నెల రోజులు..పెను మార్పులు

Different Changes Come in People in Month Lockdown - Sakshi

లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన ప్రజలు

ఆరోగ్యంపై పెరిగిన అవగాహన

విస్తృతంగా సేవాకార్యక్రమాలు

తగ్గుముఖం పట్టిన నేరాలు

కుదేలైన ఆర్థిక వ్యవస్థ

కర్నూలు(సెంట్రల్‌)/అగ్రికల్చర్‌: సమస్యల పరిష్కారం కోసం ఒక్కరోజు బంద్‌కు పిలుపునిస్తే తిట్టుకునే రోజులివి. అలాంటిది ఒక్కరోజు కాదు..రెండు రోజులు కాదు..ఏకంగా నెల రోజులుగా లాక్‌డౌన్‌ను ప్రజలు ఎంతో ఓపికతో పాటిస్తున్నారు. నిత్యావసరాలు, అత్యవసరాలు ఉన్నా, లేకున్నా సర్దుకుపోతున్నారు. బతికుంటే చాలు అనుకొని.. పనులు మానేసి..దురలవాట్లను దూరం చేసుకున్నారు. ముప్పై రోజుల్లో ఎవరూ ఊహించని విధంగా ప్రజా జీవనంలో పెను మార్పులు వచ్చాయి.

ఆదాయమేదీ?
లాక్‌డౌన్‌.. జిల్లా స్థూల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. జిల్లాలోని 45 లక్షల మంది వ్యక్తిగత ఆదాయాలు పడిపోయాయి. ఉద్యోగుల జీతాల్లో కటింగ్‌లు చోటుచేసుకోగా..కార్మికులు ఉపాధి  కోల్పో యారు. రబీ ముగింపులో కరోనా ప్రభావం పడడంతో మొక్కజొన్న, జొన్న, బొప్పాయి, బత్తాయి, అరటి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  ప్రభుత్వ చొరవతో ఇబ్బందులు తొలగాయి. జిల్లాలోని 4,700 చిన్న పరిశ్రమలు మూతపడగా..మూడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు సమాచారం. ప్రభుత్వానికి వివిధ రూపాల్లో జమ కావాల్సిన ఆదాయం గత నెల 22వ తేదీ నుంచే బంద్‌ అయింది. హోటళ్లు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కుప్పకూలిపోయింది. రెడ్‌జోన్లలోని 93 బ్యాంకు శాఖలు సైతం మూత పడ్డాయి. మార్చిలో రూ.1000 కోట్లు, ఏప్రిల్‌లో రూ.500 కోట్ల దాకా ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయినట్లు స్పష్టమవుతోంది.

పరిశుభ్రతకు ప్రాధాన్యం
పట్టణాల్లో నిత్యం రద్దీగా ఉండే వీధులు నిర్మానుష్యమయ్యాయి. గ్రామాల్లో సైతం ప్రజలు బయటకు రాకుండా కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు. జిల్లాలో మార్చి 28వ తేదీన తొలి పాజిటివ్‌ కేసు నమోదైంది. ఆ తరువాత వైరస్‌ విజృంభణ ప్రారంభమైంది. కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్లలో ఎక్కువ కేసులు నమోదు కాగా.. ఆదోని డివిజన్‌ కేవలం ఒక్క కేసుతో సురక్షిత ప్రాంతంగా ఉంది. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ భౌతిక దూరాన్ని కూడా అలవాటు చేసుకున్నారు. తిండిలేక అల్లాడుతున్న నిరాశ్రయులకు భోజనాలతోపాటు పండ్లు, కూరగాయలు,
నిత్యావసరాలు అందజేసి దాతృత్వాన్నిచాటుకుంటున్నారు.  

నేరం.. దూరం
కర్నూలు: వేసవి కాలం వచ్చిందంటే ప్రజలు ఆరుబయట తిరగడం.. విహారయాత్రలకు వెళ్లడం పరిపాటి. ఇదే అదనుగా నేరగాళ్లు దొంగతనాలు, దోపిడీలకు పాల్పడేవారు. ప్రతి ఏటా ఈ తరహా కేసులు ఆధికంగా నమోదయ్యేవి. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కరోనా మహమ్మారితో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో నేరాలు తగ్గుముఖం పట్టాయి. దొంగల అలజడి లేదు, దోపిడీలు జరగట్లేదు. రోడ్డు ప్రమాదాల చప్పుడు వినిపించడం లేదు.  లాక్‌డౌన్‌ తర్వాత జిల్లాలో నేరాల రేటు 89 శాతం,. రోడ్డు ప్రమాదాల రేటు 92 శాతం తగ్గింది. చీటింగ్‌ కేసులు, హత్యానేరాల్లో వంద శాతం తగ్గుదల కన్పిస్తోంది. రాష్ట్ర సరిహద్దులతో పాటు జిల్లాలోనూ చెక్‌పోస్టులు పూర్తిగా మూసివేసి ఉండటం, రైళ్లు, బస్సులు నడవకపోవడంతో నేరాలు చేసే ముఠాలు ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాయి.    మద్యం దుకాణాలు మూసి ఉండడంతో  ఘర్షణ కేసులు పూర్తిగా తగ్గాయి.

పేదలకు అండగా ప్రభుత్వం..
కరోనా ప్రభావంతో ఆదాయాన్ని కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. పేదలెవరూ పస్తులు ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్‌లో మూడు సార్లు రేషన్‌తోపాటు రూ.1000 చొప్పున నగదు అందించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే జిల్లాలోని 11,91,344 మందికి రెండు సార్లు బియ్యం, బ్యాళ్లు, రూ.1000 నగదు చొప్పున అందించారు. మద్దతు ధర లేక అల్లాడిపోతున్న రైతులను ఆదుకునేందుకు ఊర్లలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించారు. గ్రీన్‌జోన్లలో సడలింపులు ఇచ్చి.. మూసివేసిన చిన్న పరిశ్రమలను తెరిపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.   

పోలీసులు జాగారం చేస్తున్నారు
లాక్‌డౌన్‌ మొదలైన రోజు నుంచి పోలీసులు రోడ్లపై జాగారం చేస్తున్నారు. ఫలితంగా నిఘా పెరిగి నేరాలు తగ్గాయి.   ప్రస్తుత పరిస్ధితులలో అంతర్రాష్ట్ర సరిహద్దులతో పాటు జిల్లా చెక్‌పోస్టులలో పకడ్బందీ తనిఖీలుకొనసాగుతున్నాయి.   –  ఫక్కీరప్ప, ఎస్పీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top