రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కండి

CM Chandrababu comments during Dubai tour - Sakshi

దుబాయ్‌ పర్యటనలో సీఎం చంద్రబాబు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతున్నామని, దాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు కోరారు. తన దుబాయ్‌ పర్యటనలో భాగంగా ఆదివారం ఇండియన్‌ బిజినెస్, ప్రొఫెషనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్‌ ఎగ్జిక్యూటివ్‌లతో ఆంధ్రప్రదేశ్‌ను ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్‌ హబ్‌గా చేసుకోవాలని ఎమిరేట్స్‌ విమానయాన సంస్థలను సీఎం కోరారు. ఎమిరేట్స్‌ స్ట్రాటజీ అండ్‌ ప్లానింగ్‌ ఇన్‌చార్జి అద్నాన్‌ ఖాజిమ్, ఫ్లై దుబాయ్‌ సీఈవో ఘయిత్‌ అల్‌ ఘయిత్‌లతో సమావేశమైన ఆయన.. ఎయిర్‌క్రాఫ్ట్‌ నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాల్‌ సదుపాయాల్ని కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో ఒక విమానాశ్రయాన్ని నిర్మించాలని కోరారు. అమరావతి, విశాఖ, తిరుపతి నగరాల్ని దుబాయ్‌కు అనుసంధానించాలని సూచించారు.

పరిశీలిస్తానని ఫ్లై దుబాయ్‌ సీఈవో ఘయిత్‌ హామీ ఇచ్చారు. కాగా, ఐటీ, ఫిన్‌టెక్‌ రంగాల్లో సహకారమం దించే విషయాన్ని పరిశీలిస్తామని సీఎంతో జరిగిన సమావేశంలో ఫెడరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ చైర్మన్‌ సుల్తాన్‌ బిన్‌ సయీద్‌ అల్‌ మన్సూరీ హామీఇచ్చారు. డీపీ వరల్డ్‌ గ్రూప్‌ చైర్మన్, సీఈవో సుల్తాన్‌ అహ్మద్‌ బిన్‌ సులేయమ్‌తో జరిగిన సమావేశంలో ఓడరేవుల అభివృద్ధి రంగంలో కలసి పనిచేద్దామని సీఎం ప్రతిపాదించారు. ఇదిలా ఉండగా, దుబాయ్‌ యూఏఈ హ్యాపీనెస్‌ అండ్‌ వెల్‌ బీయింగ్‌ శాఖ మంత్రి ఉద్‌ బిన్‌ ఖల్ఫాన్‌ అల్‌ రౌమితోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. 

పలు ఒప్పందాలు..
అనంతరం రాష్ట్రంలో రెండు బిలియన్‌ డాలర్ల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో సహకరించేందుకు బిన్‌ జాయేద్‌ గ్రూపుతో సీఎం బృందం ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో నిర్మించబోయే ఔటర్, ఇన్నర్‌ రింగ్‌రోడ్లు, విజయవాడ మెట్రోరైలు, రామాయపట్నం, భోగాపురం ఎయిర్‌పోర్టు తదితర ప్రాజెక్టుల అభివృద్ధికి పెట్టుబడులు పెడతామని బిన్‌ జాయేద్‌ గ్రూపు తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో ఏవియేషన్‌ సిటీ నెలకొల్పేందుకు యూఏఈలోని మహ్మద్‌ అబ్దుల్‌ రెహమాన్‌ మహ్మద్‌ అల్‌ జూరానీకి చెందిన ఎల్‌ఎల్‌పీతో సీఎం బృందం ఒప్పందం చేసుకుంది. దశలవారీగా 5.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఈ సిటీ నిర్మిస్తామని కంపెనీ ముందుకొచ్చింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top