పైసలిస్తేనే...

corruption in revenue department - Sakshi

రెవెన్యూ శాఖలో పెచ్చుమీరుతున్న అవినీతి

కాసుల కోసం కక్కుర్తి

వెల్లువెత్తుతున్న ఆరోపణలు

ధ్రువీకరిస్తున్న ఏసీబీ కేసులు  

రెవెన్యూకు తెలుగు పదమేమిటని అడిగితే రాజస్వమని చెబుతుంటారు రెవెన్యూ అధికారులు. కానీ వారు అందరికి తెలిసిన రాబడి పదాన్ని వంట పట్టించుకున్నారు. నిబంధనల ప్రకారం పని చేస్తున్నా సొంత రాబడి చూసుకుని దోచుకుంటున్నారు. ఈతరం ఉద్యోగులైతే లంచం డిమాండ్‌ చేస్తూ ఔరా! అనిపిస్తున్నారు. రెవెన్యూ శాఖపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు... ఆ శాఖ అధికారులు అధికంగా ఏసీబీకి పట్టుబడుతున్న వైనం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎంతగా పట్టుబడుతున్నా...అధికారుల తీరులో మార్పు రావడం లేదు. దీంతో ప్రజలకు లంచాల బాధ తప్పడం లేదు.

విజయనగరం గంటస్తంభం: విజయనగరం రూరల్‌ మండలం రాకోడు వీఆర్వో షేక్‌ సాలీమా తనకు వారసత్వంగా సంక్రమించిన భూమిని తన పేరున మార్పు చేసేందుకు ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.50వేలు డిమాండ్‌ చేయగా రూ.20వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు సోమవారం కార్యాలయంలోనే పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. ఈ కార్యాలయంలో ఇటీవల కాలంలో ఇది రెండో కేసు. జిల్లా వ్యాప్తంగా చూస్తే గత కొన్నేళ్లులో ఏకంగా> 14మంది వరకు ఏసీబీకి చిక్కడం విశేషం.

ఇక్కడే కాదు...
ఇది ఒక్క విజయనగరం తహసీల్దారు కార్యాలయంలోనే కాదు. ఏసీబీకి చిక్కిన వారే కాదు. ఒక విధంగా చెప్పుకోవాలంటే జిల్లా వ్యాప్తంగా అన్ని తహసీల్దారు కార్యాలయాల్లో సాగుతున్న వ్యవహారమే. ఇంకా చెప్పాలంటే ఆర్డీవో కార్యాలయాలు... కలెక్టరేట్‌ కార్యాలయం... భూసేకరణ కార్యాలయాలు... ఇలా అన్నింటా అక్రమాలు జరుగుతున్నాయి.  ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది డబ్బులు ఇవ్వనదే పనులు చేయడం లేదని ప్రజలు బహిరంగంగా చెప్పుకుంటున్నారు.  ఈ పరిస్థితి చూస్తే రెవెన్యూ కార్యాలయాలు అవినీతికి ఎంత నిలయంగా మారిపోయాయో... ఉద్యోగులు కాసులకు ఎంతలా కక్కుర్తిపడుతున్నారో ఇట్టే తేలిపోతుంది.

పూసపాటిరేగలో ఇంతకు ముందు పని చేసిన తహసీల్దారు భూమి వివరాలు సరి చేయడానికి రూ.5వేలు ఇవ్వాలని అడుగ్గా రైతు ఇచ్చాడు. సదరు అధికారి ఇతర కారణాల వల్ల ఇప్పుడు లేకపోవడంతో పని జరగక రైతు లబోదిబోమన్నాడు. మరో తహసీల్దారు ప్రతి పనికి పైసలు తీసుకోవడమే కాకుండా రాజకీయ నేతలను కలవాలని సూచిస్తూ మరికొంత  చేతిసొమ్ము వదిలిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు మాత్రమే వీరైనా అందరూ ఇదే పని చేస్తున్నారు.

