పెన్షనర్ల విభజనా సంక్లిష్టమే!

పెన్షనర్ల విభజనా సంక్లిష్టమే! - Sakshi

హైదరాబాద్: రాష్ట్ర విభజనలో ఉద్యోగుల మాదిరే పెన్షనర్ల కేటాయింపు కూడా సంక్లిష్టమైన ప్రక్రియ కానుంది. కేవలం స్థానికత, సర్వీసు ఆధారంగా పెన్షనర్లను విభజించడం సాధ్యం కాదని పెన్షనర్ల సంఘాలు అంటున్నాయి. స్థానికత ఆధారంగా విభజించడానికీ.. ప్రభుత్వం వద్ద ఇప్పటివరకు పక్కా లెక్కలు లేవు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది పెన్షనర్లు ఉండగా ఈ ఏడాది దాదాపు 45 వేల మంది పదవీ విరమణ చేయనున్నారు. 

 

ఇలావుండగా దాదాపు లక్ష మంది పెన్షనర్లు జంటనగరాల్లోనే ఉన్నారు. హైదరాబాద్ పెన్షన్ చెల్లింపు అధికారి ద్వారా పెన్షన్లు అందుకుంటున్నారు. సర్వీసు చేసిన ప్రాంతాన్ని ఆధారంగా తీసుకుంటే.. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారందరికీ తెలంగాణ రాష్ట్రం పెన్షన్లు చెల్లించాల్సి ఉంటుంది. పెన్షనర్లు ఏ ప్రాంతానికి లేదా జిల్లాలకు చెందినవారనే విషయాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం వద్ద తగిన సమాచారం లేదు. 60 శాతం పెన్షనర్లు తెలంగాణ ప్రాంతంలోనే పెన్షన్లు పొందుతున్నారని ప్రాథమిక అంచనా. ఈ వివరాల ఆధారంగా విభజిస్తే.. తెలంగాణ మీద ఎక్కువ భారం ఉంటుందని తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు.

 

రెండు రాష్ట్రాల వైశాల్యం, జనాభా ఆధారంగా.. రాష్ట్రస్థాయి పోస్టులు, శాఖాధిపతుల కార్యాలయాలు, సచివాలయంలో పనిచేసి పదవీ విరమణ చేసిన వారిని విభజించినా.. పెద్ద సంఖ్యలో తెలంగాణేతర ప్రాంతాల వారికి పెన్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉద్యోగాల్లో న్యాయమైన వాటా దక్కకపోవడం వల్ల ఒకసారి అన్యాయం జరిగితే, తెలంగాణేతర ప్రాంతాల వారికి పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇచ్చి ఆర్థిక భారాన్ని మోయడం రెండో అన్యాయమవుతుందని అంటున్నారు. స్థానికతను గుర్తించి దాని ఆధారంగా పెన్షనర్లను విభజిస్తే మాత్రం అధిక శాతం మందికి సీమాంధ్ర పెన్షన్ చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

 

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ విభజనలో.. కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర సలహా మండలి సిఫారసు మేరకు ఉద్యోగాలను విభజించిన దామాషాలోనే పెన్షనర్లనూ విభజించారు. బీహార్ విభజనలో మాత్రం పెన్షన్ల భారాన్ని జార్ఖండ్‌కు బదిలీ చేయలేదు. ప్రస్తుతం రెవెన్యూ షేరింగ్, ఆస్తుల, అప్పుల విభజన తరహాలోనే పెన్షన్ల భారాన్ని విభజిస్తారని అధికారులు చెబుతున్నారు. పెన్షన్ల భారం విషయంలో రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ సిఫారసు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు పాటించాల్సి ఉంటుందని ట్రెజరీ శాఖ వర్గాలు అంటున్నాయి.

 

పెన్షన్ల చెల్లింపు భారం రూ.13 వేల కోట్లు

ప్రస్తుతం పెన్షన్ల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. పెన్షనర్లకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కరువు భృతి(డీఆర్) పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెరిగే డీఏ ఆధారంగా మన రాష్ట్రంలో డీఆర్ నిర్ధారిస్తున్నారు. పెన్షనర్ల వయసు పెరుగుదల మేరకు పెన్షన్ పెంచుతున్నారు. ఫలితంగా పెన్షన్ల భారం ఏటా పెరుగుతోంది. మొత్తం పెన్షనర్లలో 20 % మంది రూ. 10 వేలకు అటు, ఇటుగా పెన్షన్ పొందుతుండగా, 60 శాతం మంది రూ. 20-40 వేల మధ్య పెన్షన్ తీసుకుంటున్నారు. మిగతా 20 శాతం మంది రూ.40 వేలకుపైగా పెన్షన్ అందుకుంటున్నారని అంచనా.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top