మాఫీ పేరుతో బంగారు మాయ


రాజమండ్రి : వ్యవసాయ రుణమాఫీ అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేసి సుమారు ఏడాదిన్నర కావస్తోంది. సీఎం సంతకం చేసేనాటికి జిల్లాలోని ఆరు లక్షలకు పైగా రైతు ఖాతాల్లో రూ.2,350 కోట్ల పంట రుణాలు, మరో రూ.3,860 కోట్ల బంగారు ఆభరణాల రుణాలు ఉన్నాయి. అంటే మొత్తం రూ.6,210 కోట్ల రుణాలున్నట్టు. అయితే తొలినాళ్లలోనే రూ.1.50 లక్షలకు మించి మాఫీ చేయకపోవడం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధన విధించడం, వాణిజ్య రైతులకు మాఫీ వర్తింపజేయకపోవడం ద్వారా  ప్రభుత్వం రుణమాఫీ భారాన్ని చాలావరకూ వ్యూహాత్మకంగా వదిలించుకుంది.



 వాయిదాల పద్ధతిలో చెల్లింపులు

 రుణమాఫీలో రూ.50 వేలకు పైబడి, రూ.1.50 లక్షల లోపు ఉన్నవాటిని ప్రభుత్వం వాయిదాల పద్ధతిలో చెల్లిస్తోంది. దీంతో రైతులకు రుణం పూర్తిగా రద్దు కాక బంగారం చేతికి రాకుండా పోయింది. ఇటువంటి రుణాలకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా బాండ్లు అందజేసినప్పుడే బంగారం తిరిగిస్తామని చెప్పడంతో రైతులు లబోదిబోమంటున్నారు. దీంతో గత ఖరీఫ్‌లోనే కాకుండా, ఈ ఏడాది ఖరీఫ్‌లో సైతం రుణాలందక రైతులు బయట అప్పులు చేస్తున్నారు. మాఫీ సొమ్మును ప్రభుత్వం మూడు విడతలుగా బ్యాంకులకు జమ చేసింది.



తొలి విడతలో 3.35 లక్షల మందికి రూ.348 కోట్లు రుణమాఫీ ఖాతాలో జమ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇందులో రూ.260 కోట్లు మాత్రమే డిపాజిట్ చేసి, రూ.88 కోట్లు పక్కన పెట్టింది. రెండో దశలో లక్ష మందికి రూ.222 కోట్లు జమ చేయగా, మూడో విడతలో రూ.43 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మొత్తమ్మీద ఇప్పటివరకూ రూ.525 కోట్ల రుణమాఫీ నిధులు రాగా, ఇందులో సుమారు రూ.210 కోట్లు మాత్రమే బంగారంపై రుణాలు మాఫీ అయ్యాయన్నది బ్యాంక్ వర్గాల అంచనా. మొత్తం బంగారు రుణాలు రూ.3,860 కోట్లు కాగా, రూ.210 కోట్లు (6 శాతం) మాత్రమే రుణమాఫీ జరిగిందని తెలిసి రైతులు లబోదిబోమంటున్నారు.



ఇదే సమయంలో బ్యాంకులు రైతుపత్రాలు తప్పుగా నమోదు చేయడం, సొసైటీల్లో డూప్లికేషన్ వంటి కారణాలతో మంజూరైన నిధుల్లో రూ.16 కోట్లు వెనక్కి మళ్లిపోయాయి. దీంతో అర్హులైనా సుమారు 13 వేల మంది మాఫీకి నోచలేదు. మాఫీపై ఆశలు పెట్టుకుని సకాలంలో రుణాలు చెల్లించని రైతులు 14 శాతం వడ్డీ భారం మోయడంతోపాటు, వేలం ప్రకటనతో అప్పు తీర్చేందుకు బయట మూడు నాలుగు రూపాయలకు అప్పులు చేయాల్సి వస్తోంది. బంగారంపై రుణాలు తీసుకున్న సమయంలో అప్పటి బంగారం విలువ ప్రకారం గ్రాముకు రూ.2వేల చొప్పున ఇచ్చేవారు.



బంగారం ధర ఇప్పుడు తగ్గడంతో గ్రాముకు రూ.1700కు మించి ఇవ్వడంలేదు. బంగారం దక్కించుకునేందుకు అప్పు చేసి వడ్డీ చెల్లించాలనుకునే రైతులకు ఇప్పుడు అసలులో కూడా కొంత కట్టాల్సి రావడం భారంగా మారింది. బంగారంపై పంట రుణాలు తీసుకున్న రైతుల్లో 80 శాతం మంది కౌలుదారులే. రుణం తీర్చేందుకు, ఇప్పుడు సాగు చేసేందుకు ఒకేసారి అప్పులు చేయాల్సిన దుస్థితిని వారు ఎదుర్కొంటున్నారు. ఇది తలకు మించిన భారం కావడంతో కౌలుదారులు సాగును వదిలేసుకుంటున్న సంఘటనలు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి.

 

 మాఫీ మాయలెన్నో!

  మండపేట మండలం తాపేశ్వరం శివారుకు చెందిన కౌలు రైతు కడియాల బుల్లబ్బాయి (29) ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగేళ్లలో రూ.2.50 లక్షల వరకూ అప్పుల పాలయ్యాడు. భార్యాపిల్లల బంగారం కూడా కుదువ పెట్టాడు. ఇది మాఫీ కాకపోగా, రైతుమిత్ర గ్రూపు నుంచి తీసుకున్న రూ.15 వేలు చెల్లించాల్సి వచ్చింది. బ్యాంకు రుణం మాఫీ కాక, అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్య చేసుకున్నాడు.



  పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి ఆంధ్రా బ్యాంక్‌లో 400 మంది బంగారంపై రూ.50 లక్షల రుణాలు తీసుకున్నారు. ఒక్క రైతుకూ నయాపైసా రుణం మాఫీ కాలేదు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంతో అవి పంట రుణాలు కాదని, సాధారణ రుణాలని నివేదికలు పంపారు. దీంతో ఇవి మాఫీలోకి రాలేదు.



  కాకినాడ రూరల్ మండలంలో 3,793 మంది బంగారు రుణాల మాఫీకోసం దరఖాస్తు చేసుకోగా 1097 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. మిగిలినవారు 14 శాతం వడ్డీ కట్టాల్సి వస్తోంది.



  కొత్తపేట నియోజకవర్గంలోని 37 బ్యాంకుల్లో సుమారు రూ.30 కోట్ల వరకూ బంగారు రుణాలుండగా, ఇక్కడ 10 శాతం కూడా రుణాలు మాఫీ కాలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top