జల రవాణా కారుచౌక!

Coastal Transport Key to Reducing India's Logistics Cost, Says Nitin Gadkari - Sakshi

కిలోమీటరుకు 3 నుంచి ఐదు పైసలే ఖర్చు

కేంద్రమంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌

తొలిసారిగా విశాఖ పోర్టు నుంచి ఉక్కు ఉత్పత్తుల రవాణా ప్రారంభం

కొచ్చిన్, ముంబై, అహ్మదాబాద్‌కు బయల్దేరిన ఎస్‌ఎస్‌ఎల్‌ శబరిమలై నౌక

విశాఖ పోర్టు నుంచి బీరేంద్రసింగ్, ఢిల్లీ నుంచి

ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రారంభించిన కేంద్రమంత్రి గడ్కరీ

దేశంలో 111 జలరవాణా మార్గాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడి

సాక్షి, విశాఖ: జలమార్గం ద్వారా దేశీయ ఉత్పత్తుల్ని చౌకగా, పర్యావరణహితంగా రవాణా చేసేందుకు వీలుంటుందని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌ అన్నారు. విశాఖ పోర్టు నుంచి ఉక్కు ఉత్పత్తుల రవాణా తొలిసా రిగా జలమార్గం ద్వారా బుధవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభమైంది. విశాఖ పోర్టు నుంచి కొచ్చిన్, ముంబై, అహ్మదాబాద్‌లకు నేరుగా ఉక్కు ఉత్పత్తుల రవాణాకు మార్గం సుగమమైంది. ఈ మేరకు కొచ్చిన్, ముంబై, అహ్మదాబాద్‌లకు పదివేల టన్నుల ఉక్కుతో విశాఖ పోర్టు నుంచి బయల్దేరిన ఎస్‌ఎస్‌ఎల్‌ శబరిమలై నౌకను ఢిల్లీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా కేంద్ర రవాణా, షిప్పింగ్‌ మంత్రి నితిన్‌ గడ్కరీ, ఇక్కడి పోర్టు నుంచి బీరేంద్రసింగ్‌లు సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా బీరేంద్రసింగ్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో 90 శాతం దేశీయ ఉత్పత్తుల రవాణా రైలు, రోడ్డు మార్గంలో జరుగుతోందని, అదే జలమార్గం ద్వారా అయితే ఖర్చు చాలా ఆదా చేయవచ్చునని తెలిపారు. ఇందుకు కిలోమీటరుకు 3 నుంచి 5 పైసలు మాత్రమే ఖర్చవుతుందన్నారు. జలమార్గాన్ని వినియోగిస్తే ఉక్కు ఉత్పత్తుల ధర సైతం 20–23 శాతం తగ్గే వీలుందన్నారు. ముడిసరుకు ధర తగ్గినప్పుడు ఉత్పత్తుల ధర తగ్గుతుందన్నారు. జలమార్గం ద్వారా ప్రస్తుతం జరుగుతున్న 1.5 శాతం ఎగుమతులు 5 నుంచి 6 శాతానికి పెరిగితే రూ.వేల కోట్లు ఆదా చేయొచ్చన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఎగుమతులకోసం భవిష్యత్తులో మరింత ఎక్కువగా జలమార్గాన్ని ఉపయోగిం చుకోవాలని సూచించారు. సాగరమాల ప్రాజెక్టు అమలైతే జల రవాణా గణనీయంగా పెరుగు తుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు.

రవాణా రంగంలో నూతనశకం: గడ్కరీ
ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో కేంద్రమంత్రి గడ్కరీ మాట్లాడుతూ రవాణా రంగంలో నూతన శకం ప్రారంభమైందన్నారు. లాజిస్టిక్‌ వ్యయం చైనాలో 8 నుంచి 10 శాతం, యూరప్‌ దేశాల్లో 12 నుంచి 13 శాతం ఉండగా భారత్‌లో మాత్రం 18 శాతంగా ఉందన్నారు. సముద్ర రవాణా ద్వారా దీన్ని తగ్గించుకుంటే కోట్ల రూపాయలు ఆదా చేయవచ్చన్నారు. జలరవాణా ద్వారా టన్నుకు రూ.200 నుంచి రూ.300 మాత్రమే ఖర్చవుతుందన్నారు. దేశంలో 111 జల రవాణా మార్గాల ఏర్పాటుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి.. విజయవాడలో బకింగ్‌హాం కెనాల్‌ పనులు ప్రారంభమయ్యాయన్నారు. భవిష్యత్తు వాణిజ్య అవసరాలకు జలరవాణాకే అధిక ప్రాధాన్యమిచ్చి లాభాలబాటలో పయనించాలని స్టాక్‌ హోల్డర్లకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉక్కు మంత్రిత్వశాఖ సంయుక్త, అదనపు కార్యదర్శులు రుచితా చౌదరి కోవిల్, సరస్వతీ ప్రసాద్, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ సీఎండీ మధుసూదన్, విశాఖ పోర్టు ట్రస్ట్‌ చైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీలు కంభంపాటి హరిబాబు, అవంతి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top