భక్తి ముసుగులో భుక్తి

Corruption in Sripada Sri Vallabha Temple - Sakshi

అధినేత అండతో చోటానేతల అక్రమాలు

ప్రజలను అడ్డంగా దోచుకున్న అధికార పార్టీ నేతలు

ముఖ్యనేత ముఖ్య అనుచరులే దోపిడీదారులు

బయటపడుతున్న అక్రమాలతో

బెంబేలెత్తుతున్న అధికారపార్టీ నేత

తప్పించుకునేందుకు తంటాలు

ఎన్నికలముందు కొంపముంచుతుందేమోనని కంగారు

తూర్పుగోదావరి, పిఠాపురం: దొంగే.. ‘దొంగా, దొంగా’ అని అరిచినట్లుంది పిఠాపురం ‘దేశం’పార్టీ నేతల తీరు. నియోజకవర్గ ముఖ్యనేత గురివింద పూసలా తన కింద నలుపును చూసుకోకుండా ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తూ హడావుడి చేయడం పట్ల నియోజకవర్గ ప్రజలే అసహ్యించుకుంటున్నారు. దొరకనంత సేపు తన అనుచరులేనంటూ వచ్చిన ఆ నేత దోపిడీదారులుగా బయటపడగానే పార్టీతో సంబంధం లేనట్టు ఆయనే పోలీసులకు ఫిర్యాదు చేయించి ఆడుతున్న నాటకాలను గమనిస్తున్న ప్రజలు ‘దొరికితే దొంగ లేకపోతే ‘దొర’నా అని గుసగుసలాడుకుంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్న అక్రమాలను పరిశీలిస్తే తెలుగుదేశం నేతలు నాలుగున్నరేళ్లుగా సాగించింది పాలన కాదని, దోపిడీ మాత్రమేనని తేటతెల్లమవుతోంది. ప్రధాన ఆలయాలకు పాలక మండలిలో సభ్యులుగా పని చేస్తూ అక్రమాలు బయటపడుతున్నతీరు భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ముఖ్య అనుచరులే అక్రమార్కులు...
తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతకు ముఖ్య అనుచరులు కావడంతో వారే ఆలయాలకు పాలకులుగా మారిపోయారు. భక్తులకు భగవంతుడికి అనుసంధానంగా పనిచేస్తూ ఆలయాల అభివృద్ధికి కృషి చేయాల్సిన సదరు నాయకులు దేవుడి సాక్షిగా పెద్దలుగా చెలామణి అవుతూ అడ్డదారుల్లో అక్రమాలకు పాల్పడ్డారనేది స్థానికుల ఆరోపణ. ఆ ఆరోపణల్లో నిజాలున్నాయని  బయటపడుతున్న అక్రమాలు రుజువు చేస్తున్నాయి.

గతంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పాలక మండలి సభ్యులుగా నియమితులైన వీరు రూ.కోట్లలో దోపిడీకి పాల్పడినట్లు అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. పాదగయ ట్రస్టుబోర్డు సభ్యులుగా ఉన్న ఒక సభ్యుడు తాను బతికుండగానే తన భార్యకు వితంతు పింఛన్‌ ఇప్పించుకున్న తీరు దేశం నేతల దాష్టీకానికి నిదర్శనం.

ఆ సంగతి మరువక ముందే అదే పాలక మండలిలో సభ్యుడిగా పని చేసిన మరో సభ్యుడు ఇప్పుడు ఏకంగా ప్రజల నుంచి చీటీల పేరుతో భారీగా డబ్బు వసూలు చేసి జెండా ఎత్తేసిన వైనం బయటపడడంతో ఆయన అనుచరులందరూ దోపిడీ దారులేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అప్పట్లో మహా సంస్థానంలో అక్రమాలు విషయం బయటపడగానే ముగ్గురు అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకున్న ముఖ్యనేత ఇప్పుడు తనకు సంబంధం లేదని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఈ అవకతవకలు తనపై పడి రానున్న ఎన్నికల్లో ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనన్న భయంతో తనకేమీ తెలియదన్నట్టుగా తానే పోలీసులకు ఆదేశాలిస్తూ హడావుడి చేస్తున్నారని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top