మాయ ఉంది..మోసం ఉంది!

Corruption In Prakasam Municipal Tenders - Sakshi

జరిగిన పనులకు టెండర్లు

పనులు చేసిన వారికే కేటాయింపు

నగర పాలక సంస్థలో అడ్డగోలు వ్యవహారం

ప్రజాధనం దుర్వినియోగం

పట్టించుకోని స్పెషల్‌ ఆఫీసర్‌

ఒంగోలు టౌన్‌: ఒంగోలు నగర పాలక సంస్థలో గతంలో జరిగిన పనులకు ఇప్పుడు టెండర్లు పిలిచి వర్క్‌ ఆర్డర్లు సంబంధిత కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. అధికార పార్టీ నాయకులు గతంలో చేసిన పనులనే ప్రస్తుత టెండర్లలో పొందుపరచి వాటిని కొత్తగా చేస్తున్నట్లు చూపించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు పావులు కదుపుతున్నారు. మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు కనీసం వాటిని గమనించకుండానే కళ్లు మూసుకొని టెండర్లు ఖరారు చేయడం నగర పాలక సంస్థ కార్యాలయంలో హాట్‌ టాపిక్‌గా మారింది. అధికార పార్టీ నాయకులు వేసిన టెండర్లను ఖరారు చేయకుంటే స్థాన చలనం కలుగుతుందన్న భయాందోళనలతో గతంలో జరిగిన పనులకు తాజాగా నిర్వహించిన టెండర్లలో ఆమోదముద్ర వేసి కొంతమంది ఇంజినీరింగ్‌ అధికారులు ‘అధికార’ ఆశీస్సులు పొందుకుంటున్నారు.

ఒంగోలు శాసన సభ్యుడు దామచర్ల జనార్దన్‌రావు తన పార్టీకి చెందిన నాయకులతో కలిసి నగర పాలక సంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్‌ అధికారులతో రివ్యూ చేస్తూ తమ వారు చెప్పిన పనులే చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో ఇంజినీరింగ్‌ అధికారులు జీ హుజూర్‌..అంటూ పచ్చ జెండా ఊపుతూ ఎప్పుడో జరిగిన పనులను ప్రస్తుత టెండర్లలో చూపించి పచ్చచొక్కా వారికి మార్గం సుగమం చేస్తున్నారు. 6 కోట్ల రూపాయల సాధారణ నిధులతో 100 పనులకు గురువారం ఆన్‌లైన్‌ ద్వారా టెండర్లు పిలిచారు. వాటిలో గతంలో జరిగిన పనులు ఉండటాన్ని బట్టి చూస్తే నగర పాలక సంస్థ అధికార పార్టీ ఆదేశాలను ఏ విధంగా అమలు చేస్తుందో చెప్పకనే చెబుతోంది. వాస్తవానికి అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లు ఖరారు చేస్తే వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చి పనుల అంచనా వేసి ఆ తర్వాత అగ్రిమెంట్‌ ఇస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి దాదాపు నెల రోజులు పడుతోంది. ముందుగానే పనులు చేసి టెండర్‌ పొందిన వెంటనే ఆ సొమ్ము తమ ఖాతాల్లో జమ చేసుకునేలా అధికార తెలుగుదేశం నాయకులు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తూ యంత్రాం గాన్ని పక్కదారి పట్టించడం గమనార్హం.

టాయి‘లేటెస్ట్‌’
స్థానిక పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సులు ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి పాఠశాల మొదటి అంతస్తులో గదులు కూడా కేటాయించారు. మొదటి అంతస్తులోనే విద్యార్థుల కోసం టాయిలెట్లు నిర్మించారు. టాయిలెట్లను దాదాపు పది లక్షల రూపాయలతో నిర్మించారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆ టాయిలెట్లను గురువారం నగర పాలక సంస్థ పిలిచిన పలు అభివృద్ధి పనుల టెండర్ల జాబితాలో చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఎప్పుడో జరిగిపోయిన టాయిలెట్ల పనులను ప్రస్తుత టెండర్లలో వర్క్‌ నంబర్‌ 648 కింద ఖరారు చేసి సంబంధిత కాంట్రాక్టర్‌కు కట్టబెట్టి ‘వెంకటేశ్వర’ మహత్యాన్ని పొందుకొని నగర పాలక సంస్థ ఇంజినీరింగ్‌ అధికారులు తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకున్నారు.

