రోగులు జాస్తి.. సేవలు నాస్తి

Doctors Negligence In Kurnool Hospital - Sakshi

నంద్యాల ఆసుపత్రిలో అన్నీ సమస్యలే

వేధిస్తున్న సిబ్బంది కొరత పడకలు పెంచినా ఫలితం శూన్యం

అరకొర మందులే గతి తిరగని ఫ్యాన్లు.. దోమల బెడద

మొరాయిస్తున్న సిటీ స్కాన్‌

కొందరు వైద్యులకు సొంత ప్రాక్టీస్‌పైనే శ్రద్ధ

కర్నూలు, నంద్యాల ప్రభుత్వాసుపత్రి పేరుకే జిల్లా ఆసుపత్రి గానీ ఇక్కడ రోగులకు కనీస వైద్యసేవలు అందడం లేదు. వివిధ రకాల వ్యాధులతో ఆసుపత్రికి వచ్చి.. వైద్య సేవలు పొంది తిరిగి వెళ్లే
సమయానికి నరకం కనిపిస్తోందని బాధితులు వాపోతున్నారు. సిబ్బంది, మందుల కొరత, సౌకర్యాల లేమి, వైద్యసిబ్బంది నిర్లక్ష్యం తదితర సమస్యలు రోగులను కుంగదీస్తున్నాయి.

కర్నూలు, నంద్యాల: పట్టణంలోని నూనెపల్లెలో జిల్లా ఆసుపత్రిని మొదట 250 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. రెండేళ్ల క్రితం మరో 150 పడకలు పెంచారు. అందుకు తగ్గ సిబ్బందిని మాత్రం నియమించలేదు. ప్రతిరోజూ 900 నుంచి 1,500 మంది దాకా రోగులు ఓపీకి వస్తుంటారు. అలాగే ఇన్‌పేషెంట్లు 500 మంది దాకా ఉంటారు. నంద్యాల నియోజకవర్గం నుంచే కాకుండా ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బనగానపల్లె,కోవెలకుంట్ల, పాణ్యం నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. వీరికి సరైన వైద్యసేవలు అందడం లేదు. రోగి పరిస్థితి కొంచెం ప్రమాదకరంగా ఉంటే చాలు.. తమ చేత కాదని, కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని  వైద్యులు సూచిస్తున్నారు.

మందుల కొరత
ఆసుపత్రిలో మందుల కొరత వేధిస్తోంది. దీంతో వైద్యులు రాసిన మేరకు మెడిసిన్‌ ఇవ్వడానికి ఫార్మాసిస్ట్‌లు వెనుకంజ వేస్తున్నారు. వైద్యులు 15 టాబ్లెట్లు రాస్తే ఐదు మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చే రోగులు రోజుకు వెయ్యి దాటుతున్నారని, కావున ఆచితూచి మందులు ఇస్తున్నామని ఫార్మాసిస్ట్‌ విక్టర్‌ తెలిపారు.

ఎప్పుడూ మొరాయింపే
ఆసుపత్రిలో సిటీస్కాన్‌ ఎప్పుడు పనిచేస్తుందో తెలియని పరిస్థితి. నెల రోజులు పని చేస్తే మరో నెల మొరాయిస్తోంది. ఇప్పుడు పని చేయక ఆరు నెలలు అవుతోంది. బయట సిటీ స్కాన్‌ చేయించుకోవాలంటే రూ.1,500 నుంచి రూ.3వేల వరకు ఖర్చు అవుతుందని రోగులు చెబుతున్నారు. 

తిరగని ఫ్యాన్లు
నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్సకు వచ్చే వారు తమ వెంట టేబుల్‌ ఫ్యాను కూడా తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కొంత కాలంగా ఇక్కడ కొన్ని ఫ్యాన్లు పనిచేయటం మానేశాయి. రోగికి జబ్బు త్వరగా నయం కావాలంటే తగినంత నిద్ర అవసరం. ఇక్కడ దోమలతో రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. ఇక పగలు ఉక్కపోతతో మంచం మీద అల్లాడిపోవాల్సిందే. అన్ని వార్డులలో ఇదే సమస్య. దీంతో పలువురు సొంత ఫ్యాన్లు తెచ్చుకుని ఊరట పొందుతున్నారు. ఆసుపత్రికి వేలాదిమంది వస్తున్నా.. వారికి మంచినీటి సదుపాయం కూడా కల్పించడం లేదు. బయటి నుంచి వాటర్‌ బాటిళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది.

