అన్నీ ఎమ్మెల్యే చేసుకుంటే మేమెందుకు!

Conflicts Reveals in TDP Party East Godavari - Sakshi

టీడీపీలో ఎంపీపీ, పార్టీ పదవులకు గౌరవం లేదు..

టీడీపీలో ఎమ్మెల్యే, కొడుకు ఉంటే చాలనుకుంటున్నారు...

ఈసారి ఎమ్మెల్యే టిక్కెట్టు స్థానికులకే ఇవ్వాలి

టీడీపీ ఎంపీపీ భర్త, మండల పార్టీ అధ్యక్షుడు ఆవేదన

 విజయనగరం, చీపురుపల్లి: అధికార తెలుగుదేశం పార్టీలో అంతర్గత విబేధాలు మరోసారి బయటపడ్డాయి. ఈసారి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు, ఎంపీపీ రౌతు కాంతమ్మ భర్త రౌతు కామునాయుడు సొంత పార్టీ ఎమ్మెల్యే కిమిడి మృణాళినిపై ధ్వజమెత్తారు. ఈ మేరకు తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే మృణాళిని అధికార, అనధికార కార్యక్రమాల్లో తమకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎంపీపీ అన్నా...మండల పార్టీ అధ్యక్షుడన్నా అసలు గౌరవం లేదని, ఎమ్మెల్యేతో పాటు ఆమె కుమారుడు అన్నీ చూసుకుంటే సరిపోతుందన్నట్టు వ్యవహరిస్తున్నారని చెప్పారు.

అలాంటప్పుడు తామెందుకని ప్రశ్నించారు. పార్టీలో ఉన్న వారికి కనీస గౌరవం ఇవ్వడం లేదన్నారు. స్థానికేతరులు ఎమ్మెల్యేగా ఉండడంతో నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు అనాథలుగా మిగిలారన్నారు. నియోజకవర్గంలో పార్టీ బతకాలంటే రానున్న ఎన్నికల్లో స్థానిక అభ్యర్థికి ఎమ్మెల్యే సీటు కేటాయించాలని, అందుకు తాను కూడా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆర్‌ఈసీఎస్‌లో ఉద్యోగ నియామకాల నుంచి పంచాయతీల్లో పనుల వరకు ఎమ్మెల్యే, తన కుమారుడు ప్రమేయంతో జరుగుతున్నాయని మిగిలిన వారికి ప్రాధాన్యత లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగే ఏ కార్యక్రమమైనా తమకు సమాచారం ఉండదని పేర్కొన్నారు. తన భార్య, ఎంపీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న పరిధిలో పట్టాల పంపిణీ చేస్తున్న విషయం కూడా తమ దృష్టికి రాకపోవడం దౌర్భగ్యమన్నారు. ఐదేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా  ఎమ్మెల్యేలో మార్పు రాకపోవడంతో దారుణమన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top