సాగునీటి పంపిణీలో రాజకీయ జోక్యాన్ని సహించం

సోమిరెడ్డి అవినీతిని అడ్డుకోవడం తప్పా? 

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి    

వెంకటాచలం: సాగునీటి పంపిణీలో రాజకీయ జోక్యాన్ని సహించేదిలేదని వైఎస్సార్‌ సీపీ నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. తిరుపతి ఎంపీ వి.వరప్రసాద్‌రావుతో కలిసి ఆదివారం మండలంలోని సర్వేపల్లి రిజర్వాయర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా గుడ్లూరువారిపాళెం కాలువకు సాగునీటి విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం మండలాధ్యక్షుడు ఈపూరు రజనీకాంత్‌రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రిజర్వాయర్‌లో నీరుంటే ఎందుకు విడుదల చేయరని డీఈ శంకర నారాయణను ఎమ్మెల్యే ప్రశ్నించారు.

 అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సోమశిల జలాశయంలో పుష్కలంగా నీరున్నా సాగునీటి పంపిణీలో రాజకీయ జోక్యంతో రైతులను ఇబ్బందులు పెట్టడం తగదన్నారు. సాగునీటి సంఘం అధ్యక్షులను రైతుల ద్వారా ఎన్నుకోకుండా నామినేషన్‌ పద్దతిలో అవగాహనలేని వ్యక్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక చేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీకి చెందిన రైతుల పొలాలు ఎక్కువగా ఉన్నచోట నీటి విడుదల చేయకపోవడాన్ని సహించేదిలేదన్నారు. 

తన వాటాల కోసం అన్నీ పనుల్లో మంత్రి సోమిరెడ్డి అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అవినీతిని ప్రశ్నిస్తే అభివృద్ధిని న్యాయస్థానాలకు వెళ్లి అడ్డుకుంటున్నారని ప్రచారం చేయడం సరికాదన్నారు. తిరుపతి ఎంపీ వి.వరప్రసాద్‌రావు మాట్లాడుతూ చంద్రబాబు పాలన అభివృద్ధిలో నెంబర్‌ వన్‌ కాదని అవినీతిలో నిలిచిందన్నారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శి కె.కోదండరామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ఎం.వెంకటశేషయ్య, పార్టీ యువజన విభాగం రాష్ట్రకార్యదర్శి కె.ప్రదీప్‌కుమార్‌రెడ్డి, పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శులు కె.మోహన్‌నాయుడు, వి.వెంకటేశ్వర్లు, ఎ.ప్రభాకర్‌రెడ్డి  పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top