అబద్ధాల దినోత్సవంగా డిసెంబర్‌ 8

December 8 as False Day - Sakshi

లోకేష్‌ ఆస్తుల ప్రకటనంతా బూటకం: మల్లాది విష్ణు

విజయవాడ సిటీ: సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ ఆస్తుల ప్రకటనంతా పచ్చి బూటకం, నాటకమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఎవరైనా ఆస్తుల ప్రకటన చేస్తే.. అసెంబ్లీ స్పీకర్‌కు సీల్డ్‌కవర్‌లో ఇస్తారని, అలాంటిది లోకేశ్‌  ఆస్తుల ప్రకటన చేయడం పోలవరం లాంటి భారీ వైఫల్యాలనుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకేనని దుయ్యబట్టారు.

ఎప్పుడో కొన్న ఆస్తులకు ఇప్పుడున్న మార్కెట్‌ విలువతో ప్రకటించకుండా రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకటించడంతోనే లోకేశ్‌ నిజాలకు దూరంగా ఆస్తుల ప్రకటన చేశారని స్పష్టమవుతోందని చెప్పారు. లోకేశ్‌ పూర్తిగా అబద్ధాలు, అసత్యాలు మాట్లాడారని, అందుకే డిసెంబరు 8వ తేదీని అబద్ధాల దినోత్సవంగా నిర్వహించుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్ని దాదాపు రూ.720 కోట్లు ఖర్చుచేసి కొనుగోలు చేసిన లోకేశ్‌బాబు తన ఆస్తుల ప్రకటనలో ఆ డబ్బును ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. ఆ డబ్బంతా మీదా కాదా? అని నిలదీశారు. పెట్టుబడులకు, దిగుబడులకు తేడా తెలియని లోకేశ్‌తో చంద్రబాబు ఆస్తుల ప్రకటన చేయిస్తూ నాటకమాడిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఉన్న ఇంటిని మీడియా చూడకుండా దూరంగా పెట్టి, తనకేమీ లేనట్టు చంద్రబాబు నటిస్తూ కుమారుడితో తప్పుడు ప్రకటనలు చేయిస్తున్నారని విమర్శించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top