భూకబ్జాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు


గుంటూరు క్రైం: నూతన రాజధాని ఏర్పాటుక్రమంలో భూ కబ్జాదారులు పెరిగిపోతున్నారని, వారు ఎంతటివారైనా ఉపేక్షించబోమని రూరల్ జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ చెప్పారు. భూకబ్జాలకు పాల్పడేవారిపై క్రిమినల్ కేసులు నమోదుచేసి కఠినంగా వ్యవహరిస్తామన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని ఉమేష్‌చంద్ర సమావేశం మందిరంలో ఎస్పీ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో రాజధాని ఏర్పాటుకానుండడంతో భూముల ధరలు విపరీతంగా పెరిగి ఒకే స్థలాన్ని ఇద్దరికి విక్రయించడం, బినామీ పేర్లతో నకిలీ దస్తావేజులు రూపొందించి రిజిస్ట్రేషన్లు చేయడంపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు రిజిస్ట్రార్ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో ప్రాథమిక జాగ్రత్తలపై  ప్లెక్సీలు, వాల్‌పోస్టర్లు ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు.

 

 అవగాహన లేకుండా భూములను కొనుగోలు చేయకూడదనే విషయాన్ని  గుర్తుంచుకోవాలన్నారు. స్థలాలు కొనుగోలు చేసే సమయంలో అమ్మకందారుల వివరాలు, స్థలానికి సంబంధించిన హద్దులు, లింకు డాక్యుమెంట్లు, ఈసీ తదితర జాగ్రత్తలు పాటిస్తూ పూర్తి వివరాలను ముందుగానే పరిశీలించుకోవాలని సూచించాఉ. నమ్మకంగా చెప్పి విక్రయించేవారి మాటలు గుడ్డిగా నమ్మవద్దన్నారు. జీపీఏ, సేల్ అగ్రిమెంట్ విషయాల్లో కూడా ఎక్కువ మోసాలు జరుగుతున్నాయని, సంతకాలు ఫోర్జరీ చేసి ఒకే స్థలాన్ని తండ్రి, కొడుకులు విక్రయించడం, అసైన్డ్, వక్ఫ్‌బోర్డు, దేవాదాయశాఖకు సంబంధించిన భూములను రిజిస్టర్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

 

  వైట్‌కాలర్ నేరాలకు పాల్పడి ప్రజలను మోసం చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ, న్యాయసేవాధికారసంస్థ, పోలీసులతో కలిపి ప్రీ లిటిగెంట్ ఫోరం ఏర్పాటుకు పరిశీలిస్తున్నామన్నారు. ఈ విషయంపై జిల్లా జడ్జి, కలెక్టర్‌లతో చర్చించామన్నారు. ఈ విధానం అమలులోకి వస్తే వారానికి 60 నుంచి 70 కేసులు పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. భూ, స్థల వివాదాలకు సంబంధించిన వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు కూడా నిందితులకు సహకరిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఫిర్యాదులు అందితే అధికారులను సైతం వదిలేది లేదని, వారిపైనా రౌడీషీట్, సస్పెక్ట్ షీట్‌లు తెరుస్తామని హెచ్చరించారు.

 

 క్రైం విభాగం బలోపేతం..

 ప్రత్యేకంగా జిల్లాలో క్రైం విభాగం ఏర్పాటుచేయడంతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని రూరల్ జిల్లా ఎస్పీ రామకృష్ణ చెప్పారు. గత రెండున్నర నెలల్లో సుమారు రూ.50 లక్షల చోరీ సొత్తును ఈ విభాగం రికవరీ చేసిందన్నారు. అదనపు ఎస్పీ శోభామంజరి పర్యవేక్షణలో డీఎస్పీలు కె.సుధాకర్, సీహెచ్‌శ్రీనివాసరావు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. ఇప్పటికే నేరాల నియంత్రణ కోసం 30మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, ఇంకా బలోపేతం చేసేందుకు మరో పది మందిని అటాచ్‌మెంట్ విధానంలో కేటాయిస్తున్నామని వివరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top