కోవిడ్‌-19: తెలంగాణలో పాజిటివ్‌.. ‘అనంత’లో అప్రమత్తం

COVID 19 Corona Virus Alert In Ananthapur - Sakshi

కొన్ని దేశాలను అల్లకల్లోలం చేస్తున్న ‘కోవిడ్‌–19’ వైరస్‌పై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర  ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చే వారికి పరీక్షలు నిర్వహించడంతో పాటు ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను సైతం సిద్ధం చేశారు. ముఖ్యంగా పుట్టపర్తి ఎయిర్‌పోర్టు.. కియా ప్రాంతాల వద్ద నిఘా పెంచారు. రాష్ట్రంలో ‘కోవిడ్‌–19’ పాజిటివ్‌ కేసు నమోదు కాకపోయినప్పటికీ తెలంగాణలో నమోదైన కేసు దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. 

సాక్షి, అనంతపురం:  కోవిడ్‌–19(కరోనా) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసేలా అధికారులకు సూచనలు జారీ చేసింది. వీటితో పాటు ఎన్‌95 మాస్క్‌లు, పర్సనల్‌ ప్రొటెక్షన్‌ డ్రెస్సులు, వైరల్‌ కల్చర్‌ మీడియం పరికరాలను అందుబాటులో ఉంచింది. జిల్లాలోని సర్వజనాస్పత్రి, హిందూపురం జిల్లా ఆస్పత్రిలో కరోనా వైరస్‌ వార్డులను ఏర్పాటు చేశారు. ఇక చైనా, థాయిల్యాండ్, ఇరాన్, సింగపూర్, ఇటలీ, మలేషియా తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు 24 మంది వచ్చినా వారెవరికీ ‘కోవిడ్‌–19’ లక్షణాల్లేవని అధికారులు చెబుతున్నారు. ప్రజలు భయపడాల్సిన పనిలేదని, పరిశుభ్రత పాటిస్తే చాలని ఆరోగ్యశాఖాధికారులు సూచిస్తున్నారు.  

ప్రత్యేక పడకలు ఏర్పాటు 
‘కోవిడ్‌–19’ వైరస్‌పై రాష్ట్ర  ప్రభుత్వం ముందస్తుగానే స్పందించింది. నెలన్నరక్రితమే అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో 10, హిందూపురం ఆస్పత్రిలో 5 పడకలతో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితికి అనుగుణంగా అనంతపురం సర్వజనాస్పత్రిలో మరో 15 పడకలతో పాటు రెండు వెంటిలేటర్లను సిద్ధం చేశారు. జిల్లా కేంద్రంతో పాటు గుంతకల్లు, తదితర ప్రాంతాల్లోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 40 పడకలను ‘కోవిడ్‌–19’ పాజిటివ్‌ కేసులకు చికిత్స చేసేందుకు అందుబాటులో ఉంచారు. తెలంగాణలో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసు బయటపడగా.. జిల్లాలోనూ వైద్యాధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు తమకు సమాచారాన్ని అందించాలని ఏపీ కోవిడ్‌ వైరస్‌ సెల్‌ నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి లేఖ అందింది.  

కోవిడ్‌పై అవగాహన కల్పించండి
అనంతపురం అర్బన్‌: ‘కోవిడ్‌–19’పై  ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన  అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సచివాలయాల పరిధిలో ‘కోవిడ్‌–19’ గురించి తెలియజేసే సమాచారం, జాగ్రత్తలు తెలియజేసే వివరాలతో పోస్టర్లను ప్రదర్శించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పరిధిలోని వలంటీర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. వలంటీర్లు ఎంత మంది పనిచేస్తున్నారో వివరాలను బుధవారం అందజేయాలన్నారు.   

చైతన్య కార్యక్రమాలు 
ఆరోగ్యశాఖ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. కోవిడ్‌–19 వైరస్‌ లక్షణాలు, జాగ్రత్తలు తదితరాలపై హోర్డింగ్‌లు ఏర్పాటు చేయించడంతో పాటు కరపత్రాలను ముద్రించి పంచుతున్నారు. స్టార్‌ హోటళ్లతో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్, స్కూళ్లలో విస్తృతంగా వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు.  

ప్రతి మండలంలో రెస్పాన్స్‌ టీం 
ఇతర దేశాల నుంచి వచ్చే వారిపై ఆరోగ్యశాఖాధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. ప్రతి మండలంలోనూ మండల రెస్సాన్స్‌ టీం(ఎంపీహెచ్‌ఈఓ, ఏఎన్‌ఎం, సూపర్‌వైజర్‌)ను ఏర్పాటు చేశారు. ఈ టీం సభ్యులు ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని రోజూ పర్యవేక్షిస్తుంటారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, అనుమానిత కేసులుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారు.  
పుట్టపర్తి ఎయిర్‌పోర్టులోనూ 

ముందస్తు జాగ్రత్తలు 
పుట్టపర్తి ఎయిర్‌పోర్టులోనూ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోవిడ్‌ ప్రభావిత దేశాల నుంచి ఎవరైనా వచ్చినట్లు తెలిస్తే.. స్థానిక మెడికల్‌ ఆఫీసర్‌కు సమాచారం అందిస్తారు. వారు పరీక్షలు జరిపిన తర్వాత చర్యలు తీసుకుంటారు. దీంతో పాటు ఆ ప్రాంతంలోని లాడ్జిల్లో బస చేసే విదేశీయులకు కోవిడ్‌ లక్షణాలు కన్పిస్తే ఆరోగ్యశాఖకు తెలియజేసేలా యజమానులను ఆదేశించారు.

సర్వజనాస్పత్రిలో ప్రత్యేక వార్డు  
కోవిడ్‌ కేసులకు ప్రత్యేక చికిత్స చేసేందుకు అనంతపురం సర్వజనాస్పత్రిలోని చెస్ట్‌ వార్డులోని ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశాం. వెంటిలేటర్లు, మాస్క్‌లు, డ్రస్సులు సిద్ధంగా ఉన్నాయి. అనుమానిత కేసుల త్రోట్‌ స్వాప్‌ పంపేందుకు వైరల్‌ కల్చర్‌ మీడియం పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి.  
–డాక్టర్‌ రామస్వామి నాయక్, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ 

భయపడాల్సిన పనిలేదు 
కోవిడ్‌ వైరస్‌పై భయపడాల్సిన పనిలేదు. వేసవికాలంలో ఆ వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువ. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రద్దీ ప్రాంతాల్లో సంచరించకూడదు. తరచూ చేతులు కడుక్కోవాలి. దగ్గేముందు, తుమ్మే ముందు రుమాలు అడ్డుగా పెట్టుకోవాలి.  
– డాక్టర్‌ కేవీఎన్‌ఎస్‌ అనిల్‌కుమార్, డీఎంహెచ్‌ఓ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top