భరోసా కల్పించండి

CM YS Jagan Review Meeting With Officials On Covid-19 Prevention - Sakshi

కరోనా బాధితుల్లో భయాందోళనలు తొలగించండి

ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

మానసిక స్థయిర్యం కలిగించాలి

వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని జాగ్రత్తగా చూసుకునేలా అవగాహన కల్పించాలి

ఇటువంటివి జీవితంలో సర్వసాధారణమే

ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలి

ప్రజారోగ్య రంగంలో ముమ్మరంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి

నాడు–నేడు కింద ప్రతిపాదించిన పనులన్నీ పూర్తిచేయాలి

ఇతర ఎమర్జెన్సీ కేసులపైనా దృష్టిపెట్టాలి

వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన అందరికీ రూ.2వేలు ఇవ్వాలి

మాస్క్‌ల పంపిణీ వేగవంతం చేయండి

నేటి నుంచి పొగాకు వేలం నిర్వహించండి

సామాజికంగా విపరిణామాలు

సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర భయాందోళనలను తొలగించి వారిలో ధైర్యం, భరోసా కలిగించాలని.. వారిలో చైతన్యం కలిగించేలా మరిన్ని అడుగులు ముందుకు వేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను కోరారు. వైరస్‌పట్ల అవగాహన, జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలు అవలంబిస్తున్న విపరీత పోకడ, ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించేలా అవి అనవసర కథనాలు ప్రసారం చేస్తున్నట్లు వైద్య నిపుణులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా వైఎస్‌ జగన్‌ ఈ సూచనలు చేశారు. కోవిడ్‌–19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదివారం తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు రాష్ట్రవ్యాప్తంగా కేసుల సరళిని, విజయవాడ, పశ్చిమ గోదావరి జిల్లాలో కేసుల పెరగడానికి గల కారణాలు సీఎంకు వివరించారు. సమీక్షలో అధికారులు ప్రస్తావించిన అంశాలు.. ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.

ప్రజారోగ్య రంగంలో ముమ్మరంగా మౌలిక సదుపాయాలు
అసలు కోవిడ్‌–19 లాంటి విపత్తులను ఎదుర్కోవాలంటే ఆరోగ్యం రంగంలో మౌలిక సదుపాయాల కల్పన చాలా అత్యవసరమని.. వాటి ద్వారానే ప్రజల ప్రాణాలు నిలుపుకోగలమని, అందుకు వాటి పనులు ముమ్మరంగా సాగాలని సీఎం జగన్‌ స్పష్టంచేశారు. అంతేకాక..
► నాడు–నేడు కింద ప్రతిపాదించిన పనులన్నీ పూర్తిచేయాలని ఆదేశించారు.
► కరోనా యేతర ఎమర్జెన్సీ కేసులపైనా దృష్టిపెట్టాలని, అత్యవసర సేవలకు ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగకూడదని చెప్పారు.
► ప్రణాళిక ప్రకారం ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సుల పోస్టులు భర్తీచేయాలని ముఖ్యమంత్రి చెప్పగా అందుకు సిద్ధమవుతున్నామని అధికారులు బదులిచ్చారు.

విజయవాడలో ఇద్దరు వ్యక్తులవల్లే..
విజయవాడలో కేవలం ఇద్దరు వ్యక్తుల కారణంగా కృష్ణలంకలోని ఒక వీధిలో, మాచవరం కార్మికనగర్‌లోని ఒక వీధిలో కేసులు ఎక్కువగా వచ్చాయని అధికారులు సీఎంకు తెలిపారు. అలాగే..
► పశ్చిమగోదావరి జిల్లాలో కూడా ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి కారణంగానే వైరస్‌ వ్యాపించిందన్నారు.
► టెస్టులు సంతృప్తికర స్థాయిలో నిర్వహించి దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామన్నారు.
► దీనివల్ల రాష్ట్రంలో వైరస్‌ పరిస్థితి ఏంటి? ఏ రకంగా ప్రభావం చూపుతోంది? హైరిస్క్‌ ఉన్న వారిపై వైరస్‌ చూపించే ప్రభావం తదితర అంశాలను తెలుసుకునేందుకు విస్తృతంగా నిర్వహించిన పరీక్షలు చాలా ఉపయోగ పడుతున్నాయని వారు వివరించారు.
► లాక్‌డౌన్‌ అనంతరం తీసుకునే నిర్ణయాలు, అనుసరించాల్సిన వ్యూహాలకు ఇవి ఎంతో తోడ్పాటునందిస్తాయని అధికారులు సీఎంవైఎస్‌ జగన్‌కు చెప్పారు. 

