జనం గుమిగూడకూడదు 

CM YS Jagan Video Conference with Collectors and SPs On Covid-19 Prevention - Sakshi

నిత్యావసర సరుకుల ధరలు పెంచి విక్రయిస్తే జైలుకు పంపాలి 

కోవిడ్‌ నివారణ చర్యలపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌  

హాట్‌ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో నిత్యావసరాలను మరింత చేరువకు తీసుకెళ్లండి   

ఒకటికి రెండు సార్లు పరీక్షలు చేసి నెగిటివ్‌ వస్తేనే క్వారంటైన్‌లో ఉన్న వారిని ఇళ్లకు పంపించాలి.. ప్రతి ఆసుపత్రిలో కొంత భాగంలో ఐసోలేషన్‌ సదుపాయం ఉండాలి 

ఏప్రిల్‌ 16 నుంచి మళ్లీ రేషన్‌ పంపిణీకి గట్టి చర్యలు..   

ఇప్పుడైతే కార్డు లేకపోయినా అర్హత ఉంటే రేషన్‌ ఇవ్వండి 

వారితో దరఖాస్తు చేయించి కార్డులు మంజూరు చేయండి 

గ్రామ స్థాయి నుంచి మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌.. రైతుకు ఏ ఇబ్బంది వచ్చినా తెలియాలి   

కరోనా వైరస్‌ ఎవరికి వచ్చింది? వారి వయసు ఎంత? వారు ఇప్పటికే ఏ వ్యాధులతో బాధ పడుతున్నారు? తదితర వివరాల ఆధారంగా హైరిస్కు కేసులను గుర్తించాలి. వెంటనే వారిని కోవిడ్‌ క్రిటికల్‌ కేర్‌ ఆసుపత్రులకు తరలించి మంచి వైద్యం అందించడం ద్వారా మరణాలను అరికట్టగలం. 

ప్రకటించిన ధరలను ప్రతి దుకాణం వద్ద బోర్డుల్లో ప్రదర్శించాలి. ఇది అమలు కాకపోతే తప్పు కలెక్టర్లదే. రెండు రోజులకు ఒకసారి నిత్యావసర వస్తువుల ధరలను ప్రకటించి, ప్రచారం చేయాలి. ఎవరైనా అధిక ధరకు అమ్మితే వెంటనే కేసులు పెట్టి, జైలుకు పంపించాలి. ధరలు పూర్తిగా కంట్రోల్‌లో ఉండేలా కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యత తీసుకోవాలి. 

కరోనా సహాయం కింద రేషన్‌ తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.1000 సాయం అందించాం. గతంలో ఈ డబ్బు అందని వారికి ఇప్పుడు ఇవ్వండి. ఇన్‌స్పెక్షన్‌ లాంటి అంశాల జోలికి పోవద్దు. అవన్నీ తర్వాత పరిశీలించుకోవచ్చు. పాత రేషన్‌ కార్డు ఉన్నా సరే వెంటనే వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని రూ.1000 ఇవ్వండి. 

క్వారంటైన్‌ సెంటర్లలో మంచి సదుపాయాలు కల్పిస్తే తొందరపడి ఇంటికి వెళ్లిపోవాలని ఆలోచించరు. బాత్‌రూమ్స్, బెడ్లు, దుప్పట్లు, మంచి భోజనం అందిస్తే.. క్వారంటైన్‌ బాగుందనే ఆలోచన వారికి వస్తుంది. 

మార్కెటింగ్‌కు సంబంధించి కొన్ని వినూత్న ఆలోచనలు చేస్తున్నాం. ఈ సమయంలో వ్యవసాయాన్ని, రైతును కాపాడుకోగలిగితే 60 శాతం ఆర్థిక వ్యవస్థను మనం నిలబెట్టుకోగలుగుతాం. అందుకే వ్యవసాయంపై కలెక్టర్లు ఎక్కువ ధ్యాస పెట్టాలి. 

సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా జనం గుమిగూడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. రద్దీ తగ్గించాలంటే.. ప్రతి రోజూ నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలని, లేదంటే లాక్‌డౌన్‌ ఉద్దేశం నెరవేరదని స్పష్టం చేశారు. కోవిడ్‌–19 నివారణ చర్యలు, రైతులను ఆదుకోవడం, రేషన్‌ పంపిణీ, నిత్యావసర సరుకులు, ఆక్వా ఉత్పత్తుల కొనుగోలు తదితర అంశాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారికి మార్గనిర్దేశం చేశారు. పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  

సమస్య లేకుండా ధాన్యం కొనుగోళ్లు  
► మొదటిసారి ఫాంగేట్‌ పద్ధతిలో గ్రామ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌కు బాధ్యతలు అప్పగించాం. తెలంగాణ నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా నిలిపేశాం.  
► మద్దతు ధర కన్నా తక్కువ ఖరీదుకు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి రాకుండా ఈ చర్యలు తీసుకున్నాం.  సరిహద్దుల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూసుకోవాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశిస్తున్నా.  
► కొనుగోళ్లు సవ్యంగా జరుగుతున్నాయా? లేదా? అన్నది చూసుకోండి. ఏ సమస్య ఉన్నా.. వెంటనే సీఎం కార్యాలయం దృష్టికి తీసుకురండి. వెంటనే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తాం.  

పేషెంట్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ చాలా ముఖ్యం 
► కుటుంబ సర్వే ద్వారా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, బీపీ, సుగర్, ఆస్తమా లాంటి లక్షణాలు ఉన్న వారందరికీ పరీక్షలు చేయించాలి. మెడికల్‌ ఆఫీసర్‌ నిర్ధారించిన వారే కాకుండా, అందరికీ పరీక్షలు చేయించాలి. ఒకవేళ కరోనా సోకితే.. ఈ హైరిస్క్‌ ఉన్న వారిపై ప్రభావం చూపుతుంది కాబట్టి అందరికీ పరీక్షలు చేయించాలి. ► ప్రతి ఆసుపత్రిలో ఐసోలేషన్‌ సదుపాయం ఉండాలి. ఎవరైనా పేషెంట్‌ వస్తే అతనికి కరోనా ఉందా? లేదా? అన్నది ఎవరికీ తెలియదు కాబట్టి, ప్రతి పేషెంట్‌ను కోవిడ్‌ కేసే అనుకుని ఆ మేరకు వైద్యులు, సిబ్బంది, జాగ్రత్తలు తీసుకుని వైద్యం అందించాలి. ఇందుకోసం ప్రతి ఆసుపత్రిలో కొంత భాగంలో ఐసోలేషన్‌ సదుపాయం కల్పించాలి.  
► తర్వాత కోవిడ్‌ పరీక్షలు చేస్తే.. నెగిటివ్‌గా వచ్చినా, అక్కడే చికిత్స అందించడానికి వీలుంటుంది. పాజిటివ్‌ వస్తే.. కోవిడ్‌ ఆస్పత్రికి తరలించడానికి అవకాశం ఉంటుంది. కోవిడ్‌ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను బాగా అభివృద్ధి చేయాలి. వైద్యులకు, సిబ్బందికి మాస్క్‌లు, పీపీఈలు నిరంతరం అందుబాటులో ఉండాలి.   
మంగళవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   

మే 15 నాటికి రైతు భరోసాకు సిద్ధం కావాలి 
► గతంలో వైఎస్సార్‌ రైతు భరోసా ఎవరికైనా రాకపోతే.. వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలన్న దానిపై ప్రొసీజర్‌ను మళ్లీ గ్రామ సచివాలయాలకు పంపండి. మే 15వ తేదీ నాటికి వైఎస్సార్‌ రైతు భరోసా సొమ్ము చెల్లించేందుకు సిద్ధం కావాలి.  
► ఖరీఫ్‌ కన్నా ముందుగానే చెప్పిన మాట మేరకు రైతులకు భరోసా మొత్తాన్ని చెల్లిస్తాం. అర్హుల జాబితాను సామాజిక తనిఖీ కోసం గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తాం. దీనికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. 
► ఇళ్ల పట్టాల కోసం తీసుకున్న ప్రతి ఎకరాను వారి సమ్మతితోనే, వారికి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చిన తర్వాతే తీసుకున్నామని గర్వంగా చెబుతున్నా. పొజిషన్‌లోకి తీసుకోవాల్సిన భూమిపై వెంటనే దృష్టి సారించాలి.  
► అన్నీ అనుకున్నట్టు జరిగితే మే నెలలో పంపిణీకి చర్యలు తీసుకుందాం. ఆ లోపు లే అవుట్‌ అభివృద్ధి, ఇతర కార్యక్రమాలన్నీ పూర్తి చేయండి. 

