కంగారుపడొద్దు

CM YS Jaganmohan Reddy Holds Review Meeting On Coronavirus - Sakshi

కోవిడ్‌ నివారణ చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష

కరోనా లక్షణాలు కనిపిస్తే ఎలా ముందుకెళ్లాలో వలంటీర్ల ద్వారా ఇంటింటికీ ప్రచారం చేయాలి

టీవీ యాడ్స్, దినపత్రికల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలి

ప్రజలకు భరోసా ఇచ్చేలా ప్రచారం ఉండాలి 

పాజిటివ్‌ వస్తే తీసుకోవాల్సిన వైద్యం, జాగ్రత్తలపై ప్రతి ఒక్కరికీ అవగాహన రావాలి

వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్‌   

సాక్షి, అమరావతి: కరోనా వచ్చినా కంగారు పడొద్దు అనే విధంగా ప్రజల్లో ధైర్యాన్ని కలిగించేలా విస్తృతంగా ప్రచారం చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి వెళ్లాలని సూచించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై టీవీ యాడ్స్, దినపత్రికల ద్వారా ప్రచారం చేపట్టాలన్నారు. కరోనా పాజిటివ్‌గా తేలితే వెంటనే చికిత్స తీసుకోవాలని, వైరస్‌ సోకినప్పటికీ అత్యధికులకు నయమవుతుందని, చేయాల్సిందల్లా జాగ్రత్తలు పాటించడం, చికిత్స తీసుకోవడమని పేర్కొన్నారు. ప్రజలకు భరోసా కల్పించేలా.. పాజిటివ్‌ వస్తే తీసుకోవాల్సిన వైద్యం, జాగ్రత్తలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఏర్పడేలా వచ్చే 2, 3 వారాలు ముమ్మరంగా ప్రచారం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఆదేశిస్తూ కోవిడ్‌పై అవగాహన, చైతన్యం చేయడం మన ముందున్న కర్తవ్యమని సీఎం స్పష్టం చేశారు. కోవిడ్‌– 19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..

సరిహద్దుల వద్ద నిరీక్షణ తగ్గించాలి..
► అంతర్జాతీయ, దేశీయ విమానాల రాకపోకల వివరాలను సీఎం అరా తీశారు. గత వారం రోజులుగా వివిధ రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల వివరాలను సీఎంకు అధికారులు తెలియచేశారు.  ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారు సరిహద్దుల వద్ద ఎక్కువసేపు వేచి ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. 6 రాష్ట్రాల నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు అధికారులు తెలిపారు.
► సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ళ నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఏం చేయాలో అవగాహన పెరగాలి
► కోవిడ్‌ బాధితులు నేరుగా వెళ్లి పరీక్షలు చేయించుకోగలగాలి. ఎక్కడికి వెళ్లి వైద్యం పొందాలనే అవగాహన ప్రజల్లో కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. పరీక్షలు స్వచ్ఛందంగా ఎలా చేయించుకోవాలి? ఒకవేళ పాజిటివ్‌ వస్తే ఏం చేయాలి? అనే అంశంపై విస్తృత అవగాహన కల్పించాలని, 14410, 104 నెంబర్లకు మరింత ప్రచారం కల్పించాలని సీఎం ఆదేశించారు. అనుమానంతో ఫోన్‌ చేసిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం తరపున చైతన్యం చేయడం ఒక పని అయితే మరోవైపు తగిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సీఎం పేర్కొన్నారు. నాడు–నేడు ద్వారా ఆస్పత్రుల్లో మెరుగైన సదుపాయలను కల్పించడం, కొత్తగా 16 బోధనాస్పత్రులు, ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం కోసం దాదాపు రూ.16 వేల కోట్ల మేర ప్రభుత్వం వ్యయం చేస్తోందని సీఎం వివరించారు.
► కోవిడ్‌ క్లస్టర్లు, ఏరియా వివరాలను ఆరా తీసిన సీఎం.. క్లస్టర్ల క్లాసిఫికేషన్‌ను మరోసారి పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్‌పై యుద్ధంలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, వలంటీర్ల సహకారంతో ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు.
► పాజిటివిటీ రేట్, జిల్లాలవారీగా పరీక్షలు, నమోదైన కేసులు, మరణాల వివరాలను అధికారులు వెల్లడించారు. ఏ జిల్లాల్లో ఎక్కడ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి? హాట్‌స్పాట్‌లు తదితర వివరాలను  సీఎం దృష్టికి తెచ్చారు. జిల్లాలవారీగా 71 సెంటర్లలో 15,614 బెడ్స్‌ అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఇప్పటివరకూ 4,54,030 శాంపిల్స్‌కు గాను 4,659 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న డాక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది వివరాలను అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వార్డు, విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top