డీజిల్‌ సబ్సిడీ దూరం.. వేట భారం

Diesel Subsidy Cut to Fishermen Visakhapatnam - Sakshi

ఏటేటా పెరిగిపోతున్నవేట ఖర్చు

దిక్కుతోచని జాలర్లు

డీజిల్‌ బంక్‌ తెరిపించి రాయితీ  కల్పించాలని వినతి

విశాఖపట్నం, అచ్యుతాపురం(యలమంచిలి): మత్స్యకారులు ఒకప్పుడు మొలకు బుంగ తగిలించుకుని, వల భుజాన వేసుకొని వెళితే సాయంత్రానికి అమ్మగా కూరకు చేపలు తెచ్చుకునేవారు. ఆ తరువాత కాలంలో అలివల విసిరి ఒడ్డున ఉండి చేçపలు పట్టేవారు. అలివల, ఒక పడవ ఉంటే ఊరందరికీ ఉపాధి లభించేది. వేటలో «ఆధునికత చోటు చేసుకున్నాక తెరచాప చాలాకాలం  ఆసరాగా నిలిచింది. తెరచాపకట్టి ఆటుపోటుల ఆధారంగా  వేటకు వెళ్లి వచ్చేవారు. ప్రస్తుతం వేట స్వరూపమే మారిపోయింది. డీజిల్‌ లేకుంటే ఆ రోజు వేట మానేయాల్సిందే. మునుపటిలా తెరచాపవేటకు కాలం చెల్లింది. గాలి వాటం కోసం ఎదురు చూసే రోజులు పోయాయి. పది లీటర్ల డీజిల్‌తో వందల కిలోమీటర్ల దూరం వెళ్లి చేపల్ని వేటాడే నైపుణ్యాన్ని గ్రామీణ మత్స్యకారులు సాధించారు. వీరు వినియోగించే డీజిల్‌ లీటర్‌కు 6.40పైసల రాయితీని కల్పిస్తూ కేంద్రప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో పూడిమడకలో  ఏర్పాటు చేసిన డీజిల్‌ బంక్‌ మూతతో మత్స్యకారులు నానా అవస్థలు పడుతున్నారు. కల్తీ డీజిల్‌తో యంత్రాలు పాడైపోయి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఐదేళ్లుగా బంకు తెరుచుకోకపోవడంతో రూ.లక్షల్లో నష్టపోతున్నారు.  డీజిల్‌ దూరమై వేట భారమై మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. కేంద్రప్ర భుత్వం చొరవ తీసుకుని బంక్‌ను తెరిపించాలని కోరుతున్నారు. 2002లో రిజిస్టర్డు బోట్ల ఆధారంగా డీజిల్‌ రాయితీకి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అప్పట్లో పూడిమడకలో 75బోట్లు అర్హత సాధించాయి. నాటి నుంచి బంకు ఏర్పాటు చేయాలంటూ మత్స్యకారులు పోరాడుతూ వచ్చారు. ఎట్టకేలకు 2011లో బంకు మంజూరైంది. మత్స్యశాఖ  2.5లక్షలతో బంకుని ఏర్పాటు చేసింది. దీనిని నిర్వహించే ఉద్యోగి 2013లో పదవీ విరమణ చేశారు. నాటి నుంచి బంకు తెరచుకోలేదు. ఇప్పుడు శాశ్వతంగా మూతపడింది.

రూ.లక్షల సబ్సిడీ అందడంలేదు
2002లో మత్స్యకార సొసైటీలో సభ్యులుగా ఉంటూ వేట సాగించేవారికి రాయితీపై డీజిల్‌ ఇస్తున్నారు. అప్పట్లో పూడిమడకకు చెందిన  75 మంది అర్హత సాధించారు. వారిలో ఇప్పుడు ఐదుగురు మాత్రమే వేట సాగిస్తున్నారు. 2002 తరువాత లబ్ధిదారుల గుర్తింపు చేపట్టలేదు.  ఇక్కడ వేటకు వెళ్లే ప్రతి పడవకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తే రోజుకు రూ. 70వేలు అందాలి. ఇలా  ఏడాదికి రూ.2కోట్లు సబ్సిడీ అందాల్సి ఉంది. ప్రస్తుత రిజిస్ట్రేషన్‌ ప్రకారం బోట్లను ఎంíపికచేసి సబ్సిడీ వర్తింపజేయాలని మత్స్స్య కారులు కోరుతున్నారు.

సబ్సిడీ ఇస్తే వేటకు మనుగడ  
సముద్రంలో  మత్స్యసంపద తగ్గిపోతోంది. కొన్నిరోజులు వట్టిచేతులతోనే తిరుగుముఖం పట్టే దుస్థితి. డీజిల్‌ఖర్చుకు భయపడి మత్స్యకారులు వేటకు దూరమవుతున్నారు. ఏడాదిలో సగం రోజులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరికొందరు ప్రత్యామ్నాయ వృత్తులవైపు దృష్టి సారిస్తున్నారు. డీజిల్‌ సబ్సిడీ అమలైతే మత్స్యకారులపై వేటఖర్చు భారం తగ్గుతుంది. తద్వారా రోజువారీ వేట సాగించడానికి వీలవుతుందని మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు.  కేంద్రప్రభుత్వం చొరవతీసుకొని త్వరితగతిన బంకును తెరిపించి సబ్సిడీ వర్తింపజేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.

కల్తీ డీజిల్‌తో తీవ్ర నష్టం
పూడిమడకలో సుమారు వెయ్యి పడవలున్నాయి. ఒక్కోదానికి రోజుకు పదిలీటర్ల డీజిల్‌ అవసరం. అంటే పదివేల లీటర్లు వినియోగిస్తారు.  గ్రామంలో  బంకు మూతపడడంతో డీజిల్‌ కోసం అచ్యుతాపురం రావలసి వస్తోంది. రోజూ అంతదూరం వచ్చి వెళ్లలేక గ్రామంలో అందుబాటులో ఉండే కల్తీ డీజిల్‌ను వినియోగిస్తున్నారు. ఈ కారణంగా మైలేజీ రాకపోవడం, ఇంజన్లు పాడైపోవడంతో మత్స్యకారులు నష్టపోతున్నారు. ఒకపక్క ఉప్పుగాలికి ఇంజన్లు తుప్పుపట్టి పాడైపోతుంటే డీజిల్‌ కొరత కారణంగా ఐదేళ్లు ఉపయోగపడాల్సిన ఇంజిన్లు మూడేళ్లకే మూలకు చేరుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top