పాదయాత్ర పూర్తికాగానే దళిత గర్జన

Dalit Garjana..after completion of prajasankalpayatra - Sakshi

విజయవాడ : వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పూర్తి కాగానే దళిత గర్జన నిర్వహిస్తామని ఆ పార్టీ నాయకులు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మేరుగ నాగార్జున తెలిపారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌, పార్టీ అధికార ప్రతినిథి సుధాకర్‌ బాబుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దళితుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ అధ్యయన కమిటీ సమావేశం ముగిసిందని అన్నారు. ఎస్సీల సమస్యలపై కూలంకషంగా చర్చించామని తెలిపారు.

దివంగత వైఎస్సార్‌ తన హయాంలో దళిత సంక్షేమానికి పాటుపడ్డారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు దళితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. దళితులపై దాడులు జరుగుతున్నా, చంద్రబాబు చర్యలు మాత్రం శూన్యమన్నారు. చంద్రబాబుకు దళితులను ఓటు అడిగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. దళిత తేజం కార్యక్రమం ఎవరి కోసం ప్రారంభించారని చంద్రబాబునుద్దేశించి ప్రశ్నించారు. దళిత తేజం కార్యక్రమానికి దళిత నిస్తేజం అని పేరుపెట్టుకుంటే మంచిగా ఉంటుందని ఎద్దేవా చేశారు.

వైఎస్సార్‌సీపీ సమన్వయ కమిటీలో దళితులకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించామని చెప్పారు. జగన్‌ని సీఎం చేయడానికి ప్రతి దళిత వాడ వెళ్లి జగన్ ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళతామని తెలియజేశారు. దళితులకు సంబంధించిన ప్రతి అంశంపై తమ కమిటీ చర్చించిందని, తాము చర్చించిన అంశాలపై తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌కి నివేదిక ద్వారా అందజేస్తామని తెలియజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top