బండ్లు ఓడలు... ఓడలు బండ్లు

బండ్లు ఓడలు... ఓడలు బండ్లు - Sakshi


బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయన్న సామెత అనంతపురం రాజకీయాల్లో మరోసారి రుజువయ్యింది. పలు నేరారోపణలతో పాటు.. అతనో అసాంఘిక శక్తి అని, అతను జిల్లాలోనే ఉండటానికి అర్హుడు కాడంటూ నాడు జిల్లా నుంచి బహిష్కరించారు. నేడు అదే వ్యక్తి జిల్లా ప్రథమ పౌరుడయ్యాడు. అతనే దూదేకుల చమన్ సాబ్. శనివారం జరిగిన ఎన్నికల్లో 19వ జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.  

 

 ప్రశ్న: జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికవడంపై ఎలా ఫీలవుతున్నారు...?

 జవాబు: చాలా ఆనందంగా ఉంది. 15 సంవత్సరాల కిందటే జెడ్పీ చైర్మన్‌గా కావాల్సివుండేది. పరిటాల రవీంద్ర ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన సమయంలో ఒకసారి అవకాశం వచ్చింది. కానీ రాజకీయ సమీకరణాల్లో చివరి సమయంలో చేజారిపోయింది. ఇపుడు మరోసారి అవకాశం రావడం, అందుకు జిల్లా నేతలు ఎవరూ వ్యతిరేకించకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను.

 

 ప్రశ్న: జిల్లాలో పరిటాల సునీత, జేసీ సోదరుల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది.. ఈ పరిస్థితుల్లో అన్ని వర్గాలతో ఎలా సమన్వయం సాధిస్తారు?

 జవాబు: పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు, వర్గ విభేదాలకు తావేలేదు. అదంతా ఒట్టి ప్రచారమే. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తాం. అందరినీ కలుపుకుని సమిష్టిగా జిల్లా అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా.

 

 ప్రశ్న: గతంలో పలు నేరారోపణల వల్ల పోలీసుల చేత జిల్లా బహిష్కరణకు గురయ్యారు కదా.. దానిపై మీ అభిప్రాయం?

 జవాబు: అదంతా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జరిగింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి జిల్లా మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లుకు తలొగ్గి నన్ను ఇబ్బందులకు గురి చేశారు. పరిటాల మనిషిగా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్న నన్ను జిల్లా నుంచి తరిమేస్తే వారికి ప్రయోజనం కలుగుతుందని భ్రమపడ్డారు. జిల్లాలో ఒక్క కేసు కూడా లేదు. హైదరాబాద్ పరిధిలో ఒకట్రెండు కేసులున్నా అవి కూడా పరిష్కారమయ్యాయి.

 

 ప్రశ్న: జిల్లాలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి.. జెడ్పీ చైర్మన్‌గా ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపడుతారు?

 జవాబు: తాగునీరు, సాగునీరు, రోడ్లు, ఉపాధి పనులు తదితర అంశాలపై దృష్టి సారిస్తాను. జిల్లా ప్రజలకు తాగునీరు అందించడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తా. ఈ సమస్య తీర్చడానికి ఎంత ఖర్చైనా భరించడానికి ప్రణాళికలు రూపొందిస్తాం.  

 

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top