ప్రతి పనికి రేటు...
రెవెన్యూ అధికారులు ప్రతి పనికి రేటు పెట్టేశారు. భూములు విలువ ఎక్కువగా ఉన్న మండలాల్లో అధిక రేట్లు ఉండగా భూములు విలువ తక్కువగా ఉన్న మిగతా మండలాల్లో రేటు మరో విధంగా ఉంది. పట్టాదారు పాసుపుస్తకం పొందేందుకు, తమ భూములు వివరాలు ఆన్‌లైన్‌ రికార్డులో మార్పు చేసేందుకు రూ.5వేలు నుంచి రూ.25వేలు వరకు వసూలు చేస్తున్నారు. అమ్మకాలు కొనుగోలు చేసే భూములు పక్కన పెడితే వారసత్వంగా వచ్చిన భూములకు కాసులు ఇవ్వనదే పని చేయని పరిస్థితి ఉండడం సిగ్గుచేటు. ల్యాండు కన్వర్షన్‌ కోసం తహసీల్దారు కార్యాలయంలో ఎకరాకు రూ.5వేలు నుంచి రూ.15వేలు, ఆర్డీవో కార్యాలయంలో రూ.5వేలు నుంచి రూ.10వేలు వసూలు చేస్తున్నారని ఇంతకు ముందు భూమార్పిడి చేసుకున్న వారు చెబుతున్న మాట. ఏదైనా దరఖాస్తుపై సర్వేయరు, వీఆర్వో, ఆర్‌ఐ వంటివారు భూమిపై వచ్చి తనిఖీ చేయాలంటే రూ.1000 నుంచి రూ.5వేలు వసూలు చేస్తున్నారు. వారసత్వ ధ్రువీకరణ పత్రాల కోసం మనిషిని బట్టి రూ.1000 నుంచి రూ.5వేలు వరకు పిండేస్తున్నారు. ఇలా చెప్పుకుంటే పోతే దొచుకోడానికి కాదేది అనర్హమన్నట్లు వ్యవహారం సాగిపోతుంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు దృష్టి సారించి అవినీతి ఆపాలని, కనీసం నియంత్రణ అయినా చేయాలని రైతులు కోరుతున్నారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఉత్తరాపల్లి కొండలరావు. పాచిపెంట మండలం పాచిపెంట రెవెన్యూలో ఈయనకు భూములున్నాయి. సర్వే నెంబరు 255/1లో ఈయనకు 2.5ఎకరాలు భూమి ఉంది. ఇందుకు సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నాయి. 1బి పత్రంలో ఆయన పేరునే ఈ భూమి ఉంది. 2017 నవంబరు 16న అడంగల్‌ పత్రం తీయగా అదే సర్వే నెంబరులో అంతే విస్తీర్ణం ఆయన పేరునే ఉంది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి 5న అడంగల్‌ పత్రం తీయగా విస్తీర్ణం 1.88ఎకరాలకు తగ్గిపోయింది. ఇదేమిటని వీఆర్వోను అడిగితే రూ.25వేలు రూపాయిలు ఇస్తే సరి చేస్తానని చెప్పడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆయన కుటుంబంతో సహా వచ్చి సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు.

 జాగ్రత్తగా పని చేయాలి
ఉద్యోగులు జాగ్రత్తగా పని చేయాలి. సర్వీస్‌ ఓరియెంటెడ్‌గా పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలి. ఎవరి నుంచి లంచాలు తీసుకోకుండా ఉండాలి. అక్రమాలకు పాల్పడరాదు. ఏసీబీకి ఒకసారి చిక్కితే ఉద్యోగం పోతుంది. కేసుల్లో ఇరుక్కుంటారు. జీవితం నాశనమవుతుంది. అక్రమాలకు పాల్పడి డబ్బులు డిమాండ్‌ చేస్తున్న ఉద్యోగులపై దృష్టి పెడతాం. సాక్ష్యాధారాలతో ఫిర్యాదులు ప్రజలు నుంచి రావాలి. అప్పుడు విచారణ చేసి తప్పక చర్యలు తీసుకుంటాం. –ఆర్‌.ఎస్‌.రాజ్‌కుమార్, డీఆర్వో 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top