కరోనా నియంత్రణకు చర్యలు ముమ్మరం

COVID 19 Effects Safety in Vijayawada - Sakshi

జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు

కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌

సూర్యారావుపేట(విజయవాడ సెంట్రల్‌):కరోనా వైరస్‌ నియంత్రణకు అవసరమైన చర్యలను ముమ్మరం చేసి పూర్తిస్థాయిలో జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ చెప్పారు. గురువారం నగరంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్‌(కోవిడ్‌–19) నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చిన 656 మందిని హోమ్‌ ఐసోలేటెడ్‌లో ఉంచామన్నారు. జిల్లాలో 15 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. రెండు కంట్రోల్‌ రూమ్‌లు కూడా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని 17 ఆసుపత్రులలోని ఐసోలేటెడ్‌ రూములలో 91 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయన్నారు. క్యారంటైన్‌ సదుపాయం సైతం సిద్ధం చేశామన్నారు. ప్రైవేట్‌ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు వీలైనంతవరకు ఇంటిదగ్గర నుంచి పనిచేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. సమావేశాలు ఏమైనా నిర్వహించాలనుకుంటే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించాలని సూచించామన్నారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వం పంపిన జాబితా మేరకు విదేశాల నుంచి వచ్చిన 656 మందితోపాటు మరో 131 మందిని గుర్తించి హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. నిర్ధేశించిన 14, 28 రోజులు సంబంధిత వైద్య బృందాలు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తారన్నారు.

అసత్య వార్తలను ప్రచారం చేస్తూ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని ఐపీసీ 188 క్రింద అరెస్ట్‌ చేస్తామన్నారు. విజయవాడ ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను గుర్తించే ఆర్‌టిసిపిసిఆర్‌ మిషన్‌ అందుబాటులో ఉందన్నారు. జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదన్నారు. జిల్లాలోని కోర్టులు, జైళ్లు, రైతుబజార్‌లలో ధర్మల్‌ స్క్రీనింగ్‌ విధానాన్ని అమలు చేస్తామన్నారు. జీఓ 202 ప్రకారం విద్యాసంస్థలు ఈ నెల 31 వరకు చూసివేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లాలోని హోటల్స్, రెస్టారెంట్లు, వాణిజ్య సంస్థలలో హ్యాండ్‌వాష్‌కు సరైన వసతి కల్పించమని ఆదేశించామన్నారు. విజయవాడ నగరపరిధిలో కూడా ఈ విషయంపై నగరపాలక సంస్థ చర్యలు చేపట్టిందన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా 94910 58200 నంబర్‌తో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా అనుమానాస్పద కేసులు గుర్తిస్తే ఆ సమాచారం కంట్రోల రూమ్‌కు అందిస్తే ర్యాపిడ్‌ రెస్సాన్స్‌ టీమ్‌ వెళ్లి అవసరమైన చర్యలు  తీసుకుంటారన్నారు. నగరపాలక సంస్థ  కమిషనర్‌ వి.ప్రసన్న వెంకటేష్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. వ్యాధి నియంత్రణకు అవసరమైన చర్యలను ముమ్మరం చేశామన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత, విజయవాడ సబ్‌ కలెక్టర్‌ హెచ్‌ఎం ధ్యానచంద్ర, డీఎంహెచ్‌ఓ టీఎస్‌ఆర్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తిగత పరిశుభ్రతతోనేకరోనా వైరస్‌ను జయించగలం
సూర్యారావుపేట(విజయవాడ సెంట్రల్‌):వ్యక్తిగత పరిశుభ్రతతోనే కరోనా వైరస్‌ను జయించగలమని కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ అన్నారు. జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అందరి సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. గురువారం నగరంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కరోనా వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై రైల్వే, ఆర్టీసీ, షాపింగ్‌ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థలతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌ అరికట్టడానికి ప్రతి ఒక్కరూ పరిశుభ్రతతోపాటు సామాజిక బాధ్యతగా భావించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. షాపింగ్‌ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు, ఫంక్షన్‌ హాల్స్‌లో ప్రతి ఒక్కరూ చేతులు కడుక్కునేందుకు మొబైల్‌ వాష్‌ బేసిన్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశించారు. మరుగుదొడ్లు,డోర్‌ నాబ్స్, రైలింగ్‌ తదితర వాటిని శుభ్రపరచాలని కోరారు. విజయవాడ రైల్వేస్టేషన్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను «థెర్మో స్క్రీనింగ్‌ టెస్ట్‌లు నిర్వహించి అనుమానిత లక్షణాలు ఉంటే కంట్రోల్‌ రూమ్‌కు తెలియజేయాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ అన్నారు.

రైతుబజార్లలో థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాట్లు
కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా అన్ని రైతుబజార్లలో థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ తెలిపారు. గురువారం నగరంలో ఉన్న స్వరాజ్‌మైదానంలోని రైతుబజార్‌లో గురువారం జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత, విజయవాడ సబ్‌ కలెక్టర్‌ హెచ్‌ఎం ధ్యానచంద్రతో కలసి కలెక్టర్‌ థర్మల్‌ స్క్రీనింగ్‌ ప్రారంభించారు. కల్టెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నివారణకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామన్నారు. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుని తరచూ సబ్బుతో చేతులు శుభ్రపరచుకుంటే మంచిదన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని రైతుబజార్లలో ధర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేయడంతోపాటు హ్యాండ్‌వాష్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రైతుబజార్‌లో వినియోగదారులకు స్క్రీనింగ్‌ పరీక్షలను నిర్వహించారు. అనంతరం రైతుబజార్‌లో చేతులు శుభ్రపరచుకునేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించి అక్కడ వారి చేతులను సబ్బుతో శుభ్రం చేసుకున్నారు. రైతుబజార్‌కు వచ్చిన వినియోగదారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ కవర్లు వినియోగించవద్దని హితవు పలికారు. కలెక్టర్‌ తన వెంట తీసుకొచ్చిన గుడ్డ సంచులను విని యోగదారులకు అందజేశారు. కార్యక్రమంలో రైతుబజార్‌ ఎస్టేట్‌ అధికారులు చంద్రమోహన్, బలిచక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top