అవినీతికి ఆస్కారం లేదు: సీఎం జగన్‌

CM YS Jagan Wants Andhra Pradesh Role Model In Transparency - Sakshi

సాక్షి, అమరావతి: ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరగడానికి వీల్లేదని, టెండర్ల విధానాన్ని అత్యంత పాదర్శకంగా రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇంజనీరింగ్‌ పనుల్లో గత ఐదేళ్లలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీతో ఆయన శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. చెడిపోయిన వ్యవస్థను బాగు చేయడానికి తపిస్తున్నానని చెప్పారు. అవినీతిని ఆస్కారం లేదన్న సందేశం పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు వెళ్లాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అవినీతిని సహించేది లేదని పునరుద్ఘాటించారు. రూ. 100 పనికి రూ. 80కే పనిజరుగుతుందంటే రివర్స్‌ టెండరింగ్‌కు వెళదామని, అలాంటి అధికారులను సన్మానిస్తామని అన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ ఎక్కడ చేయగలమో గుర్తించాలన్నారు. పారదర్శకతలో ఏపీ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలవాలని, అందుకోసమే జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని కోరినట్టు వెల్లడించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను సమావేశంలో సీఎం జగన్‌ ప్రస్తావించారు. రెండు రోజుల క్రితం ‘సాక్షి’లో వచ్చిన కథనాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం పనుల్లో అక్రమాలపై నిగ్గు తేల్చాలని నిపుణుల కమిటీకి ఆదేశాలిచ్చారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉందని, అవినీతి వల్ల పరిస్థితి మరింత దారుణంగా తయారయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో రివర్స్‌ టెండరింగ్‌కు ఎక్కడ అవకాశం ఉందో గుర్తించాలన్నారు. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం గందరగోళం చేసిందని.. స్పిల్‌వే పూర్తిచేయకుండా కాఫర్‌ డ్యాంకు వెళ్లారు, దాన్ని కూడా పూర్తిచేయకుండా వదిలేశారని వివరించారు. ఇప్పడు భారీగా వరద వస్తే 4 నెలలపాటు పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొందని, గత ప్రభుత్వ నిర్వాకం వల్లే ఇలా అయిందన్నారు. పోలవరం తనకు అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top