాలి. అయితే ఈ ఏడాది దీనికి పూర్తి విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. జూన్‌ 20వ తేదీ వచ్చినా రుతు పవనాల జాడలేదు. ముందస్తు వర్షాలూ లేవు. వీటన్నింటికీ మించి ఎండలు భగ్గుమంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 43 నుంచి 46 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటవల్ల భూమి సెగలు కక్కుతోంది. 

తాగునీటికీ కటకట
సాగు నీరే కాదు తాగు నీటి సమస్య కూడా వేధిస్తోంది. భూగర్భ జలమట్టం రోజురోజుకూ కిందకు పడిపోతోంది. అయిదేళ్లుగా వరుసగా వర్షాభావం ఉండటమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని 4800 పైగా గ్రామాల్లో తీవ్ర సాగునీటి ఎద్దడి నెలకొంది. గ్రామీణ నీటి సరఫరా విభాగం కొంత వరకూ ట్యాంకర్లు, ఇతర మార్గాల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నా వేలాది గ్రామాల వారికి సమస్య తప్పడంలేదు. మైళ్ల దూరం నుంచి చాలా గ్రామాల మహిళలు బిందెలతో నీరు మోసుకెళుతున్న దృశ్యాలు రాష్ట్రంలో తాగునీటి సమస్యకు అద్దం పడుతున్నాయి.  పశువులు ఆకలితో అలమటిస్తుంటే తట్టుకోలేక మనసు చంపుకుని అన్నదాతలు వీటిని కటికోళ్లకు ఇస్తున్నారు.

ఇప్పటికే 67 శాతం లోటు వర్షపాతం
జూన్‌ ఒకటో తేదీతో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అధికారిక గణాంకాల ప్రకారమే రాష్ట్రంలో సగటు వర్షపాత లోటు 67 శాతానికి చేరింది. ఈనెల ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకూ కురవాల్సిన వర్షం (సాధారణం) కంటే నెల్లూరు జిల్లాలో 94 శాతం, కృష్ణా 91, శ్రీకాకుళం 81.70, ప్రకాశం 78.30, పశ్చిమ గోదావరి 78.10 శాతం, విజయనగరం 76.40, విశాఖపట్నం 64.80, వైఎస్సార్‌ 63.20, గుంటూరు 59.80, కర్నూలు జిల్లాలో 58.60 శాతం వర్షపాతం లోటు నమోదైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top