గొంతు నొక్కేస్తున్నారు

Corruption In Floods Funds West Godavari - Sakshi

వరద బాధితుల సాయంపై ప్రశ్నిస్తే కేసులు

అధికారులు, పార్టీ నేతల ఒత్తిళ్లు

వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త కొట్టుపై కేసు నమోదు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రశ్నించే వారి గొంతు నొక్కేదిశగా ప్రభుత్వం నడుస్తోంది. బాధితులకు సాయం అందలేదని తహసీల్దార్‌ను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే, తాడేపల్లిగూడెం వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త కొట్టు సత్యనారాయణపై పోలీసులు కేసు నమోదు చేయడం వివాదాస్పదంగా మారింది.  రెండురోజుల క్రితం జరిగిన సంఘటన ఆధారంగా తాడేపల్లిగూడెం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కలెక్టర్‌ భాస్కర్‌ ఆదేశాలు, జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు ఒత్తిడి ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేయక తప్పలేదు. ఈ విషయాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. తప్పుడు కేసులు ఎత్తివేయకపోతే ఉద్యమించడానికి పార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు.

ప్రశ్నిస్తే.. కేసులా..!
ఎర్రకాలువ వరద కారణంగా తాడేపల్లిగూడెం రూరల్‌ మండలంలో పలు గ్రామాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. నందమూరు చుట్టూ వరదనీరు వచ్చి చేరడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పలువురు పునరావాస కేంద్రాలకు వెళ్లగా, ఇంటికి కాపలాగా మరికొందరు గ్రామాల్లోనే ఉన్నారు. పునరావాస శిబిరాలకు వెళ్లకుండా ఇంట్లో ఉన్నవారికి ఆహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. వీరంతా భోజనం,అల్పాహారం కోసం నందమూరు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కృష్ణాయపాలెం శిబిరానికి వెళ్లాల్సి వచ్చింది. ఇంతా చేసి అక్కడికి వెళ్లినా పూర్తిస్థాయిలో భోజనం అందని పరిస్థితి. ఈ నేపథ్యంలో గురువారం వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త కొట్టు సత్యనారాయణ బృం దం ట్రాక్టర్‌లో ముంపు ప్రాంతాలను సందర్శించారు. బాధితుల వద్దకు వెళ్లి వారికి అందుతున్న సాయం, ఆహార పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి చాలా మందికి భోజనాలు అందలేదని బాధితులు కొట్టు సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన తహసీల్దార్‌ను ప్రశ్నించారు.

ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఒక దళిత యువకుడు తమకు భోజనాలు అందడం లేదని, వైఎస్సార్‌ సీపీ అని వివక్ష చూపిస్తున్నారంటూ ఫిర్యాదు చేశాడు. ఈలోపు అక్కడే ఉన్న తెలుగుదేశం కార్యకర్త లక్ష్మణరావు ఫిర్యాదు చేస్తున్న యువకుడిపైకి దూసుకువెళ్లాడు. దీంతో బాధితులు చెబుతుంటే నువ్వెం దుకు జోక్యం చేసుకుంటున్నావు అంటూ కొట్టు సత్యనారాయణ ట్రాక్టర్‌ దిగి కిందకు వెళ్లారు. కొట్టు సత్యనారాయణ ట్రాక్టర్‌ దిగి వెళ్లడం చూసి లక్ష్మణరావు పరుగు లంకించుకున్నాడు. దీంతో అక్కడే ఉన్న వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు అతడిని వెంబడించారు. పోలీసులు సర్దిచెప్పడంతో వివాదం ముగిసింది. కొట్టు సత్యనారాయణ అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే కలెక్టర్‌ భాస్కర్‌ అక్కడికి వచ్చారు. ఆ సమయంలో అధికారులు జరిగిన విషయం వివరించగా, కేసు పెట్టి ఎఫ్‌ఐఆర్‌ కాపీ తనకు పంపాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించినట్టు దీంతో అధికారులు సదరు లక్ష్మణరావును వెతికిపట్టుకుని అతనితో ఫిర్యాదు చేయించినట్టు సమాచారం. కొట్టు సత్యనారాయణపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టాలంటూ జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు పోలీసులపై ఒ త్తిడి తెచ్చినట్టు తెలిసింది. అయితే సం ఘటన జరిగినప్పుడు పోలీసులు అక్కడే ఉండటం, ఘర్షణ జరగకపోవడంతో వారు కేసు పెట్టేందుకు వెనుకాడారు. అయినా ఒత్తిడి ఎక్కువ కావడంతో తాడేపల్లిగూడెం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్‌ నంబర్‌ 341, 323 ఐపీసీ సెక్షన్ల కింద కొట్టు సత్యనారాయణ మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.

అవినీతిపై మాట్లాడుతున్నందుకే..
ఎర్రకాలువ ఆధునికీకరణ పనులను ముళ్లపూడి బాపిరాజు వర్గానికి చెందిన కాంట్రాక్టర్లే నామినేషన్‌ పద్ధతిపై చేశారని, వారు నాసిరకంగా పనులు చేయడం వల్లే ఎర్రకాలువకు 20 చోట్ల గండ్లు పడి పొలాలు ముంపునకు గురయ్యాయని కొట్టు సత్యనారాయణ విమర్శలు చేశారు. పది నెలల క్రితమే ఎర్రకాలువ పనులను పరిశీలించి నాసిరకంగా చేస్తున్నారని, భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని కొట్టు సత్యనారాయణ చెప్పారు. కలెక్టర్‌ భాస్కర్‌ అండతోనే బినామీ కాంట్రాక్టులు దక్కించుకుని నాసిరకం పనులు చేశారని కొట్టు సత్యనారాయణ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు.
వారం రోజులుగా ఎర్రకాలువ వరద సందర్భంగా పలుచోట్ల గండ్లు పడటం, వేల ఎకరాలు నీట మునగడంతో ఆయన చెబుతున్న విషయాలు నూరు శాతం నిజమయ్యాయి. ఈనేపథ్యంలో అవకాశం కోసం చూస్తున్న టీడీపీ నాయకులకు గురువారం నందమూరులో జరిగిన వాగ్వాదం కలిసి వచ్చింది.

న్యాయపరంగా ఎదుర్కొంటాం
తనపై తప్పుడు కేసులు పెడితే భయపడి వెనక్కి తగ్గేది లేదని కొట్టు సత్యనారాయణ అన్నారు. జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు అవినీతిని ప్రశ్నించినందుకే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. కలెక్టర్‌ భాస్కర్‌ జిల్లాకు ఉన్నతాధికారిలా కాకుండా అధికార పార్టీ నేతగా వ్యవహరిస్తున్నారని, వరద బాధితులకు న్యాయం చేయమని కోరితే తనపై కేసు ఎలా పెట్టిస్తారని కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top