ఎందుకిలా..!

earthquake in ysr district

చింతకొమ్మదిన్నె మండలంలో మళ్లీ కుంగిన భూమి

బావి తరహాలో ఏర్పడుతున్న గుంతలు

భయాందోళనలో ప్రజలు

ఎటూ తేల్చని శాస్త్రవేత్తలు

2015లోను ఇదే స్థితిలో కుంగిన భూమి

చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె మండలంలో పలు ప్రాంతాల్లో భూమి భారీ స్థాయిలో కుంగుతోంది. మంగళవారం ఉదయం గూడవాండ్లపల్లె, బుగ్గమల్లేశ్వర స్వామి ఆలయ సమీపాల్లో 20 అడుగుల లోతులోకి భూమి ఒక్కసారిగా కుంగి పోయిందని రైతు దస్తగిరి రెడ్డి తెలిపారు. 2015లో ఈ భూమికి సమీపంలోనే రైతు శ్రీనివాసులరెడ్డికి చెందిన పసువు పంటలో రెండు గుంతలు ఏర్పడ్డాయి. ముందుగా భూమి నెర్రలుగా చీలి గుండ్రగా తయారవుతుంది. తర్వాత సుడిగుండంలా ఏర్పడి ఒక్కసారిగి భూమి లోపలికి చొచ్చుకొని పోతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

2015లోను ఏర్పడ్డ గుంతలు
2015 అక్టోబర్‌ నెలలో కురిసిన భారీ వర్షాలకు నాయనోరి పల్లెలోని ప్రభుత్వ పాఠశాల పక్కనున్న ఓవర్‌ హెడ్‌ ట్యాంకు ఒక్కసారిగా కుంగి దాదాపు70 అడుగుల లోతు లోకి చొచ్చుకుపోయింది. అలాగే సమీపంలోని వ్యవసాయ పొలాల్లో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. బుగ్గమల్లేశ్వర స్వామి ఆలయం, నాయనోరి పల్లె, బుగ్గలపల్లె, గూడవాండ్లపల్లె, నాగిరెడ్డిపల్లె, పెద్దముసల్‌ రెడ్డిపల్లె గ్రామాల్లో ఇలాంటి గుంతలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

ఎటూ తేల్చని శాస్త్రవేత్తలు
2015లో చింతకొమ్మదిన్నెతో పాటు వేంపల్లె మండలాల్లో దాదాపు 50కి పైగా గుంతలు ఏర్పడ్డాయి.  ఎక్కడపడితే అక్కడ ఒక్కసారిగా భూమి కుంగి పెద్ద శబ్దంతో చొచ్చుకు పోతుండటంతో రైతులు వ్యవసాయ పొలాల్లోకి వెళ్లేందుకు భయపడ్డారు. ఈ విషయం అప్పటి జిల్లా కలెక్టర్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన పలు దఫాలుగా గుంతలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బృందాలతో కూడిన శాస్త్రవేత్తలను ఈ ప్రాంతానికి పంపించారు. శాస్త్రవేత్తలు గుంతలకు సంబంధించిన లోతు, వెడల్పు కొలతలతో పాటు మట్టి నమూనాలను సేకరించారే తప్ప భూమి కుంగి గుంతలుగా ఎందుకు ఏర్పడుతోందనే విషయాన్ని మాత్రం తేల్చలేదు. దీంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.

ఒక్కసారిగా శబ్దం వచ్చింది
మూడు రోజుల క్రితం చిన్నపాటి గుంత ఏర్పడింది. మంగళవారం ఉదయం పొలంలోని మామిడి చెట్లను చూసేందుకు వెళ్లగా భూమి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కుంగిపోయింది. దీంతో రెండు మామిడి చెట్లు కూడా భూమిలోకి చొచ్చుకుని పోయాయి. ఈ విధంగా గుంతలు పడుతుంటే పొలాల్లోకి వెళ్లాలంటే భయమేస్తోంది.
–ఆంజనేయులు. తోట కాపలాదారుడు, గూడవాండ్లపల్లె

ఎప్పుడు ఎక్కడ కుంగుతుందో
2015లో బుగ్గమల్లేశ్వర స్వామి, గూడవాండ్లపల్లె సమీప వ్యవసాయ పొలాల్లో భూమి కుంగి ఒక్కసారిగా గుంతలు ఏర్పడ్డాయి. మళ్లీ అదే విధంగా ఏర్పడటంతో ఎప్పుడు ఎక్కడ గుంతలు పడతాయోనని భయమేస్తోంది. –గజ్జల ఈశ్వర్‌రెడ్డి, స్థానికుడు, గూడవాండ్లపల్లె

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top