టీడీపీకి షాక్‌ మీద షాక్‌

Continues shocks to TDP - Sakshi

టిక్కెట్‌ ప్రకటించాక వద్దంటూ తిరస్కరించిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి 

జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిక 

ఇప్పటికే టీడీపీని వీడిన ఎంపీలు అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబు  

గతంలోనే గుడ్‌బై చెప్పిన ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున్‌రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్‌ 

సాక్షి, అమరావతి: సాధారణ ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ అధికార తెలుగుదేశం పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఏకంగా పార్టీ శాసనసభ అభ్యర్థిగా ఎంపికైన నాయకుడు తనకు ఆ టిక్కెట్‌ వద్దంటూ తిరస్కరించడం గమనార్హం. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా కొద్దిరోజుల క్రితం మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డిని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. టీడీపీ విడుదల చేసిన తొలిజాబితాలో ఆదాల పేరును చేర్చారు. ఆయన ఆ పార్టీ టిక్కెట్‌పై పోటీచేసేందుకు ససేమిరా అంటూ తిరస్కరించడమే కాకుండా శనివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ పరిణామం తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలం సృష్టించింది. 

తెలుగుదేశం..అగమ్యగోచరం: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌పై పోటీచేసేందుకు పలువురు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకటించిన జాబితాలోని వారిలో ఇంకా ఎవరైనా జారుకుంటారేమోనన్న ఆందోళన టీడీపీలో నెలకొంది. పార్టీ టిక్కెట్‌ ప్రకటించాక ఆదాల ప్రభాకర్‌రెడ్డి వెళ్లిపోవడంతో టీడీపీ పరువు పోయిందని, ప్రజల్లో చులకన అయ్యామని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందే టీడీపీ సిట్టింగ్‌ ఎంపీలు అవంతి శ్రీనివాస్‌(అనకాపల్లి), పి.రవీంద్రబాబు (అమలాపురం) ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరారు. అలాగే రానున్న ఎన్నికల్లో  పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి అని భావించిన రఘురామకృష్ణంరాజు కూడా వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు.

అనకాపల్లి ఎంపీ స్థానానికి తన అభ్యర్థిగా ప్రకటించాలని టీడీపీ భావించిన మాజీ ఎంపీ, సీనియర్‌ నేత కొణతాల రామకృష్ణ కూడా ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి (రాజంపేట), ఆమంచి కృష్ణమోహన్‌ (చీరాల) కూడా టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీ చేరిన సంగతి తెలిసిందే. నేతలంతా ఒక్కొక్కరుగా వెళ్లిపోతుండడంతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top