భక్తుల మనోభావాలతో చెలగాటమా?

Divine battle at TTD - Sakshi

టీటీడీ పవిత్రతను మంటగలుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం

ఆది నుంచి దేవాలయాలను కూలదోస్తూ హిందువుల విశ్వాసాలను దెబ్బతీçస్తున్నారంటూ భక్తుల ఆగ్రహం

తప్పులను ఎత్తిచూపిన శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై వేటు పట్ల విస్మయం

వేంకటేశ్వరుని సన్నిధిలో ప్రభుత్వ పెద్దలు అవకతవకలకు పాల్పడుతున్నారంటూ భక్తుల సందేహాలు

అర్చకులు, ఆలయాల్లో పనిచేసే సేవకుల సంక్షేమం కోసం ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయని సర్కార్‌

సాక్షి, అమరావతి: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పవిత్రతను కాపాడి భక్తుల మనోభావాలు పరిరక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పెత్తనం కోసం తద్భిన్నంగా వ్యవహరించింది. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటూ హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతోందంటూ కోట్లాది మంది శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. ఆదిలో తిరుమల వేయికాళ్ల మండపాన్ని కూలదోయించిన సీఎం చంద్రబాబు రెండేళ్ల క్రితం కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో పదుల సంఖ్యలో హిందూ దేవాలయాలను నేలమట్టం చేయించారని గుర్తు చేస్తున్నారు.

తాజాగా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగడంతో భక్తుల్లో అనుమానాలు రెట్టింపవుతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి ఆలయంలో ప్రభుత్వ పెద్దలు భారీగా అవకతవకలకు పాల్పడుతున్నారనే భావన నానాటికీ బలపడుతోంది. శతాబ్దాలుగా శ్రీవారికి వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. వంశపారంపర్యంగా అర్చకులు స్వామి వారికి పూజాదికాలు, సేవలు చేస్తూ వస్తున్నారు.

అయితే      ఇటీవల శ్రీవారిని మేలుకొలిపే సుప్రభాత సేవను ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా నిర్వహిస్తుండటం, తోమాలసేవ వంటి సేవలను తక్కువ సమయంలోనే ముగించాలని అర్చకులపై ఒత్తిడి తెస్తుండటాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. చివరకు స్వామివారికి ప్రసాదాల నివేదనపై కూడా ఆంక్షలు విధించడం.. సేవలలో అధికార పార్టీ నేతలు వందిమాగధులతో హడావుడి చేస్తుండడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా అడుగడుగునా శ్రీవారి ఆలయ పవిత్రతను మంటగలుపుతుండటాన్ని చూసి సహించలేక ప్రధాన అర్చకులు రమణదీక్షితులు సర్కార్‌ తప్పులను ఇటీవల ఎత్తిచూపడం చర్చనీయాంశంగా మారింది.  

తప్పులు దిద్దుకోండా ఎదురుదాడి
పరిపాలనలో తప్పులను, అక్రమాలను ఎత్తిచూపిన ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగిన తరహాలోనే రమణదీక్షితులుపై కక్ష సాధింపులకు దిగడం ద్వారా ప్రభుత్వ పెద్దలు మరో మారు తమ నైజాన్ని బయటపెట్టుకున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. రమణ దీక్షితులు సంధించిన ఏ ఒక్క ప్రశ్నకూ సర్కార్‌ సమాధానం చెప్పకపోవడంతో భక్తుల్లో ఉన్న అనుమానాలు బలపడుతున్నాయి.

వంశపారంపర్యంగా 1996 వరకూ శ్రీవారి అభరణాలను సంరక్షిస్తూ వచ్చామని.. కానీ ఇప్పుడు వాటికి లెక్కలు చెప్పేవాళ్లు లేరని.. శ్రీకృష్ణదేవరాయులు స్వామి వారికి సమర్పించిన ఆభరణాలు ఏమయ్యాయో చెప్పాలని రమణదీక్షితులు ప్రశ్నించారు. భక్తులు హుండీ ద్వారా సమర్పించిన కానుకలు స్వామి వారి సేవలకు మాత్రమే వినియోగించాలని, కానీ అధికారపార్టీ ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు మంజూరు చేయాలని కోరడం ఏమిటని నిలదీశారు.

ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అత్యంత పవిత్రమైన శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు నిర్వహిస్తున్నారని రమణదీక్షితులు మండిపడ్డారు. ఆయన ఎత్తిచూపిన తప్పులను దిద్దుకోవాల్సిన సర్కార్‌ తద్భిన్నంగా.. కక్ష సాధింపు చర్యలకు దిగింది. వయో పరిమితి అస్త్రాన్ని ప్రయోగించి.. 65 ఏళ్లు నిండిన రమణదీక్షితులుతోపాటూ మరో ఇద్దరిపై వేటు వేసింది. ఈ పరిణామాలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి. సదావర్తి సత్రం భూములను తక్కువ ధరకు కాజేసేందుకు ఎత్తు వేసిన తరహాలోనే ప్రభుత్వ పెద్దలు శ్రీవారి ఆభరణాలను మాయం చేశారని భక్తులు అనుమానిస్తున్నారు.

రాజకీయ పెత్తనం కోసమే:
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీతోపాటూ ఇతర ప్రధాన ఆలయాలపై రాజకీయ పెత్తనం చెలాయిస్తూ వస్తోంది. టీటీడీ సాంప్రదాయం ప్రకారం పాలక మండలి పదవీ కాలం పూర్తయితే.. కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసే వరకూ స్పెసిఫైడ్‌ అథారిటీని ఏర్పాటు చేయాలి. అయితే ఏప్రిల్, 2017తో అప్పటి పాలక మండలి గడవు పూర్తి కాగా ఏడాది తర్వాత గత నెలలో కొత్త పాలక మండలిని ఏర్పాటు చేశారు.

అంటే ఏడాదిపాటూ స్పెసిఫైడ్‌ అథారిటీని ఏర్పాటు చేయకుండా.. తాము ఎంపిక చేసుకున్న అధికారుల ద్వారా టీటీడీలో ఇష్టారాజ్యంగా పనులు చక్కబెట్టుకున్నారనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. ఇటీవలే పాలకమండలిని ఏర్పాటు చేసినప్పటికీ అందులో అన్యమతానికి చెందిన ఎమ్మెల్యేను నియమించారనే విమర్శలు వచ్చాయి. దాంతో ఆ ఎమ్మెల్యేలను తొలగించారు. పాలకమండలి అధ్యక్షుడిపైనా ఇలాంటి ఆరోపణలే రావడం గమనార్హం. రాజకీయ ప్రయోజనాలు, ఆధిపత్యం కోసం కోట్లాది మంది ప్రజల మనోభావాలతో చెలగాటమాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

ధార్మిక పరిషత్‌ ఏదీ? ఎక్కడ?:
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అర్చకుల సంక్షేమంతో పాటు ఆలయాల్లో వివిధ సేవలందించే వారందరి సంక్షేమం కోసం ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నాలుగేళ్లుగా ప్రభుత్వం ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయడం లేదు. ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేస్తే కొన్ని అధికారాలు ప్రభుత్వం నుంచి పరిషత్‌కు సంక్రమిస్తాయి. అర్చకులు, ఆలయాల్లో పనిచేసే వారందరి బాగోగులను పరిషత్‌ చూస్తుంది. ఈ పరిషత్‌ ఏర్పాటు చేస్తే ప్రభుత్వంలోని పాలకుల ఆధిపత్యానికి చెక్‌ పడుతుందనే నెపంతోనే కాలయాపన చేస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top