మా జీవితాల్లో వెలుగులు నింపండి..

Contract Power Employees Meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

విజయనగరం :  ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విద్యుత్‌ శాఖలో సేవలందిస్తున్న కాంట్రాక్ట్‌ విద్యుత్‌ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ విజయనగరం జిల్లా ప్రతినిధులు జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా రామభద్రాపురం మండలం రొంపిల్లి వద్ద  జననేతను ఆదివారం కలిసి సమస్యలు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇరవై సంవత్సరాలుగా విద్యుత్‌ శాఖలో ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తున్న తమకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి రెగ్యులర్‌ చేయాలని కోరారు.

అందరికీ వెలుగులు పెంచే తాము చీకట్లో మగ్గాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. మహానేత రాజశేఖరరెడ్డి  కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చారని, అయితే ఆయన అకాల మరణం తర్వాత తమనెవ్వరూ పట్టించుకోలేదని వాపోయారు.  తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రకారం అక్కడి విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయగా.. మన రాష్ట్రంలో మాత్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులున్నారని, వారందరికీ న్యాయం చేయాలని కోరారు.  

అవస్థలు పడుతున్నా...
ఏ పని చేసినా కూలి గిట్టుబాటు కావడం లేదు. భర్త లేకపోవడంతో ఇద్దరు పిల్లలను పెంచడం కష్టంగా మారింది. ప్రతి నెలా ఇచ్చే వెయ్యి రూపాయల పింఛన్‌తోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. జగన్‌బాబు ముఖ్యమంత్రి అయితే రెండు వేల రూపాయల పింఛన్‌ ఇస్తామన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయితే నాలాంటి ఎందరో అభాగ్యులకు ఆసరా దొరుకుతుంది.   – గిరిడి సుశీల, పారాది గ్రామం , బొబ్బిలి మండలం

ఆదుకుంటామన్నారు...
బోన్‌ క్యాన్సర్‌ రావడం వల్ల నా కూడి భూజాన్ని పూర్తిగా తొలగించారు. చేయి లేకపోవడం వల్ల ఏ పనీ చేసుకోలేకపోతున్నాను. ఆదుకోవాలని జగన్‌బాబును కోరాను. అధికారంలోకి రాగానే పింఛన్‌ ఇచ్చి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. –  పిట్ట రాములమ్మ,   ఎస్‌.సీతారామపురం, రామభద్రపురం మండలం

పొంచి ఉన్న ముప్పు
పారాదిలో ప్రవహిస్తున్న వేగావతి నది వద్ద ప్రభుత్వం ఇసుక రీచ్‌ను నిర్వహిస్తుండడంతో గ్రామానికి ముప్పు పొంచి ఉంది. ఇసుక తవ్వకాల వల్ల నదీ పరీవాహక ప్రాంతం కోతకు గురవుతోంది. దీంతో గ్రామం ముంపు భారిన పడే అవకాశం ఉంది. అలాగే నదిపై ఉన్న బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. గ్రామంలో కూడా ఆరేళ్లుగా పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదు. ప్రభుత్వం మారిన తర్వాత మా బతుకులు బాగుపడతాయన్న ఆశ ఉంది.–  ఎస్‌. పైడిరాజు, ఎ.ప్రసాద్, పారాది గ్రామం, బొబ్బిలి మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top