ముఖ్యమంత్రితో  108 ఉద్యోగుల చర్చలు సఫలం 

CM Jagan Promises 108 Employees Strike Retirement - Sakshi

ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ భరోసాతో ఉద్యోగుల్లో ఆనందం

తక్షణమే విధుల్లో చేరుతున్నట్టు ప్రకటన 

సాక్షి, అమరావతి :  మూడు రోజులుగా సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెలోకి దిగిన 108 ఉద్యోగులు గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. వారి సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ‘ఇది నాన్నగారు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకం.. పాదయాత్రలో పదే పదే నన్ను కలిసినప్పుడు మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చాను. అవన్నీ మర్చిపోయానని అనుకుంటున్నారా? మీరు సంతోషంగా పనిచేస్తేనే అంబులెన్సులు బాగా తిరుగుతాయి..’ అంటూ వారికి భరోసానిచ్చారు. ‘పథకం ఇంకా మెరుగ్గా ఉండాలనే కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్నాం.. బడ్జెట్‌లో నిధులు పెంచాం..’ అని చెప్పారు. సుమారు పదినిమిషాల పాటు వారితో చర్చలు జరిపిన సీఎం.. ‘మీరు ఏ సమస్య ఉన్నా నా దగ్గరకు రండి.. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు’ అని చెప్పడంతో ఉద్యోగ సంఘం ప్రతినిధులు అక్కడికక్కడే విధుల్లో చేరుతున్నట్టు ప్రకటించారు.

తాము గడిచిన ఐదేళ్లలో చాలాసార్లు ముఖ్యమంత్రిని కలవాలని ప్రయత్నించినా అవకాశం రాలేదని.. కనీసం సమస్యలు చెప్పుకోవడానికీ అవకాశం రాలేదని.. చివరకు సమ్మె చేయడం మినహా తమకు మరో దారి కనిపించలేదన్నారు. కానీ సీఎం భరోసానిచ్చారని.. ఉద్యోగ సంఘం ప్రతినిధులు చర్చల అనంతరం మీడియాతో చెప్పారు. 108 ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా దగ్గరుండి చూసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి జవహర్‌రెడ్డిని తమ ముందే సీఎం ఆదేశించారని, దీంతో బయటకు రాగానే అన్ని జిల్లాలకు ఫోన్‌చేసి రాత్రి 8 గంటల్లోగా అందరూ విధుల్లోకి రావాలని చెప్పినట్టు వారు ‘సాక్షి’తో చెప్పారు. సీఎంతో జరిగిన చర్చల్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి డా.కె.జవహర్‌రెడ్డి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కార్తికేయ మిశ్రా, నోడల్‌ అధికారి రాజేంద్రప్రసాద్, ఉద్యోగ సంఘం ప్రతినిధులు కిరణ్‌కుమార్, నర్సింగరావులున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top