పోలవరం–బనకచర్ల అనుసంధానికి లైన్‌ క్లియర్‌

CM YS Jagan Review Meeting With Water Resources Department  - Sakshi

నాలుగేళ్లలో పనులు పూర్తిచేయాలి

కనిష్ఠ వ్యయంతో రైతులకు గరిష్ఠ ప్రయోజనాలు కల్పించాలి

రాయలసీమ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు గోదావరి వరద జలాలు

అప్పుడే దుర్భిక్ష ప్రాంతాలు సస్యశ్యామలం

జలవనరుల శాఖ అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం

సాక్షి, అమరావతి: సముద్రంలో కలుస్తున్న గోదావరి వరద జలాలను ఒడిసి పట్టి.. ఆ నీటిని దుర్భిక్ష ప్రాంతాలకు తరలించి.. వాటిని సస్యశ్యామలం చేయడానికి తలపెట్టిన పోలవరం–బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ (బీసీఆర్‌) అనుసంధానం పనులను నాలుగేళ్లలోగా పూర్తిచేయాలని జలవనరుల శాఖ అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాయలసీమతోపాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఈ జలాలను అందించడం ద్వారా ఆయా ప్రాంతాలను సుభిక్షం చేయవచ్చునన్నారు. పోలవరం–బీసీఆర్‌ అనుసంధానంపై జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, కృష్ణా డెల్టా సీఈ, సీఎంఓ సాంకేతిక సలహాదారు నారాయణరెడ్డి, వ్యాప్కోస్‌ ప్రతినిధులతో సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.  

అనుసంధానం ఇలా..
గోదావరి వరద జలాలను పోలవరం నుంచి కర్నూలు జిల్లాలోని బీసీఆర్‌కు తరలించడంపై వ్యాప్కోస్‌ రూపొందించిన ఫీజుబులిటీ రిపోర్టు (సాధ్యాసాధ్యాల నివేదిక)పై లోతుగా చర్చించిన ముఖ్యమంత్రి.. తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని తరలించే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. ఇదీ ఆ ప్రతిపాదన..
►పోలవరం కుడి కాలువ ప్రస్తుత సామర్థ్యం 17,633 క్యూసెక్కులు. ఈ కాలువ సామర్థ్యాన్ని మరో 23,144 క్యూసెక్కుల (రెండు టీఎంసీలు)కు పెంచుతారు. అంటే.. 40,777 క్యూసెక్కుల గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలిస్తారు.
►ప్రకాశం బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం నుంచి రెండు టీఎంసీలను నాగార్జునసాగర్‌ కుడి కాలువలో 80 కి.మీ వద్దకు ఎత్తిపోస్తారు. ఈ కుడి కాలువ ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తూనే.. కొత్తగా 150 నుంచి 200 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మంచే బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తారు. దుర్భిక్ష పల్నాడులో కొత్తగా సుమారు రెండు లక్షల ఎకరాలకు
ఈ నీటిని అందిస్తారు.
►మరోవైపు.. బొల్లాపల్లి నుంచి వెలిగొండ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని అందిస్తూనే.. నల్లమల అడవుల్లో సుమారు 20 కి.మీ నుంచి 25 కి.మీల పొడవున
తవ్వే సొరంగం ద్వారా బీసీఆర్‌లోకి గోదావరి జలాలను తరలిస్తారు. అక్కడ నుంచి గోదావరి నీటిని గాలేరు–నగరి, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌ ఆయకట్టుకు సరఫరా చేస్తారు.

యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి
పోలవరం–బీసీఆర్‌ అనుసంధానం పనులను నాలుగేళ్లలోగా పూర్తిచేయాల్సిందేనని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. గోదావరి జలాలను పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా బొల్లాపల్లి రిజర్వాయర్‌ వరకూ తరలించే పనులను కనిష్ఠ వ్యయంతో రైతులకు గరిష్ఠ ప్రయోజనాలను అందించడంపై అధ్యయనం చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన అంచనా వ్యయాలను రూపొందించాలన్నారు. అలాగే..
►బొల్లాపల్లి రిజర్వాయర్‌ను 150 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మస్తే ఎంత వ్యయం అవుతుంది.. 160, 170, 180, 190, 200 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తే ఎంత వ్యయం అవుతుందో కూడా లెక్కలుకట్టాలని సూచించారు.
►అంతేకాక.. ప్రకాశం బ్యారేజీ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి రివర్స్‌ పంపింగ్‌ చేసి.. పులిచింతల నుంచి నాగార్జునసాగర్‌ కుడి కాలువలోకి గోదావరి జలాలను ఎత్తిపోసి.. అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌లోకి తరలించే పనుల వ్యయంపై కూడా అధ్యయనం చేయాలన్నారు.
►బొల్లాపల్లి రిజర్వాయర్‌ నుంచి గోదావరి జలాలను వెలిగొండ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తూనే బీసీఆర్‌లోకి తరలించేందుకు వ్యాప్కోస్‌ రూపొందించిన నివేదిక ప్రకారం చూస్తే.. టైగర్‌ శాంక్చురీ (పులుల అభయారణ్యం), రిజర్వు ఫారెస్ట్‌లలో 40 కి.మీల పొడవున సొరంగం తవ్వాల్సి ఉంటుందని.. అభయారణ్యం, రిజర్వు ఫారెస్ట్‌లలో పనులు చేయాలంటే అనుమతులు రావడంలో జాప్యం చోటుచేసుకుంటుందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.  
►అలాకాకుండా.. వెలిగొండ ప్రాజెక్టు కాలువకు సమాంతరంగా కొంతదూరం తరలిస్తే.. అభయారణ్యాన్ని తప్పించవచ్చునని.. నల్లమల అడవుల్లో కొంత మైదాన ప్రాంతం.. 20 కి.మీల పొడవున తవ్వే సొరంగం ద్వారా బీసీఆర్‌లోకి గోదావరి జలాలను తరలించవచ్చునని అధికారులు వివరించారు. దీంతో బొల్లాపల్లి రిజర్వాయర్‌ నుంచి బీసీఆర్‌లోకి తక్కువ ఖర్చుతో గరిష్ఠంగా నీటిని తరలించడంపై అధ్యయనం చేసి.. డీపీఆర్‌ను రూపొందించాలని వ్యాప్కోస్‌ ప్రతినిధులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top