సీపీఎస్‌ ఉద్యోగుల సంఘీభావం..

CPS officials Solidarity To ys jagan - Sakshi

కోవెలకుంట్ల/కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు వెల్దుర్తి మండలానికి చెందిన సీపీఎస్‌ ఉద్యోగులు గురువారం సంఘీభావం తెలిపారు. ప్రజా సంకల్ప పాదయాత్ర రత్నగిరి క్రాస్‌ సమీపంలో సాగుతుండగా హేమంత్‌కుమార్, జయచంద్ర, నరేంద్ర రెడ్డి, నారాయణరెడ్డి, లతీఫ్, తిరుమల్,  కృష్ణారెడ్డి, నరసింహ తదితరులు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని జగన్‌కు వినతిపత్రం అందజేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సీపీఎస్‌ రద్దుకు గతంలోనే హామీ ఇచ్చినట్లు వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు.

సాయం చేయండన్నా..  
కృష్ణగిరి: ‘నేను కూలికీ పోతేనే పూట గడుస్తుంది. నా భర్తకు బాధ్యత లేదు. ముగ్గురు ఆడపిల్లలు మాకు. పెద్దమ్మాయి సుప్రియ బీఎస్సీ నర్సింగ్, షర్మిల ఇంటర్, డెర్ఫిన్‌ 10వ తరగతి చదువుతున్నారు. ప్రస్తుతం మా ఆర్థిక పరిస్థితి బాగలేదు. దీంతో కుటుంబపోషణ మరింత భారమవుతోంది. పొదుపులో లక్షన్నర రూపాయల వరకు అప్పు ఉంది. గతంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు మోసం చేశాడు. మీరైనా నాలాంటి వాళ్లకు న్యాయం చేయండన్నా’ అని వెల్దుర్తి మండలం నర్సాపురానికి చెందిన కాంతలక్ష్మి గురువారం వైఎస్‌ జగన్‌ వద్ద వాపోయింది. స్పందించిన వైఎస్‌ జగన్‌ ‘మీ దయతో అధికారంలోకి వస్తే పిల్లల చదువులు ఆగకుండా చూస్తాను. అలాగే ఎన్నికల సమయానికి డ్వాక్రా అక్కా చెల్లెమ్మల పొదుపు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేస్తా’ అని అభయమిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top