మాస్క్‌ల పంపిణీ పైనా ఆరా
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మూడేసి మాస్క్‌ల పంపిణీ గురించి కూడా సీఎం వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు. ఇందుకు అధికారులు స్పందిస్తూ..
► ఇప్పటికే 1.3 కోట్లకు పైగా మాస్క్‌లను రెడ్‌ క్లస్టర్లలో పంపిణీ చేశామని వారు వెల్లడించారు. 
► రోజుకు 40 లక్షల చొప్పున మాస్క్‌లు తయారుచేస్తున్నామని, అత్యంత వేగంగా పంపిణి కార్యక్రమం జరుగుతోందని కూడా చెప్పారు.
► అనంతరం సీఎం మాట్లాడుతూ.. మాస్కుల తయారీ, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
► మాస్క్‌ల తయారీ బాధ్యతను డ్వాక్రా సంఘాలకు ఇవ్వడంవల్ల వారికి కష్టకాలంలో ఉపాధి కూడా కలిగిందని వైఎస్‌ జగన్‌ చెప్పారు. 

డిశ్చార్జ్‌ అయిన అందరికీ రూ.2వేలు
రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌–19 నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అయిన వారందరికీ రూ.2వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కూడా సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు డిశ్చార్జ్‌ అయిన వారందరికీ ఆ మొత్తాన్ని ఇవ్వాలని ఆయనన్నారు. ఇందుకు అధికారులు బదులిస్తూ.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 231 మంది వైరస్‌ నుంచి బయటపడి డిశ్చార్జ్‌ అయ్యారని, వీరిలో కొందరికి ఇప్పటికే అందజేశామని.. మిగిలిన వారికి కూడా ఆ మొత్తాన్ని అందిస్తామని చెప్పారు.

పొగాకు వేలంపాటలు నిర్వహించండి
సమావేశంలో పొగాకు కొనుగోళ్ల అంశం కూడా చర్చకు వచ్చింది. దీంతో రైతులు నష్టపోకుండా వెంటనే పొగాకును కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు.
► సోమవారం నుంచి వేలం పాటలు నిర్వహించాలని ఆయన చెప్పారు.
► ప్రకాశం జిల్లాల్లో పొగాకు కొనుగోలు కేంద్రాలు రెడ్‌జోన్లలో ఉన్నందున టంగుటూరు, కొండెపిల్లో ప్రత్యామ్నాయ వేలం పాట కేంద్రాల ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. 
► అలాగే, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కూడా పొగాకు కొనుగోలు కోసం వేలం పాట కేంద్రాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు.
► ఈ కేంద్రాలను ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలన్నారు.
సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.  

► కరోనాపై వివిధ ప్రసార మాధ్యమాలు ప్రజల్లో కలిగిస్తున్న తీవ్ర ఆందోళన వల్ల సామాజికంగా విపరిణామాలు చోటుచేసుకుంటున్నాయని.. దీంతో కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వెళ్లినా స్థానికులు అడ్డుకోవడం, చివరకు అది ఉద్రిక్తతలకు దారితీసిన ఒకట్రెండు ఘటనలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
► మానవత్వం పోయి వివక్ష, విద్వేషం, తక్కువగా చూడడం లాంటి భావనలు కలిగించేలా ఆ కథనాలు ఉంటున్నాయని వారు వివరించారు.
► వైరస్‌ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల స్థానంలో.. ప్రజల్లో తీవ్ర భయాందోళనలు, అపోహలను కలిగిస్తున్నారని తెలిపారు.
► దీంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీడియా చెప్పాలని.. ప్రజల్లో లేనిపోని భయాలు రేకెత్తించడం సరికాదన్నారు. 
► ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
► పెద్ద వయస్కులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని జాగ్రత్తగా చూసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. వారిలో రోగనిరోధక శక్తి పెంపొందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
► అసలు వైరస్‌తో ఆస్పత్రులకు వచ్చేవారు చాలా తక్కువేనని.. ఐసీయూలో చేరే వారైతే నాలుగు శాతంలోపేనని సీఎం చెప్పారు.
► 81 శాతం కంటే ఎక్కువ మంది ఇంట్లో ఉంటూనే వ్యాధి నుంచి బయటపడుతున్నారని సీఎం  చెప్పారు. ఇలాంటివన్నీ జీవితంలో సర్వసాధారణం అని భావించి సన్నద్ధమవ్వాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top