దోపిడీకి ‘దగ్గరి’ మార్గమా?

CRDA called the short tenders for the Construction works of the Secretariat - Sakshi

     రూ.2 వేల కోట్ల పైబడిన ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలకు తెరతీసిన ప్రభుత్వ పెద్దలు

     ఐదు టవర్ల సచివాలయ నిర్మాణానికి షార్ట్‌ టెండర్లు పిలిచిన సీఆర్‌డీఏ

     బిడ్ల దాఖలుకు 14 రోజులే సమయం ఇచ్చిన వైనం

     నిబంధనల ప్రకారం 40 లేదా 30 రోజుల సమయం ఇవ్వాల్సిందే

     తమకు కావాల్సిన కంపెనీలకు పనులు కట్టబెట్టేందుకు సమయం కుదింపు

సాక్షి, అమరావతి: అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని చెప్పుకొంటున్న ఐదు టవర్ల సచివాలయ నిర్మాణం కోసం పిలిచిన టెండర్లలో సీఆర్‌డీఏ నిబంధనలకు పాతరేసింది. అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు మాత్రమే షార్ట్‌ టెండర్లు పిలిచి.. బిడ్ల దాఖలుకు 15 రోజుల సమయం ఇస్తారు. అయితే.. ఇప్పటికే వందలాది కోట్ల రూపాయలతో నిర్మించిన తాత్కాలిక సచివాలయం అందుబాటులో ఉంది. ఇప్పటికిప్పుడు సచివాలయాన్ని నిర్మించి, అందులోకి కార్యాలయాలను మార్చాల్సిన అవసరం లేకున్నా షార్ట్‌ టెండర్లు పిలిచి.. బిడ్ల దాఖలుకు కేవలం 14 రోజుల సమయం మాత్రమే ఇవ్వడంపై ప్రభుత్వ వర్గాలే నివ్వెరపోతున్నాయి. ఐదారు కోట్ల రూపాయలతో చేపట్టే చిన్న చిన్న పనుల్లోనే టెండర్‌ నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేయడం ఆనవాయితీ. అలాంటిది రూ.2,176 కోట్ల భారీ అంచనాతో చేపట్టనున్న ప్రాజెక్టుకు.. నిబంధనలకు విరుద్ధంగా షార్ట్‌ టెండర్లు పిలవడం ద్వారా భారీ అక్రమాలకు తెరలేపినట్లు ప్రచారం జరుగుతోంది. 

సెలవులు పోను మిగిలేది 11 రోజులే..
రాజధాని పరిపాలనా నగరంలో ఐదు టవర్లుగా నిర్మించాలని ప్రతిపాదిస్తున్న సచివాలయ నిర్మాణ పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి రెండ్రోజుల కిందట సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. 1, 2 రెండు టవర్లను ఒకటో ప్యాకేజీగా రూ.895 కోట్లు, 3, 4 టవర్లను రెండో ప్యాకేజీగా రూ.751 కోట్లు, సీఎం టవర్‌ను మూడో ప్యాకేజీగా రూ.530 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. వచ్చే నెల రెండో తేదీ నుంచి టెండర్లను ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పి.. అప్పటి నుంచి అదే నెల 16వ తేదీలోపు తమ బిడ్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. అంటే బిడ్లు దాఖలు చేసేందుకు 14 రోజుల సమయం మాత్రమే కేటాయించారు. ఈ 14 రోజుల్లో సెలవులు పోతే మిగిలేది 11 రోజులే. ఈ 11 రోజుల వ్యవధిలో రూ.2,176 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టుకు టెండర్లు దాఖలు చేయాలని కోరడం టెండర్ల చరిత్రలోనే ఎప్పుడూ, ఎక్కడా జరగలేదని పలు నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. 

వేరే కంపెనీలకు అవకాశం ఇవ్వకూడదనే!
విలువైన ఈ ప్రాజెక్టును తమకు కావల్సిన అస్మదీయ కంపెనీలకు అప్పగించేందుకే షార్ట్‌ టెండర్లు పిలిచినట్టు తేటతెల్లమవుతోంది. నిబంధనల ప్రకారం ఎక్కువ సమయం ఇస్తే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు బిడ్లు దాఖలు చేసి పోటీకి వచ్చే పరిస్థితి ఉంటుంది. అదే అతి తక్కువ సమయం ఇస్తే ఆ సంస్థలకు టెండరు డాక్యుమెంట్లకు సమకూర్చుకునేందుకు, అన్ని విషయాలు తెలుసుకుని దాఖలు చేసేందుకు సమయం ఉండదు. తద్వారా తాము లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలే రేసులో ఉంటాయి కాబట్టి వారికే పనులు కట్టబెట్టవచ్చనేది ప్రభుత్వ పెద్దల వ్యూహంగా ఉంది. ఇప్పటికే రాజధానిలో చేపట్టే పెద్ద పనులన్నింటినీ ఇలాంటి లొసుగులతో కేవలం నాలుగైదు కంపెనీలకే కట్టబెట్టారు. తాజాగా సచివాలయ నిర్మాణ పనులను సైతం ఆ కంపెనీలకు అప్పగించి లబ్ధి పొందేందుకు షార్ట్‌ టెండర్లు పిలిచినట్లు స్పష్టమవుతోంది. తద్వారా మిగిలిన సంస్థలు పోటీలో లేకుండా తమ అనుకూల కంపెనీలకు రాచబాట వేసుకున్నారు. 

ఇవీ నిబంధనలు.. 
సాధారణంగా ప్రభుత్వ శాఖలు చేపట్టే ఏ పనికైనా టెండర్లు పిలిస్తే.. దాఖలు చేసేందుకు 45 రోజుల సమయం ఇవ్వాలన్నది నిబంధన. ఇంకొంచెం త్వరగా ఆ పని పూర్తికావాలంటే దాన్ని 15 రోజులకు తగ్గించి 30 రోజుల సమయం ఇస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో టెండర్ల దాఖలుకు 21 రోజుల సమయం ఇస్తారు. అత్యవసర పనులు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, ప్రధాని వంటి ముఖ్యులు వచ్చినప్పుడు తక్కువ సమయంలో పూర్తికావాల్సిన పనులకు 21 రోజుల సమయం మాత్రమే ఇచ్చి టెండర్లు పిలుస్తారు. అంతకుమించిన అత్యవసరమైన పనులకు ప్రభుత్వ అనుమతితో షార్ట్‌ టెండరుగా పిలిచి 15 రోజుల సమయం ఇస్తారు. ఇప్పుడు సచివాలయానికి పిలిచిన టెండర్లలో అంతకంటె తక్కువగా.. కేవలం 14 రోజుల్లోనే బిడ్డర్లు తమ బిడ్లను దాఖలు చేసుకునే సమయం ఇవ్వడం గమనార్హం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top