ఈకేవైసీ గడువు పెంపు

Civil Supplies Department Decided To Increase EKYC Integration Deadline For Few More Days - Sakshi

15 ఏళ్లలోపు పిల్లలకు

సెప్టెంబర్‌ 15 వరకు అవకాశం

పెద్దలకు సెప్టెంబర్‌ 5 వరకు గడువు 

సాక్షి, అమరావతి : తెల్ల రేషన్‌ కార్డుల్లో ఈకేవైసీ (ఎలక్ట్రానిక్‌ నో యువర్‌ కస్టమర్‌) అనుసంధానం గడువును మరికొన్ని రోజులు పెంచుతూ పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు పౌర సరఫరాల శాఖ  ఎక్స్‌ అఫీషియో సెక్రటరీ కోన శశిధర్‌ తెలిపారు. 15 ఏళ్లు పైబడిన వారికి సెప్టెంబర్‌ 5 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. తొలుత ఆగస్టు 20 వరకు తుది గడువు విధించారు.

అయితే, ఈ–పాస్‌ మెషిన్లలో సమస్యలు తలెత్తటం, కొందరు కార్డుదారుల వేలిముద్రలు సరిపోలకపోవడంతో ఆధార్‌ కార్డులో వాటిని సరిచేయించుకోవాల్సి రావటంతో ఈకేవైసీ నమోదు వ్యవహారం ఇబ్బందికరంగా మారింది. డీలర్ల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా.. ఈకేవైసీ అనుసంధానం కాకపోవటంతో లక్షలాది కార్డుదారులు నేటికీ వేలిముద్రల్ని నమోదు చేయించుకోలేని పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో గడువు పెంచుతూ పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఇదిలావుంటే.. 15 ఏళ్లలోపు పిల్లలకు విద్యాశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా ఈకేవైసీ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని ఆ శాఖ ఎక్స్‌అఫీషియో సెక్రటరీ తెలిపారు. ఆ రెండు శాఖల సమన్వయంతో మూడు నెలల్లోగా ఈ ప్రక్రియను ఆయా పాఠశాలల్లోనే  పూర్తిచేస్తామన్నారు. తల్లిదండ్రులు సంబంధిత అధికారులను సంప్రదించి తమ పిల్లలకు సంబంధించిన వివరాలను ఈకేవైసీతో అనుసంధానం చేయించుకోవాలన్నారు. పిల్లలను  ఆధార్‌ నమోదు కేంద్రాలకు తీసుకెళ్లి వ్యయ ప్రయాసలకు లోను కావద్దని సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top