అతి జాగ్రత్త అనర్థం

Corona Virus: Courage is mind's antivirus says Dr Prabhakar Yendluri - Sakshi

ధైర్యంతో రోగాలు దరిచేరవు  ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌లో

ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్‌ యండ్లూరి ప్రభాకర్‌

అనంతపురం హాస్పిటల్‌: ఎక్కడ చూసినా కరోనా..కరోనా !.. కోవిడ్‌–19 ప్రపంచాన్నే కుదిపేస్తోంది. అందరిలోనూ ఈ వ్యాధి సోకకముందే ఎన్నో అనుమానాలు, భయాలు, అభద్రతాభావాలు ఉన్నాయి.ఈ మహమ్మారి ఎక్కడ చంపేస్తుందోనన్న భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  ముందుజాగ్రత్తలు తీసుకుంటే చాలని, అతిజాగ్రత్త అవసరం లేదని.. ఒక వేళ వ్యాధి సోకినా అది ఏమి చేయలేదన్న దృఢవిశ్వాసంతో వైద్యుల సూచనలు తీసుకోవాలని ప్రముఖ మానసిక వైద్యనిపుణుడు డాక్టర్‌ యండ్లూరి ప్రభాకర్‌ చెప్తున్నారు. శనివారం ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌ ద్వారా ప్రజలు సమస్యలను ఆయనకు చెప్పుకున్నారు. ఆయన పరిష్కార మార్గాలు తెలియజేశారు. (కరోనా: అపోహలూ... వాస్తవాలు)

ప్ర: సార్‌..చనిపోతానని భయమేస్తోంది ..
 – నవీన్, అనంతపురం 
డాక్టర్‌ యండ్లూరి: ఇలాంటి కేసులను హైపోకార్డియాసిస్‌ అంటారు. వ్యాధి రాకముందే అతిగా భయపడతారు. కోవిడ్‌ బారిన పడిన వారిలో వృద్ధులు, చిన్నపిల్లలే అధికం. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటే వ్యాధులు సోకుతాయి. విదేశాలకు వెళ్లొచ్చినవారు, కోవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తులతో కలిసి ఉండరాదు. భయంతోనే గుండెలో దడ వస్తుంది. ఇంట్లోనే వ్యాయామం, యోగా చేస్తూ దగ్గరలోని మానసిక వైద్యుడిని సంప్రదించండి.  
ప్ర: సార్‌..మద్యం మాని మానసిక రోగి అయ్యాడు 
 – నరేష్, శింగనమల 
డాక్టర్‌ యండ్లూరి: తరచూ మందుతాగేవాళ్లు ఉన్నఫళంగా మానేస్తే శరీరంలో గుండె దడ, ఫిట్స్‌ వస్తాయి. మెంటల్‌గా ప్రవర్తిస్తారు. దీన్ని ఆల్కాహాల్‌ విత్‌డ్రాల్‌ సిండ్రోమ్‌ అంటారు. ఇది 5 నుంచి 7 రోజుల పాటు ఉంటుంది. ఈ సమస్య ఉన్నట్లయితే పీహెచ్‌సీ వైద్యుడికి చూపించాలి. వైద్యుల సలహాతో డైజోఫాం 5 ఎంజీ, ఇండెరాల్‌ మాత్రలువాడాలి. పరిస్థితి తీవ్రమైతే సర్వజనాస్పత్రికి వెళ్లాలి.                       
ప్ర: సార్‌.. ముట్టుకుంటే జబ్బులు వస్తాయా?   
– భాగ్యలక్ష్మి, రెవెన్యూకాలనీ, అనంతపురం 
డాక్టర్‌ యండ్లూరి: ముట్టుకుంటే జబ్బులు వస్తాయనేది అపోహ. తరచూ కాళ్లూ చేతులు, శరీరం శుభ్రం చేసుకోవడాన్ని ఓసీడీ అంటారు. మీ కొడుకు ‘మహానుభావుడు’ సినిమా తరహాలో చేస్తున్నాడు. తరచూ శుభ్రం చేసుకోవడం ద్వారా చర్మవ్యాధులు వస్తాయి. నిద్రలేమితో మరిన్ని సమస్యలూ వస్తాయి. తక్షణం మానసిక వైద్యుడిని సంప్రదించండి.  
ప్ర: డాక్టర్‌ గారూ.. ఆస్పత్రి ఉద్యోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  
– అంజలి, రాంనగర్‌ 
డాక్టర్‌ యండ్లూరి: కుటుంబ సభ్యులు ఆస్పత్రుల్లో పనిచేస్తున్నంతమాత్రాన మీకు కరోనా సోకదు. మీ ఇంట్లో వ్యక్తులు సురక్షిత జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఆస్పత్రి నుంచి వచ్చిన వెంటనే స్నానం చేయాలి. దుస్తులు మార్చుకోవాలి. చెప్పులు బయటే శుభ్రం చేయాలి. మాస్క్‌లు, గ్లౌస్‌లు ధరించాలి. ఇంట్లో శానిటైజర్స్‌తో శుభ్రం చేసుకోవాలి.      

ప్ర: న్యూస్‌ పేపర్స్, పాల ద్వారా వ్యాధి వస్తుందా?  
– ప్రజ్ఞారెడ్డి, కడప   
డాక్టర్‌ యండ్లూరి: ఆ అవకాశమేలేదు. అలాంటి భయం వీడాలి. ఇప్పుడు న్యూస్‌పేపర్లు ప్రింట్‌ చేసేటప్పుడు  శానిటైజర్స్‌ వాడుతున్నారు. పేపర్‌ వచ్చేసరికి అధిక సమయం పడుతుంది. పాల ప్యాకెట్‌ ద్వారా ఎలాంటి వైరస్‌ సోకదు. పాలప్యాకెట్లు బాగా శుభ్రం చేసుకోండి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top