నీటి మీద రాతలు

CM Chandrababu Cheating AP Peoples  - Sakshi

అమలు కాని సీఎం హామీ

 పట్టించుకోని జిల్లా అధికారులు

ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ నుంచి తొలగించిన

గ్రామాలపై వెలువడని నిర్ణయం

 ఆందోళనలో పోలవరం నిర్వాసితులు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: నిర్వాసితులంటే త్యాగధనులంటూ పొగడ్తలు కురిపిస్తూ, మరోవైపు తడిగుడ్డతో తమ గొంతులు కోస్తున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణలో స్థానిక అధికార పార్టీ నేతలతో కుమ్మక్కైన సర్వేయర్లు భారీఎత్తున అవినీతికి పాల్పడ్డారని బా«ధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెరకపై ఉండి ముంపునకు అవకాశం లేని భూములకు పరిహారం అందించిన అధికారులు పూర్తిగా పల్లంలో ఉన్న భూములను ముంపు ఉండవని తేల్చేశారు. కొన్నిచోట్ల లంచం ఇవ్వని రైతుల పొలాల చుట్టూ ఉన్న

భూములను సేకరించి వారివి మాత్రం వదిలేశారు. చుట్టూ ముంపు భూములు ఉన్నప్పుడు తాము ఎలా ముంపు లేకుండా ఉంటామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణలో కోట్ల రూపాయలు చేతులు మారాయని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు పలుకుబడి ఉన్న బడాబాబుల మాటకే విలువ ఇచ్చారని, వారు ఇచ్చిన పర్సంటేజీలకు అనుగుణంగానే భూసేకరణ జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. కుక్కునూరు మండలంలో కొన్ని చోట్ల కొండ ప్రాంతంలో ఉన్న భూములకు పరిహారం ఇచ్చి, దిగువున ఉన్న ముంపు ప్రాంతాలను వీటి నుంచి తొలగించారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ విషయంలో రేషన్‌ డీలర్లు, వీఆర్‌ఏలు అవకతవకలకు పాల్పడినట్లు ఆధారాలతో సహా సాక్షి ప్రచురించినా ఇప్పటి వరకూ అధికార యంత్రాంగం వారిపై చర్యలు తీసుకోకపోగా వారిని వెనకేసుకురావడం పలు అనుమానాలకు తావిస్తోంది.

మొదటి జాబితాలో ఉన్న గ్రామాలనురెండవ జాబితాలో ఎందుకు తొలగించారు?
కుక్కునూరు మండలానికి సంబంధించి 11 గ్రామాలను ఆర్‌ అండ్‌ ఆర్‌ నుంచి తొలగించడం విమర్శలకు దారితీస్తోంది. ఒక గ్రామానికి సంబంధించి 70 శాతం భూములు ముంపునకు గురవుతున్నప్పుడు ఆ గ్రామానికి ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం అందిస్తామని చెప్పిన అధికారులు, ఆయా గ్రామాల్లో 70 శాతం భూములను సేకరించి, ఇప్పుడు ఆర్‌ అండ్‌ ఆర్‌ ఇవ్వకపోవడం దారుణమని నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం మొదటి జాబితాలో ఉన్న 11 గ్రామాలను రెండవ జాబితాలో ఎందుకు తొలగించాల్సి వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తొలగించిన 11 గ్రామాల్లో ఎక్కువ శాతం ప్రజలు కూలినాలి చేసుకునే నిరుపేదలే... రైతులకు పరిహారం ఇవ్వడంతో వారు వ్యవసాయం దాదాపుగా వదిలేశారు. దీంతో వీరికి పనిలేకుండా పోయింది. ఇప్పుడు వ్యవసాయం లేకుండా భూములన్నీ ముంపునకు గురి అవుతుంటే గ్రామస్తులకు మాత్రం పరిహారం ఇవ్వకపోతే తాము ఇక్కడ ఎలా బతకాలని వారు నిలదీస్తున్నారు. కొత్తగా వస్తున్న కుక్కునూరు సబ్‌ కలెక్టర్‌ అయినా తమ సమస్యలపై దృష్టి పెట్టాలని వారు
కోరుతున్నారు.

ద్వీపాలు ఏర్పాటు చేస్తారా?
పోలవరం ప్రాజెక్ట్‌ పేరుతో జరుగుతున్న వినాశనంలో అన్ని కులాలు, వర్గాల వారు బాధితులుగా మారారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని వదిలేసి చేతులు దులుపుకుంది. అటు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మా గురించి పట్టించుకోవడం లేదు. రాజీవ్‌నగర్‌ గ్రామానికి సంబంధించి 70 శాతం భూమిని ముంపులో సేకరించారు. 30 శాతం భూమితో ఇక్కడ ఉన్నవారికి ఉపాధి ఎలా? రాజీవ్‌నగర్‌ గ్రామం చుట్టూ నీరు ఉండి మధ్యలో ద్వీపంలా ఉంటుంది అలాంటప్పుడు మేం ఎలా బతకాలి?
–  కీసరి బజారు, ఆదివాసి సంఘం
నాయకుడు, రాజీవ్‌నగర్, కుక్కునూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top