మేయర్‌ వర్సెస్‌ కార్పొరేటర్‌

Corruption In Moharram Festival PSR Nellore - Sakshi

రొట్టెల పండుగ ఏర్పాట్లలో అక్రమాలు

కార్పొరేటర్‌ ప్రశాంత్‌కిరణ్‌

బారాషహిద్‌ దర్గా వద్ద మేయర్‌ను నిలదీసిన వైనం

నెల్లూరు సిటీ: రొట్టెల పండుగ నేపథ్యంలో నెల్లూరులోని బారాషహిద్‌ దర్గా ప్రాంగణంలో చేస్తున్న పనులపై అధికార పార్టీకి చెందిన 35వ డివిజన్‌ కార్పొరేటర్‌ ప్రశాంత్‌కిరణ్‌ మేయర్‌ అబ్దుల్‌అజీజ్‌ను మంగళవారం నిలదీశారు. నగరంలోని దర్గామిట్టలో ఉన్న బారాషహిద్‌ దర్గాలో ఈనెల 22వ తేదీ నుంచి రొట్టెల పండుగ ఐదురోజులు పాటు జరుగనుంది. మరో 10 రోజులు మాత్రమే సమయం ఉండగా హడావుడిగా రోడ్డు పనులు ప్రారంభించడంపై కార్పొరేటర్‌ ప్రశాంత్‌కిరణ్‌ వ్యతిరేకించారు. మేయర్‌ అజీజ్‌ పనులు మంగళవారం దర్గా ప్రాంగణంలో పర్యటిస్తుండగా కార్పొరేటర్‌ అక్కడికి చేరుకుని మేయర్‌ తీరుపై మండిపడ్డారు. తనకు ఏ పనులు జరుగుతున్నాయో కూడా సమాచారం ఇవ్వడం లేదన్నారు. ప్రొటోకాల్‌ పాటించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. రూ.2 కోట్లు జనరల్‌ ఫండ్‌ ద్వారా పనులు చేయించడం ఏంటన్నారు. మేయర్‌ ప్రశాంత్‌ను కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు.

70 శాతం దోచుకుంటున్నారు
కాసేపటి తర్వాత తిరిగి దర్గా వద్దకు చేరుకున్న ప్రశాంత్‌ విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. రెండేళ్ల క్రితం సీఎం చంద్రబాబు రూ.20 కోట్లు విడుదల చేస్తానని చెప్పినా, ఆ నిధులను తీసుకొచ్చే ప్రయత్నం చేయకపోవడం దారుణమన్నారు. 30 శాతం పనులు చేసి, 70 శాతం దోచుకుంటున్నారని ఆరోపించారు. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన కాంట్రాక్టర్లకు నామినేషన్‌ పద్ధతిన పనులను అప్పగించడం అక్రమాలకు నిదర్శనమన్నారు. ప్రజాధనాన్ని దుర్విని యోగం చేస్తున్నారని మండిపడ్డారు.

ఎవరా షంషుద్దీన్‌..
ఇంజినీరింగ్‌ అధికారులను పనులపై ప్రశ్నిస్తే షంషుద్దీన్‌తో మాట్లాడాలని చెప్పడంపై ప్రశాంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరా ఆ షంషుద్దీన్‌ అని, కార్పొరేటర్‌ కూడా కాని వ్యక్తి అన్ని వ్యవహారాల్లో తలదూర్చుతున్నాడని మండిపడ్డారు. మేయర్‌ స్థానంలో అన్ని విషయాల్లో షంషుద్దీన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కాగా అంతకుముందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తాడని తెలుసుకున్న మేయర్‌ తన చాంబర్‌లో కొంతసేçపు ప్రశాంత్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వెనక్కు తగ్గకపోవడతో కమిషనర్‌ అలీంబాషా తన చాంబర్‌లోకి తీసుకెళ్లి మాట్లాడారు. అయితే కార్పొరేటర్‌ తన పని తాను చేస్తానని తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారం అధికార పార్టీలో చర్చనీయాంశమైంది. పనుల్లో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో చెప్పేందుకు ఇది నిదర్శనమని పలువురు చెబుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top