నెగిటివ్‌ వచ్చినా జాగ్రత్తలు తప్పనిసరి 
► పాజిటివ్‌ కేసులకు సంబంధించి నెగిటివ్‌గా తేలిన వారు.. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ వారు క్వారంటైన్‌లో ఉన్నారు. వీరి విషయంలో నిర్దేశించుకున్న వైద్య విధాన ప్రక్రియను పూర్తి చేసి, ఇళ్లకు పంపించేటప్పుడు పూర్తి ప్రొటోకాల్‌ పాటించాలి. ఒకటికి రెండుసార్లు పరీక్షలు చేసి నెగిటివ్‌ వస్తేనే వారిని ఇళ్లకు పంపించాలి.  
► ఇళ్లకు వెళ్లిన తర్వాత కూడా వారిని జాగ్రత్తగా ఉండాలని చెప్పండి. పౌష్టికాహారం తీసుకునేలా సూచనలు ఇవ్వండి. పౌష్టికాహారం కోసం వారికి ఆర్థిక సహాయం కూడా చేయండి.  
► జిల్లాల్లోని షెల్టర్లన్నింటికీ ఒక రెసిడెంట్‌ ఆఫీసర్‌ను పెట్టాలి. ప్రతిరోజూ భోజనం, మెనూ మార్చారా? లేదా? బాత్‌రూమ్స్‌ పరిశుభ్రంగా ఉన్నాయా? లేవా? పారిశుధ్యం సరిగ్గా ఉందా? లేదా? అన్నదానిపై ప్రతిరోజూ ఫీడ్‌ బ్యాక్‌ తెప్పించుకోవాలి. 

రైతులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి 
► ఎక్కడ ఏ రైతు ఇబ్బంది పడినా ఆ విషయం వెంటనే తెలిసేలా గ్రామ స్థాయి నుంచి మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ రావాలి. అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ తనకు ఇచ్చిన ట్యాబ్‌ ద్వారా ఈ సమాచారాన్ని నివేదించాలి. ఈ సమాచారం పై స్థాయిలో ఉన్న వారికే కాకుండా జిల్లా కలెక్టర్లకూ రావాలి. 
► రైతు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు? ఏ పంటకు తక్కువ ధర వస్తుంది? అనే వివరాలు కలెక్టర్లకు రావాలి. దీని ఆధారంగా మార్కెటింగ్‌ శాఖ అధికారులతో మాట్లాడాలి.  
► మన రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు వెళ్లేవి. కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో మార్కెట్లు నడవడం లేదు. మధ్యలో ఆపేస్తారనే భయంతో లారీల రవాణా నడవడం లేదు. ఈ సమస్యలపై ఉన్నతాధికారులు రోజూ చర్చిస్తున్నారు. 
► కలెక్టర్లు కూడా ఈ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. మార్కెటింగ్‌ అధికారులతో మాట్లాడాలి. రవాణా అందుబాటులోకి తీసుకురావాలి. బయట మార్కెట్లకు పంపించడమే కాకుండా, స్థానిక మార్కెట్లపై కూడా దృష్టి పెట్టాలి.  
► స్వయం సహాయక సంఘాలు, రైతు బజార్ల ద్వారా వార్డులు, గ్రామ స్థాయి వరకు అరటిని పంపుతున్నాం. మనకు వచ్చే రేటుకే ప్రజలకు అమ్ముతున్నాం. రైతుకు మంచి జరిగితే చాలని అనుకుంటున్నాం. ఈ ఆలోచన వైఎస్సార్‌ జనతా బజార్లకు దారితీసింది. వచ్చే ఏడాదిలోగా వీటి ఏర్పాటుకు రూపకల్పన చేస్తున్నాం. 
► భౌతిక దూరం పాటించేలా రైతులు, రైతు కూలీల్లో చైతన్యం కలిగించి, ఆ మేరకు వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగేలా చూడాలి.  