పన్నెండు దాటితే పత్తా ఉండరు!
కొందరు వైద్యులు  ప్రభుత్వ ఆసుపత్రిలో విధులను గాలికి వదిలి సొంత క్లినిక్‌లపై శ్రద్ధ చూపిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మహిళా వైద్యులైతే ప్రసవం కోసం వచ్చిన మహిళలను ఇక్కడ కాన్పు చేయడం కష్టమని భయపెడుతూ సొంత క్లినిక్‌లకు తీసుకెళుతున్నట్లు విమర్శలున్నాయి. ప్రముఖ చిన్న పిల్లల వైద్యుడైతే ఇక్కడ తగ్గకపోతే నేరుగా తన క్లినిక్‌కు రమ్మని నిర్మొహమాటంగా చెబుతున్నట్లు సమాచారం. ఇక ఉదయం పన్నెండు గంటలు దాటితే వైద్యులు ఆసుపత్రిలో ఒక క్షణం కూడా ఉండటం లేదు. వైద్య, ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం ప్రతి వైద్యుడు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు  విధులు నిర్వర్తించాలి. ఇక్కడమాత్రం 10 తర్వాత వచ్చి 12 గంటలకల్లా వెళ్లిపోతున్నారని రోగులు వాపోతున్నారు. ఇదేంటని ఆసుపత్రి ఉన్నతాధికారిని ప్రశ్నించగా.. వైద్యులు వస్తున్నారా, లేదా అనే విషయం తన కింది స్థాయి మహిళా అధికారికే తెలుసని చెప్పడం గమనార్హం.

డయాలసిస్‌ వార్డులో నీటి కొరత
కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికోసం ప్రభుత్వం 2016లో డయాలసిస్‌ సెంటర్‌æను ప్రారంభించింది. ఈ విభాగం బాధ్యతలను నెఫ్రోప్లస్‌ అనే ప్రైవేటు సంస్థకు అప్పజెప్పారు. ఇక్కడ విడతల వారీగా  80 మంది దాకా చికిత్స చేయించుకుంటున్నారు. మినరల్‌ వాటర్‌ కోసం డయాలసిస్‌ సెంటర్‌ వద్ద రెండు వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటుచేశారు. అయినప్పటికీ ఇక్కడ  నీటి కొరత ఉండడంతో బయటి నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది.  

రోగులను పట్టించుకునే నాథుడే లేరు
నంద్యాల ఆసుపత్రికి వచ్చే రోగులను వైద్యసిబ్బంది పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు రాస్తారోకోలు, ధర్నాలు చేసినా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆసుపత్రిలో మంచినీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులు వస్తే వారిని వెంటనే కర్నూలుకు రెఫర్‌ చేస్తున్నారు.  మందులు సరిగా ఇవ్వకపోవడంతో  బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆసుపత్రిలో సమస్యలను తీర్చాలని జిల్లా కలెక్టర్‌కు కూడా ఎన్నోసార్లు విన్నవించాం.  – బాబాఫకృద్దీన్,సీపీఐ నాయకుడు, నంద్యాల

వైద్య సేవలు అందిస్తున్నాం
ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. అత్యవసర పరిస్థితి అయితేనే  కర్నూలుకు రెఫర్‌ చేస్తున్నాం. సిటీస్కాన్‌ పని చేయకపోవడం వాస్తవమే. త్వరలోనే మరమ్మతులు చేయిస్తాం.    
– డాక్టర్‌ విజయకుమార్,ఆసుపత్రి సూపరింటెండెంట్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top