నిజాయతీగా టెస్ట్‌ కిట్ల ఆర్డర్‌

CM YS Jagan Comments On Purchase of Rapid Test Kits - Sakshi

ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల కొనుగోలు వ్యవహారంపై సీఎం వైఎస్‌ జగన్‌

కేంద్రాన్ని అడిగితే ఇవ్వలేని పరిస్థితి.. మనకు కిట్లు అవసరం

ఐసీఎంఆర్‌ ఒక్కో కిట్‌ రూ.795తో కొనుగోలుకు ఆర్డర్‌  

ఇంతకంటే రూ.65 తక్కువ ధరతోనే ఏపీ ఆర్డర్‌ ప్లేస్‌ చేసింది 

ఒకవేళ తక్కువ ధరకు ఏ రాష్ట్రానికైనా అమ్మితే, అంతే చెల్లిస్తామని ఆర్డర్‌లో స్పష్టీకరణ  

మన షరతు మేరకు ధర తగ్గింపునకు కంపెనీ ఆమోదం 

అవినీతి రహితంగా పని చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖకు అభినందనలు 

పండ్లు, కూరగాయలు విరివిగా లభ్యమయ్యేలా చూడాలి 

మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ మరింత బలోపేతం కావాలి 

మనం ఆర్డర్‌ ఇచ్చినప్పుడు ఆ కిట్లు బయట దేశంలో తయారయ్యాయి. ఇప్పుడు ఆ కిట్లను మన దేశంలోనే తయారు చేయడానికి అదే కంపెనీకి ఐసీఎంఆర్‌ అనుమతిచ్చింది. అందువల్ల కిట్‌ రేటు తగ్గింది. మనం ముందు చూపుతో పెట్టుకున్న షరతు కారణంగా మన రేటు కూడా తగ్గబోతోంది. ఇందుకు ఆ కంపెనీ అంగీకరించింది. 

కరోనా లాంటి వైరస్‌ను ఎదుర్కోవాలంటే పౌష్టికాహారం చాలా అవసరం. అందుకే పండ్లు, కూరగాయలు విరివిగా లభ్యం అయ్యేలా చూడాలి. కర్నూలులో రూ.100కే నాలుగైదు రకాల పండ్లు అందిస్తున్న వ్యూహాన్ని మిగతా చోట్ల కూడా అమలు చేయాలి.  

సాక్షి, అమరావతి: చాలా నిజాయతీగా ఆలోచించి కోవిడ్‌–19 పరీక్షల కిట్లను ఆర్డర్‌ చేశారని వైద్య ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో కోవిడ్‌–19 నివారణ చర్యలపై సమీక్ష సందర్భంగా ఈ కిట్ల ధరపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ  ‘మనకు కిట్లు అవసరం. కేంద్రాన్ని అడిగితే ఇవ్వలేని పరిస్థితి. ప్రపంచంలో ఎక్కడున్నా సరే.. మీరు కొనుక్కోండి అని కేంద్రం చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చిన కంపెనీకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆర్డర్‌ ఇచ్చింది. ఐసీఎంఆర్‌ రూ.795 చొప్పున కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చింది. ఈ విషయం తెలిసీ కూడా అంతకంటే రూ.65 తక్కువ ధరకు ఏపీ ఆర్డర్‌ ప్లేస్‌ చేసింది’ అన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. 

షరతుతోనే కొనుగోలు 
► ఒకవేళ తక్కువ ధరకు ఏ రాష్ట్రానికైనా అమ్మితే.. ఆ రేటు ప్రకారమే చెల్లిస్తామని ఆర్డర్‌లో స్పష్టం చేశారు.  ఇలాంటి ఆలోచన ఎవరూ చేయరు. రాజీ పడకుండా, కిట్లను వేగంగా తెప్పించుకోవడంలో ఆలస్యం చేయకుండా తీసుకున్న చర్యలు ప్రశంసనీయం. ఇప్పటి వరకు 25 శాతం మాత్రమే పేమెంట్‌ ఇచ్చారు.  
► ఇంత ఒత్తిళ్ల మధ్య మంచి ఆలోచనతో కొనుగోలు చేశారు. అవినీతి అన్నది ఎక్కడా లేకుండా ఉండాలన్న ఆలోచనలకు అనుగుణంగా మీరు (వైద్య శాఖ) పని చేస్తున్నారు. అధికారుల ముందు చూపును అభినందిస్తున్నా.  
► ‘మీరు మాకు స్వేచ్ఛ ఇచ్చారు.. దాన్ని సద్వినియోగం చేసుకుని రాజీ పడకుండా అడుగులు ముందుకేస్తున్నాం’ అని అధికారులు సీఎంతో అన్నారు.    
రైతులకు మేలు చేసే అవకాశం వదులుకోకూడదు 
► అరటికి సంబంధించి సానుకూల పరిస్థితి ఏర్పడుతుండటం, కొన్ని చోట్ల రేట్లు పెరుగుతున్న తరుణంలో  నిరంతరం పర్యవేక్షణ కొనసాగాలి. రైతుకు మేలు జరిగే ఏ అవకాశాన్నీ వదులుకోకూడదు.  
► మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ద్వారా వివరాలు తెప్పించుకుని దీనిపై పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలి. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి.  
► రెడ్‌జోన్లలో ఉన్న ప్రజలకు మరింత అందుబాటులోకి నిత్యావసరాలు తీసుకురావాలి. డోర్‌ డెలివరీ లాంటి విధానాలతోపాటు మార్కెట్లను మరింత వికేంద్రీకరించి వారికి నిత్యావసరాలు అందేలా చూడాలి. 
► కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో అన్ని పరిశ్రమలు పని చేసేలా చర్యలు తీసుకోవాలి. 
► ఈ సమీక్షలో డిప్యూటీ సీఎంలు అంజాద్‌ బాషా, ఆళ్ల నాని, మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్‌ జవహర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

అస్సాంలో తెరుచుకుంటున్న చేపల మార్కెట్లు  
► అస్సాం ముఖ్యమంత్రితో సీఎం వైఎస్‌ జగన్‌ ఫోన్‌లో మాట్లాడటం వల్ల ఆక్వా రైతులకు సానుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు.  
► అక్కడ చేపల విక్రయానికి సంబంధించిన మార్కెట్లు తెరుచుకుంటున్నాయని, అస్సాం సీఎం సోనోవాల్‌ అధికారులతో సమీక్షించి మార్కెట్లు తెరిచేందుకు యత్నిస్తున్నారని చెప్పారు.   
► ఈ తరహా ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top