దసరా రైళ్ల రిజర్వేషన్‌ అప్పుడే ఫుల్‌

దసరా రైళ్ల రిజర్వేషన్‌ అప్పుడే ఫుల్‌


సాక్షి, విజయవాడ : దసరా సందర్భంగా ప్రతి రైలుకూ టికెట్ల రిజర్వేషన్‌ ఇప్పుడే ఫుల్‌ అవడంతో పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల ప్రయాణం ప్రహసనంగా మారనుంది. ముఖ్యంగా తిరుపతి, చెన్నై, విశాఖపట్నం, సికింద్రాబాద్, హౌరా వైపు వెళ్లే పలు రైళ్లలో రిజర్వేషన్‌ పూర్తి అయి వెయిటింగ్‌ లిస్ట్‌ వందల్లో ఉంది. విజయవాడ మీదుగా నిత్యం 350కి పైగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. అన్‌ సీజన్‌లో లక్షమంది, సీజన్‌లో రెండు లక్షల మందికిపైగా ప్రయాణాలు సాగిస్తుంటారు.సెప్టెంబరు 21 నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం కానుండటంతో పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఉంటాయి. దీంతో తిరుపతితోపాటు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు కొన్ని నెలల ముందు నుంచే టికెట్‌ బుక్‌ చేసుకోవడంతో పలు రైళ్లలో రిజర్వేషన్లు ఫుల్‌ అయి ప్రస్తుతం వెయిటింగ్‌ లిస్టు పెరిగిపోతోంది. విశాఖ వైపు వెళ్లే గోదావరి, హౌరా వైపు వెళ్లే ఫలక్‌నామా, కోరమండల్, భువనేశ్వర్‌ వైపు వెళ్లే కోణార్క్‌ తదితర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ వందల్లో ఉంది.దళారులు ముందుగానే టికెట్లను బ్లాక్‌ చేయడంతో పలు రైళ్ల బుకింగ్స్ ఇప్పటికే ఫుల్‌ అయి వెయిటింగ్‌ లిస్ట్‌ కూడా చాంతాడంత ఉంది. మరోవైపు కన్‌ఫర్మ్‌ టికెట్లు కోసం దళారులకు చెల్లించి ప్రయాణికులు దోపిడీకి గురవుతున్నారు. దసరా ఉత్సవాలకు కోల్‌కతా వెళ్లే ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో హౌరా వైపు వెళ్లే పలు రైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ కూడా అయిపోయింది. దీంతో ఆశలన్నీ తత్కాల్‌ టికెట్లపైనే పెట్టుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాలలో మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Back to Top