‘సైడ్‌’ డ్రెయిన్లు
స్థానిక కొత్త కూరగాయల మార్కెట్‌ వద్ద నిర్మిస్తున్న సైడ్‌ డ్రెయిన్లు చివరి దశకు చేరుకున్నాయి. అద్దంకి బస్టాండ్‌లోని మాగుంట సుబ్బారామిరెడ్డి విగ్రహం దక్షిణం వైపు నుంచి సమైక్యత నగర్‌ వరకు పది లక్షల రూపాయలతో సైడ్‌ డ్రెయిన్‌ నిర్మాణం చేపట్టి తుది దశకు చేరుకొంది. అదేవిధంగా సమైక్యతనగర్‌ నుంచి ఊరచెరువులోని కొత్త కూరగాయల మార్కెట్‌ వరకు పది లక్షల రూపాయలతో సైడ్‌ డ్రైయిన్లు నిర్మించేందుకు తాజాగా పిలిచిన టెండర్లలో నగర పాలక సంస్థ అధికారులు ఖరారు చేయడంతో విమర్శలను మూటగట్టుకొంది. ఈ రెండు పనులను వర్క్‌ నంబర్‌ 650, 651 కింద ఖరారు చేసి తిరుపతి‘స్వామి’ భక్తిని నగర పాలక సంస్థ ఇంజినీరింగ్‌ అధికారులు చాటుకున్నారు.

పైపు‘లైన్‌ క్లియర్‌’
స్థానిక మామిడిపాలెంలో హెచ్‌డీపీ పైపులైన్‌ వేశారు. అక్కడ పైపులైన్‌ దెబ్బతినడంతో నూతనంగా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం పిలిచిన టెండర్లలో 660 వర్క్‌ నంబర్‌ కింద చూపించి 2.47 లక్షల రూపాయలతో ఆ పని చేసిన వారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ పనికి సంబంధించి టెండర్‌ దాఖలు చేసిన  వారిలో అతి తక్కువగా కోడ్‌ చేసిన కాంట్రాక్టర్‌కు జరిగిన పనిని కట్టబెట్టి మునిసిపల్‌ ఇంజినీరింగ్‌ అధికారులు ‘శ్రీనివాస’ మహత్యాన్ని ముందుగానే చూపించారు.

కలెక్టర్‌ కన్నెత్తి చూస్టే ఒట్టు
ఒంగోలు నగర పాలక సంస్థలో అడ్డగోలుగా పనులు కట్టబెడుతూ లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా స్పెషల్‌ ఆఫీసర్‌ అయిన కలెక్టర్‌ వినయ్‌చంద్‌ స్పందించక పోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎప్పుడో చేసిన పనులకు ఇప్పుడు టెండర్లు పిలిచి సంబంధిత కాంట్రాక్టర్లకే ఇంజినీరింగ్‌ అధికారులు అడ్డగోలుగా పనులు కట్టబెడుతున్నా ప్రత్యేక అధికారి ప్రేక్షకపాత్ర వహించడంపై అనేక మంది పెదవి విరుస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రజాధనం హారతి కర్పూరంలా హరించుకుపోయిన తర్వాత కలెక్టర్‌ జోక్యం చేసుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

విజిలెన్స్‌ రంగంలోకి దిగితేనే..
ఒంగోలు నగర పాలక సంస్థలో అడ్డగోలుగా పనులు కట్టబెడుతూ ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న తీరుపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రంగంలోకి దిగి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు భావిస్తున్నారు. విజిలెన్స్‌ బృందం స్వయంగా రంగంలోకి దిగితే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. నగర పాలక సంస్థలో జరుగుతున్న అడ్డగోలు పనులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ నాయకులు సన్నద్ధమవుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top