ఇదేం బిల్డప్‌ బాబూ..!

Dwakra Women Meetings For Chandrababu Naidu Meeting Preparations - Sakshi

సీఎంను పొగడాలంటూ డ్వాక్రా మహిళలకు అధికారుల హెచ్చరిక

ఎందుకు పొగడ్తలంటూ అధికారులను నిలదీస్తున్నమహిళలు

తలలు పట్టుకుంటున్న వెలుగు అధికారులు

ప్రకాశం, బేస్తవారిపేట: ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని మహిళలకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు ఇంత వరకు ఆ హామీని నెరవేర్చలేదు. అంతేకాకుండా బ్యాంకుల నుంచి నోటీసులు ఇప్పించి డ్వాక్రా మహిళలను ఎగవేతదారులుగా అవమానపరచాడు. తూతూ మంత్రంగా మూడేళ్ల కాలంలో మూడు విడతల్లో రూ.8 వేలు అందించి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నగదు వడ్డీలకే సరిపోలేదు. చంద్రబాబును నమ్మి సకాలంలో బ్యాంకులకు రుణాలు చెల్లించిక అసలు, వడ్డీ లక్షల్లో పేరుకుపోవడంతో డ్వాక్రా మహిళలు లబోదిబోమంటున్నారు. చేసిన మోసాన్నీ కప్పిపుచ్చుకునేందుకు అదిరించో, బెదిరించో పసుపు–కుంకుమ కార్యక్రమం పేరు చెప్పి అడిగి మరీ పొగిడించుకోవడాన్ని మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇచ్చింది రూ.8 వేలే..
డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు ఇచ్చామని, బ్యాంకు ఖాతాల్లో పడిపోయాయని చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు వాటిని పూర్తిగా అందించలేదు. 2016 జూన్‌లో రూ.3 వేలు, 2017 నవంబర్‌లో రూ.3 వేలు చొప్పున డ్వాక్రా సంఘాల బ్యాంక్‌ ఖాతాలో జమ చేశారు. ఈ ఏడాది రూ.2 వేలు విడుదల కాగా అవి ఇంకా ఖాతాల్లో కొందరికి జమ కాగా, మనికొందరికి జమ కాలేదు.

అధికారులకు చీవాట్లు..
ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పించాలని వెలుగు అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో డ్వాక్రా మహిళలతో వారు చీవాట్లు తింటున్నారు. జిల్లాలోని 56 మండలాల్లో 56,808 ఎస్‌హెచ్‌జీ గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపును కూర్చోపెట్టి అధికారులు వీడియో తీస్తున్నారు. ఈ సమయంలో ఏం చేశారని కృతజ్ఞతలు చెప్పాలని కొందరు, అధిక వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడ్డందుకు బాబూను పొగడాలా అని మరికొందరు మహిళలు ఎదురు తిరుగుతున్నారు. అయితే అటువంటి వీడియోలను అధికారులు యాప్‌లో అప్‌లోడ్‌ చేయకుండా తొలగిస్తున్నారు. మహిళలను బతిమాలాడి మరీ ముఖ్యమంత్రికి అనుకూలంగా వీడియోలు రికార్డు చేస్తున్నారు.

పసుపు– కుంకుమ అప్పులోకే సరిపోలేదు
మహిళలకు అందించిన పసుపు–కుంకుమ నిధిని నేరుగా డ్వాక్రా మహిళల బ్యాంకు పొదుపు ఖాతాలకు జమ చేశారు. అయితే వాటిని తీసుకునేందుకు మాత్రం అనుమతులు ఇవ్వలేదు. అలాగే కొన్ని బ్యాంకుల్లో ఈ నిధిని నేరుగా వారి అప్పుకు జమ చేసినట్లు మహిళలు తెలిపారు.

డ్వాక్రా మహిళలను మోసం చేశారు
డ్వాక్రా మహిళలను మోసం చేసి, ఇప్పుడు పొగిడించుకోవడం చంద్రబాబుకే చెల్లింది. అసలు, వడ్డీలు కట్టలేక అనేక ఇబ్బందులు పడ్డాం. రూ.8 వేలు ఇచ్చి పెద్ద మేలు చేసినట్లు అడిగి మరీ కృతజ్ఞతలు చెప్పించుకోవడం సిగ్గుచేటు. గతంలో ఎవ్వరూ ఇలాంటి రాజకీయాలు చేయలేదు. డ్వాక్రా మహిళలకు మంచి చేసుంటే మనస్ఫూర్తిగానే చెప్పేవాళ్లం. ఇదేంటి మహిళలను మోసం చేసి పొగిడించుకోవడంతో ఏమిటో అర్థం కావడంలేదు. పసుపు–కుంకుమ కింద ఇచ్చిన అరకొర నగదు వడ్డీకే సరిపోలేదు.మారూరి సుబ్బమ్మ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top