అంతర్యామీ.. అలసితీ !


దుస్థితిలో తిరుమల హథీరాంజీ మఠం

అడుగడుగునా నిర్వహణా లోపం

ఎప్పుడు ఏది కూలుతుందో తెలియని స్థితిలో పురాతన భవనం
ఐదు వందల ఏళ్లకు పైగా వెంకన్న భక్తులకు సేవలందించిన తిరుమలలోని హథీరాంజీ మఠం శిథిలావస్థకు చేరింది. నిర్వహణ లోపం కారణంగా గదుల పైకప్పులు పూర్తిగా పాడయ్యాయి. ఎప్పుడు కూలిపోతాయోనని భక్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 2.64 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ భవనం గోడలు ప్రస్తుతం పూర్తిగా నెర్రెలుబారాయి. ఉత్తర భారత దేశంలోని రామానంద సంప్రదాయానికి చెందిన వైష్ణవ భక్తుడు హథీరాం బావాజీ భక్తికి సమ్మోహనుడైన వేంకటేశ్వరుడు నిత్యం ఆనందనిలయం దాటి ఈ మఠంలో విడిదికి వచ్చేవారని స్థల పురాణాలు చెబుతున్నాయి. అంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ చారిత్రక కట్టడాన్ని టీటీడీ అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


 


తిరుమల : ఐదువందల ఏళ్లకు పైగా తిరుమలేశుని భక్తులకు సేవలందించిన తిరుమలలోని హథీరాంజీ మఠం ప్రస్తుతం అలసిన స్థితిలో దర్శనమిస్తోంది. నిర్వహణా లోపంతో ఈ పురాతన భవనం దుస్థితికి చేరింది. భవనంలోని గదుల పైకప్పులు ఎప్పుడు.. ఎక్కడ కూలుతాయో చెప్పలేని స్థితిలో ఉన్నాయి.


 

తొంభై  ఏళ్లపాటు ఆలయ పాలనా బాధ్యతలు


 1843 నుంచి 1933 వరకు తిరుమలేశుని ఆలయ పాలన బాధ్యతల్ని మోసిన ఘనచరిత్ర హథీరాంజీ మఠానికి ఉంది. సాక్షాత్తు బావాజీ నిర్వహించిన ఈ మఠం శ్రీవారి ఆలయానికి ఆగ్నేయంలో ఉంది. 1933లో అప్పటి ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వం టీటీడీని ఏర్పాటు చేయటంతో మహంతులు పాలన ముగిసింది. వారిసేవకు గుర్తుగా మహంత్ బావాజీ పేరుతో శ్రీవారి ఆలయంలో నిత్యం వేకువజామున సుప్రభాత సేవలో గోక్షీర నివేదనం, నవనీత హారతి సమర్పించే ఆచారం నేటికీ కొనసాగుతోంది.
దుస్థితిలో హథీరాంజీ మఠం భవనం

ప్రస్తుతం హథీరాంజీ మఠం భవనం 2.64 ఎకరాల్లో విస్తరించింది. ఇందులో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన దాతల సహకారంతో సుమారు 60 గదులకు పైగా నిర్మించారు. రెండు కల్యాణ మండపాలు, సాధువుల కోసం ఒక హాలు, బంజారా భక్తుల విడిదికోసం ఒక హాలు, క్యాంపు కార్యాలయం ఉన్నాయి. పదేళ్లకు ముందు నిర్మించిన కొన్ని గదులు తప్ప పురాతన భవనంలో అంతా పైకప్పు పెచ్చులూడుతోంది. గోడలు నెర్రెలు చీలాయి. కనీస మరమ్మతులకు నోచుకో లేదు. ఎప్పుడు? ఎక్కడ ఏది కూలుతుందో ? చెప్పలేని స్థితిలో భవనం చేరింది. 
సమన్వయ లోపం

హథీరాంజీ మఠానికి పూర్తిస్థాయిలో మహంతుగా అర్జున్‌దాస్ 2006లో బాధ్యతలు చేపట్టారు. మహంతుతోపాటు పరిపాలన బాధ్యతల్ని రాష్ట్ర దేవాదాయ కమిషనర్ పరిధిలో ఉంటుంది. ఈ మఠం ఆధీనంలో తిరుమలతోపాటు దేశవ్యాప్తంగా సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన స్థిర, చరాస్తులతోపాటు నగదు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఏటా మఠానికి మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరుతోంది. అయినప్పటికీ పురాతన మఠం పదికాలాలపాటు రక్షించుకునే విషయంలో ఏ ఒక్కరూ చొరవ చూపడం లేదు.


 


టీటీడీతో బేధాభిప్రాయం.. ఆగిన కొత్త నిర్మాణం

దక్షిణమాడ వీధి విస్తరణ కోసం అవసరమైన కొంత స్థలాన్ని టీటీడీకి ఇస్తామని మఠం నిర్వాహకులు  తెలిపా రు. ఇందుకు ప్రతిఫలంగా మఠంలో కూడా కొత్త నిర్మాణాలు చేసుకునేందుకు టీటీడీ ఉన్నతాధికారులు అంగీకారం తెలిపారు. అయితే, టీ టీడీకి అవసరమైన అదనపు స్థలం ఇచ్చే విషయంలో మఠం నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కొత్త నిర్మాణం పనులకు టీటీడీ అడ్డుచెప్పడంతో కొత్త నిర్మాణం పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి.


 


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top