మరింత చేరువకు తీసుకెళ్లండి 
► జనం గుమిగూడకుండా ఇంకా ఏం చేయాలనే దానిపై ఆలోచించండి. మార్కెట్లు, రైతు బజార్లను వికేంద్రీకరిస్తూ, ఆంక్షలను అమలు చేస్తూ రోజూ నిత్యావసరాలను సరఫరా చేయండి. మనం ఇచ్చిన పరిమిత సమయంలోనే భౌతిక దూరం పాటిస్తూ కొనుగోలు చేసేలా చూడండి.  
► హాట్‌ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ప్రజల మూవ్‌మెంట్‌ను తగ్గిస్తూ.. వారికి అత్యంత సమీపంలో అన్నీ అందుబాటులో ఉండేలా చేయాలి.  

ఏ ఒక్కరూ పస్తు ఉండే పరిస్థితి రాకూడదు 
► ఈ నెల 16వ తేదీ నుంచి రెండో విడత ఉచిత రేషన్‌ పంపిణీకి చర్యలు తీసుకోవాలి. భౌతిక దూరం పాటించడానికి, రద్దీని తగ్గించడానికి రేషన్‌ దుకాణాల కౌంటర్లను పెంచుతున్నాం. ఒకే దుకాణం పరిధిలో రెండు మూడు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.  
► ప్రజలు గుమిగూడకుండా ముందే టోకెన్లు ఇస్తున్నాం. ఎవరు ఏ రోజు రేషన్‌ కోసం రావాలో, ఏ కౌంటర్‌ వద్దకు రావాలో స్లిప్పులో ఉంటుంది. కౌంటర్‌ వద్ద కూడా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నాం.  
► గత రేషన్‌ సమయంలో గుర్తించిన అంశాల ఆధారంగా ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ రేషన్‌ పంపిణీ సజావుగా జరిగేలా కలెక్టర్లు పర్యవేక్షించాలి.  
► ఎవరికి కార్డు లేకపోయినా అర్హతలు గ్రామ, వార్డు సచివాలయాల్లో పెట్టాం. ఇప్పుడు అర్హత ఉంటే కార్డు లేకపోయినా సరే ముందు రేషన్‌ ఇచ్చేయండి. ఇలాంటి సమయంలో ఆహారం లేని పరిస్థితి ఉండకూడదు.  ఏ ఒక్కరూ కూడా పస్తు ఉండే పరిస్థితి రాకూడదు. కార్డు కోసం దరఖాస్తు చేయించి అర్హత ఉంటే మంజూరు చేయండి.   

ఆక్వా, పారిశుధ్యంపై దృష్టి పెట్టాలి 
► ఆక్వా ఉత్పత్తులు నిర్ధారించిన ధరకు కొనుగోలు చేసేలా కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకుని ఎగుమతి దారులపై ఒత్తిడి తేవాలి. ప్రాసెసింగ్‌ ప్లాంట్లు పనిచేసేలా, ఈ ప్లాంట్లకు అవసరమైన కార్మికులు అందుబాటులో ఉండేలా, ఎగుమతులు జరిగేలా చూడాలి.  
► చేపల దాణా రేట్లు పెంచుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. వెంటనే గట్టి చర్యలు తీసుకోవాలి. ఇంతకు ముందు ఏ ధర ఉందో అంతకే అమ్మేలా సీడు, ఫీడ్‌పై ఆర్డినెన్స్‌ తీసుకురావాలి. ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలి. అప్పుడే ఆక్వా రంగంలో స్థిరీకరణ ఉంటుంది.  
► గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యంపై నిరంతరం దృష్టి పెట్టండి. మన చుట్టుపక్కల ప్రాంతాలు బాగుంటేనే ఏ వైరస్‌ అయినా, బ్యాక్టీరియా అయినా ప్రబలకుండా ఉంటుంది. రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్కులు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశాలు, వీటిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. రైతు భరోసా కేంద్రాలు జూన్‌ నుంచి పని చేయాలి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top