పృథ్వీరాజ్‌కు సవాల్‌గా ఎస్వీబీసీలో డీవీడీల గోల..

Controversy Over DVDs In Sri Venkateswara Bakthi Channel - Sakshi

రూ.20 లక్షల దుబారా 

రెండేళ్లుగా కొనసాగుతున్న దుస్థితి 

చైర్మన్‌ పృథ్వీరాజ్‌కు సవాల్‌గా మారిన వివాదం

శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌లో డీవీడీల వివాదం ముదురుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలను డీవీడీలుగా మలచి విక్రయించే క్రమంలో రూ.20 లక్షల నిధులు దుబారా కావడానికి కారణమైన అధికారులపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణమైంది. విలువైన డీవీడీలను రెండేళ్లుగా కార్యాలయ ఆవరణలో పడేశారు. ఇందులో అనేక డీవీడీలు పనికిరాకుండా పోగా, కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ అక్రమాలను నిగ్గుతేల్చడం ఎస్వీబీసీ నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పృథ్వీరాజ్‌కు సవాల్‌గా మారింది. 

సాక్షి, తిరుపతి సెంట్రల్‌: శ్రీ వేంకటేశ్వర భక్తితత్వం పై ప్రపంచవ్యాప్తంగా ప్రచారం నిర్వహించడమే లక్ష్యంగా సుమారు 12 ఏళ్ల కిందట ఏర్పాటైన శ్రీవేంకటేశ్వర భక్తి చానెల్‌(ఎస్వీబీసీ) వివాదాలకు వేదికగా మారడం విస్మ యం కలిగిస్తోంది. టీటీడీ కనుసన్నల్లో నడవాల్సిన ఎస్వీబీసీపై సరైన నియంత్రణ లేకపోవడమే అన్ని వివాదాలకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంతకాలంగా ఎస్వీబీసీకి నేతృత్వం వహిస్తున్న అధికారుల తీరుతో సంస్థ ప్రతిష్ట దెబ్బతింటోంది. 

చాగంటి డీవీడీల విక్రయానికి శ్రీకారం
చాగంటి కోటేశ్వరరావుకు ప్రజల్లో అనూహ్య స్పందన లభిస్తున్న కారణంగా ఎప్పటికప్పుడు ఎస్వీబీసీ ద్వారా రికార్డింగ్‌ చేశారు. కొంత కాలానికి వీటిని డీవీడీలుగా మార్చి విక్రయించే పనికి శ్రీకారం చుట్టారు. అప్పటికే చాంగటి తన సొంత ట్రస్ట్‌ ద్వారా తన ప్రవచనాలను లాభాపేక్ష లేకుండా డీవీడీలు చేసి, తన ప్రవచనాలను ప్రజలకు అందించేవారు. కానీ, శ్రీవారి మీద ఉన్న భక్తి భావన కారణంగా తన ట్రస్ట్‌ ద్వారా కాకుండా ఎస్వీబీసీ ద్వారా ప్రవచనాలను అందించేందుకు అంగీకరించడం గమనార్హం. ఈ క్రమంలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలను ఎస్వీబీసీ అధికారులు డీవీడీలుగా మార్చి, విక్రయానికి సిద్ధం చేశారు. శివానందల హరి, వేంకటేశ్వర మహత్యం, శ్రీవారి బ్రహ్మోత్సవాలు వంటి విభిన్న అంశాలతో కూడిన వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. రికార్డింగ్, మార్కెటింగ్‌ వంటి పనులకు ఎస్వీబీసీ అధికారులు రూ.20 లక్షల వరకు వెచ్చించారు. 

అధికారి మారడమే కారణం
తిరుమల నాదనీరాజనంతో సహా ఎక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారాలను చేసినా..ఆ ప్రాంతానికి డీవీడీలు తరలిస్తూ విక్రయించడానికి వీలుగా ముగ్గురు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకున్నారు. పరిమిత కాలంలో కొద్ది పాటి డీవీడీలను కూడా ఎస్వీబీసీ విక్రయించింది. ఆ డీవీడీలను రూపకలప్పన చేసిన అధికారి ఉన్నంత కాలం విక్రయాలు కొనసాగాయి. అయితే ఆయన స్థానంలో మరొక అధికారి ఎస్వీబీసీలో కీలక బాధ్యతలను చేపట్టారు. ఆయనకు చాగంటి అంటే గిట్టని కారణంగా డీవీడీలను పక్కన పడేశారు. డీవీడీలకు మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గిపోయిందన్న సాకు చూపి, మిగిలిన అన్నింటిని ఎస్వీబీసీ కార్యాలయంలో ఓ మూలన పడేసినట్టు సమాచారం. డీవీడీల కంటెంట్‌ సరిగ్గా లేదంటూ తొలుత పరిశీలన కోసం ప్రత్యేక అధికారిని నియమించారు. ప్రణాళికా ప్రకారం డీవీడీల్లో కంటెంట్‌ లేదని ఆ ప్రత్యేక అధికారితో బలవంతంగా నివేదికను తయారు చేయించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. డీవీడీలను విక్రయించడం కోసం నియమించిన సిబ్బందిని కూడా ఆయన హయాంలోనే తొలగించారు.

మాతృదేవోభవ డీవీడీపై మరో వివాదం
శ్రీవారి ఉత్సవాల్లో కాకుండా ప్రత్యేకంగా రూపొందించిన డీవీడీల రికార్డింగ్‌ విషయంలోనూ వివాదాలు తలెత్తాయి. ఎస్వీబీసీ చానెల్‌ లేదా అనుమతి పొందిన స్టూడియోలో రికార్డింగ్‌  చేయాల్సి ఉంటే...ఓ ప్రవచన కర్త సొంతింట్లో నిర్వహించిన కార్యక్రమాన్ని సైతం మాతృదేవో భవ పేరిట డీవీడీగా రూపొందించడంపై అప్పట్లో తీవ్ర దుమారమే చెలరేగింది. సదరు కార్యక్రమానికి సినీ ప్రముఖుల కుటుంబ సభ్యులు హాజరు కావడాన్ని డీవీడీల్లో వీక్షించిన భక్తులు విస్తుపోవాల్సి వచ్చింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top