యువజనోత్సాహం

East Godavari People Supporting To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి  ,రాజమహేంద్రవరం: జగన్‌.. ఈ పేరు యువతలో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. రాష్ట్ర భవిష్యత్‌ అయిన ప్రత్యేక హోదా కోసం ఆయన చేసిన పోరాటాలు ఆయన పట్ల యువతలో అంచెలంచెల విశ్వాసాన్ని నింపింది. బుధవారం కాకినాడలో జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, యువత భవిష్యత్‌పై తామేంచేయబోతున్నామో స్పష్టంగా చెప్పిన జగన్‌ యువత, నిరుద్యోగుల్లో ఆశలు నిపించింది. కాకినాడలో జరిగిన యువభేరి తర్వాత మళ్లీ అత్యంత దగ్గరగా తమ అభిమాన నాయకుడిని చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రజా సంకల్ప యాత్రకు కాకినాడ నగర యువత పోటెత్తింది. ఆయనతో కలసి అడుగులో అడుగేసింది. మా నాయకుడివి నీవేనంటూ నినాదాలు చేసింది. కాబోయే సీఎం అంటూ నినదించింది. విద్యార్థినీ, విద్యార్థులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు.

ఎటు చూసినా యువతే...
గురువారం ప్రజాసంకల్ప యాత్ర 216వ రోజు కాకినాడ నగరంలో సాగింది. రాత్రి బస ప్రాంతమైన ఆదిత్య సెంటర్‌ నుంచి మధురానగర్, రంగరాయ మెడికల్‌ కాలేజీ మీదుగా జేఎన్‌టీయూ వరకు సాగింది. ఉదయం 8:30 గంటలకు బస కేంద్రం నుంచి వైఎస్‌ జగన్‌ బయటకొచ్చారు. ఏడు గంటల నుంచే వైఎస్‌ జగన్‌ను చూసేందుకు, కలిసేందుకు అక్కడకు అక్కచెల్లెమ్మలు, యువత, విద్యార్థినీ విద్యారులు భారీగా చేరుకున్నారు. వైఎస్‌ జగన్‌ అందరినీ పలకరిస్తూ, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండడంతో బయటకు వచ్చిన అర్ధ గంట తర్వాత పాదయాత్ర మొదలైంది. అక్కడ నుంచి కొద్ది దూరంలోని మధురానగర్‌కు రాగానే భారీ సంఖ్యలో విద్యార్థులు స్వాగతం పలికారు. వారికి అభివాదం చేస్తూ జగన్‌ ముందుకు కదిలారు. రంగరాయ మెడికల్‌ కాలేజీ, జేఎన్‌టీయూ వరకు యువత, విద్యార్థులు జగన్‌ వెంట పరుగులు తీసింది. బస కేంద్రం సమీపంలో వందలాది మంది విద్యార్థినులు జగన్‌ను కలిసేందుకు రోడ్డుపై బారులు తీరారు. జగన్‌తో వారందరూ సెల్ఫీలు దిగారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు భారీ సంఖ్యలో యువత రోడ్డు డివైడర్‌పై నిలబడి చేతులు ఊపుతూ కేరింతలు కొట్టారు. వారికి అభివాదం చేస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బస కేంద్రంలోకి వెళ్లారు.

వినతులు.. సమస్యలు..
ఉద్యోగ విరమణ చేసిన తమకు పెన్షన్‌ ఇవ్వాలని, తెలుగు రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిచాలని ఆర్టీసీ విశ్రాంత కార్మికులు జగన్‌కు వినతిపత్రం ఇచ్చారు. తమ స్థలాన్ని టీడీపీ నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని  లెప్రసీ కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. తమ కాలనీలో సమస్యలు పరిష్కరించాలని కోరారు. బీసీ–డీ నుంచి ఎస్సీ జాబితాలో చేర్చాలని సగర, ఉప్పర సంక్షేమ సంఘం వారు వినతిపత్రం అందించారు. విద్యుత్‌ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని వైఎస్సార్‌ విద్యుత్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేతలు వినతిపత్రం ఇచ్చారు. మినీ హార్బర్‌ నిర్మాణానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్థలం సేకరిస్తే ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తన అనుచరులకు కట్టబెట్టాడని కాకినాడ రూరల్‌ దుమ్ములపేట మత్స్యకారులు ఫిర్యాదు చేశారు. తమకు జెట్టి, కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని కోరారు. 

పాదయాత్రలో పార్టీ శ్రేణులు
గురువారం పాదయాత్రలో పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, నరసాపురం, కాకినాడ , రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, కురసాల కన్నబాబు, కవురు శ్రీనివాస్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కాకినాడ సిటీ, పిఠాపురం, ప్రత్తిపాడు, పి.గన్నవరం కో ఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెండెం దొరబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, కొండేటి చిట్టిబాబు, నాయకులు అనంత ఉదయ్‌భాస్కర్, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పార్టీ నేత పితాని అన్నవరం, కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్‌ కుమార్, కాకినాడ పార్లమెంటరీ జిల్లా బీసీ, మైనారిటీ అధ్యక్షులు అల్లి రాజబాబు, అబ్దుల్‌ బషీరుద్దీన్, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు,  కాకినాడ రూరల్‌ నాయకులు లింగం రవి, కాలా లక్ష్మణరావు, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్‌ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top