కేశవా.. ఈ పాపం నీది కాదా!

Corruption In Canal Work During TDP Period - Sakshi

అవినీతి పరవళ్లు 

కాలువలకు అడుగడుగునా గండ్లు 

టీడీపీ దత్తత కాంట్రాక్టు సంస్థల ఇష్టారాజ్యం 

చిన్నపాటి వర్షానికీ తట్టుకోలేని గట్లు 

కళ్ల ముందే నీరు పారుతున్నా గత పాలకుల వైఫల్యంతో తప్పని కన్నీళ్లు

కరువు సీమపై టీడీపీ పగబట్టింది. పారే నీటిని ఒడిసిపట్టే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కాలువల్లో అవినీతి పరవళ్లు తొక్కుతోంది. కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలు ఆ పార్టీ నేతలకు భారీగా ముడుపులు ముట్టజెప్పడంతో.. నాలుగు రాళ్లు వెనకేసుకోవడంలో భాగంగా పనులు నాసిరకంగా చేయడం మొదటికే మోసాన్ని తీసుకొచ్చింది. ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్, రిత్విక్‌.. ఇతరత్రా టీడీపీ దత్తత కాంట్రాక్టర్లు జిల్లాలో చేపట్టిన ఏ పని కూడా సక్రమంగా లేకపోవడంతో ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. తుంగభద్ర, హంద్రీనీవాల నుంచి భారీగా నీరు వస్తున్నా.. కాలువల పనుల్లో నాణ్యత లోపించి ఎక్కడికక్కడ గండ్లు పడి నీరు వృథా అవుతోంది.  

ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టేందుకు పయ్యావుల కేశవ్‌ తమ పార్టీ బినామీ కాంట్రాక్టు సంస్థలతో హడావుడిగా చేయించిన పనుల్లో నాణ్యత లోపానికి ఈ చిత్రమే నిదర్శనం. హంద్రీనీవా 34వ ప్యాకేజీలో భాగంగా చేపట్టిన డిస్ట్రిబ్యూటరీ కాలువకు శనివారం కురిసిన ఒక్క వర్షానికే మూడు చోట్ల గండి పడింది. ఈ నీరంతా పక్కనే ఉన్న పొలాలను ముంచెత్తింది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నీళ్లిస్తున్నట్లు ఫొటోలకు ఫోజులిచ్చిన ‘పయ్యావుల’ పాపమే ఇప్పుడు గండ్ల రూపంలో రైతులకు శాపంగా మారింది.

ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందాలన్న దురాశ.. అస్మదీయుడైన కాంట్రాక్టర్‌కు అడ్డంగా దోచిపెట్టాలన్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేరాశ.. వెరసి రైతులకు కష్టాల పాలు చేసింది. ఏమాత్రం నాణ్యత లేని పనులతో కాలువలు తెగి వర్షపునీరు పొలాల్లో ప్రవహించడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎమ్మెల్యే నిర్వాకం తమ జీవితాలను అగమ్యగోచరంగా మార్చిందని వాపోతున్నారు. 

ఉరవకొండ: కరువు సీమ కడగండ్లు తీర్చే హంద్రీ– నీవా సుజల స్రవంతి పథకం పనుల్లో గత టీడీపీ ప్రభుత్వం భారీగా అక్రమాలకు పాల్పడింది. హంద్రీ–నీవా పనుల్లో అంచనాలు పెంచి రూ.కోట్లు దోచుకున్న టీడీపీ నేతలు కనీసం పనుల్లో నాణ్యతను పట్టించుకోలేదు. వివరాల్లోకెళితే.. హంద్రీ– నీవా 34వ ప్యాకేజీలో భాగంగా 12,500 ఎకరాల్లో డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టారు. పనులను బెంగళూరుకు చెందిన రెడ్డి వీరన్న కన్‌స్ట్రక్షన్స్‌ వారు చేపట్టారు. ఇందులో భాగంగా ఉరవకొండ మండలం వ్యాసాపురం వద్ద నిర్మించిన డీ2 డిస్ట్రిబ్యూటరీ నుంచి 500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. ఈ డిస్ట్రిబ్యూటరీ పనులు సంబంధిత కాంట్రాక్టర్‌ పూర్తి నాసిరకంగా చేపట్టారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి పయ్యావుల కేశవ్‌ హుటాహుటిన డిస్ట్రిబ్యూటరీలకు నీళ్లు తీసుకొచ్చారు. కాలువ వద్ద ఫొటోలకు ఫోజులు ఇచ్చి రైతులను మభ్యపెట్టాలని ప్రయత్నించారు. 

నాసిరకం పనులతోనే కాలువకు గండ్లు 
డీ2 డిస్ట్రిబ్యూటరీ కాలువ పనులు పూర్తి నాసిరకంగా ఉండటంతో శనివారం కురిసిన భారీ వర్షానికి వద్ద మూడు చోట్ల కాలువకు గండి పడటంతో భారీగా నీరు పొలాలను ముంచెత్తింది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు మూడు చోట్ల గండి పడింది. దీంతో నీరు పక్కనే ఉన్న పొలాలను ముంచెత్తింది. వ్యాసాపురం గ్రామానికి చెందిన  కొంకరామప్ప, అశోక్, సీతారాములు, ఉలిగప్ప తదితర పొలాల్లోకి వరద నీరు భారీ చేరి పొలాలు నిండిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువకు గండిపడిన విషయాన్ని హంద్రీ–నీవా అధికారులకు రైతులు సమాచారం అందించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top