డెంగీ బాధితులకు ఎమ్మెల్యే రాజా పరామర్శ

డెంగీ బాధితులకు ఎమ్మెల్యే రాజా పరామర్శ


 కాకినాడ క్రైం:డెంగీతో బాధపడుతూ కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గురువారం రాత్రి పరామర్శించారు. జీజీహెచ్‌లోని ప్రత్యేక వార్డులో 28 మంది చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. వారిలో ఎనిమిది మందికి డెంగీ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. మిగిలిన వారిని అనుమానితులుగా ప్రత్యేక వార్డులో ఉంచి వైద్య సేవలందిస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి రిపోర్టుల ఆధారంగా వారికి డెంగీ సోకింది లేనిది నిర్ధారిస్తామని ఎమ్మెల్యేకు వైద్యులు వివరించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి సజావుగానే ఉందన్నారు. డెంగీ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు. కలెక్టర్ నీతూ ప్రసాద్, ఏజేసీ మార్కండేయులు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.పవన్ కుమార్ తదితరులతో ఎమ్మెల్యే రాజా ఫోన్‌లో మాట్లాడారు. జీజీహెచ్‌లోని డెంగీ రోగులు ఉన్న వార్డులో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు నాగం దొరబాబు, కంకిపాడు జమీలు ఉన్నారు.  

 

 మహిళకు డెంగీ లక్షణాలు.. కిమ్స్‌లో చికిత్స

 అమలాపురం రూరల్ : డెంగీ లక్షణాలు ఉన్న కాకినాడకు చెందిన కనుమూరి సూర్యకుమారికి అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ ఎం.పవన్‌కుమార్ బుధవారం రాత్రి ఆమెను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద డెంగీ కేసుగా నిర్ధారించి వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు. రోగికి అవసరమైన ప్లేట్‌లె ట్లను రాజమండ్రి బ్లడ్ బ్యాంకుతో మాట్లాడి ఏర్పాటు చేశారు. వ్యాధి లక్షణాలను పరిశీలించి రోగి పరిస్థితి మెరుగ్గా ఉందని రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి చేయవచ్చని పవన్ కుమార్ తెలిపారు.

 

 డెంగీ జ్వరంతో విలేకరి మృతి

 సామర్లకోట: సామర్లకోటలో ప్రతికా విలేకరిగా పని చేస్తున్న బొనగిరి సూర్యగణేష్ (38) అనే వ్యక్తి డెంగీ జ్వరంతో కాకినాడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. జ్వర తీవ్రతను గుర్తించకపోవడం.. మెడికల్ షాపులో మందులు వాడటంతో పరిస్థితి విషమించగా బుధవారం రాత్రి కాకినాడలోని ఆస్పత్రికి తరలించారు. అయితే కోమాలోనికి వెళ్లి పోవడంతో గురువారం మృతి చెందాడు. గణేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతికి భీమేశ్వరా జర్నలిస్టు అసోసియేషన్ సంతాపం తెలిపింది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top