త్వరలోనే కర్నూలులో కరోనా ల్యాబ్‌

Coronavirus Lab For Tests in Kurnool Soon - Sakshi

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

కర్నూలు(సెంట్రల్‌): త్వరలోనే కర్నూలులో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఐసీఎంఆర్‌ అనుమతి కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు.  కలెక్టర్‌ చాంబర్‌లో కోవిడ్‌–19 రాష్ట్ర ప్రత్యేకాధికారి, సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర, జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్, జాయింట్‌ కలెక్టర్‌ రవిపట్టన్‌ శెట్టి, ట్రైనీ కలెక్టర్‌ విధేకరేలతోపాటు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులతో గురువారం రాత్రి సుధీర్ఘంగా చర్చించారు. కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చికిత్స చేసే వైద్యులకు, క్వారంటైన్లలో పనిచేసే సిబ్బందికీ పీపీఈలు, శానిటైజర్లు, ఎన్‌–95 మాస్కులు కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. జిల్లాకు రెండు రోజుల్లో దాదాపు 5 వేల పీపీఈలు, ఆరువేల ఎన్‌–95 మాస్కులు, లక్ష ట్రిపుల్‌ లేయర్‌ మాస్కులు వస్తాయని, వీటికి అదనంగా మరో 2 వేల ఎన్‌–95మాస్కులు, 1000 పీపీఈలు, 4లక్షల ట్రిపుల్‌ లేయర్‌ మాస్కులకు అర్డర్లు పెట్టామన్నారు. కోవిడ్‌ ఆసుపత్రులు, క్వారంటైన్ల వద్ద బయో మెడికల్‌ వేస్టును  జాగ్రత్తలు వహించి డిస్పోజ్‌ చేసుకునేలా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం టిడ్కో హౌసింగ్‌ కాలనీలో ఏర్పాటు చేయనున్న క్వారంటైన్‌ కేంద్రంలో  వసతులను పరిశీలించారు. 

ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు
డోన్‌: ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, కరోనా నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి భరోసా ఇచ్చారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఆయన పర్యటించారు. అనంతరం మున్సపల్‌శాఖ కార్యాలయ ఆవరణంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో హైపో ద్రావణం పిచికారీ చేయించాలని ఆదేశించారు. క్వారంటైన్‌లో సదుపాయల గురించి అడిగి తెలుసుకున్నారు. పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని మంత్రి సూచించారు. ప్రజలు కూడా భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు. సమావేశంలో డీఎస్పీ నరసింహారెడ్డి, తహసీల్దార్‌ నరేంద్రనాథ్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ కేఎల్‌ ఎన్‌ రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ రమేష్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, సీఐలు సుబ్రమణ్యం, సుధాకర్‌రెడ్డి, కేశవరెడ్డి, ఎస్‌ఐలు మధుసూదన్‌రావు, సురేష్, నరేష్, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు, డాక్టర్‌ బాలచంద్రారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీరాములు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top