హామీలు అమలు చేసేలా కేంద్రానికి సూచించండి

Chandrababu Team Met President Kovind At Delhi - Sakshi

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కోరిన చంద్రబాబు బృందం

మోదీకి స్వాగతంలో ప్రొటోకాల్‌ పాటించాం

రాష్ట్రానికి అన్యాయం చేసినందునే నేను వెళ్లలేదు

బీజేపీ నేతల జాతకాలు విప్పితే తలెత్తుకు తిరగలేరు

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీతోపాటు చట్టంలో పొందుపర్చిన ఇతర అంశాలను అమలుచేసేలా కేంద్ర ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందం కోరింది. పలువురు మంత్రులు, ఎంపీలు, ఉద్యోగ, ప్రజాసంఘాల నేతలతో కూడిన చంద్రబాబు బృందం మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతిని కలిసి 18అంశాలను పొందుపర్చిన వినతిపత్రాన్ని అందజేశారు. అంతకుముందు ఏపీ భవన్‌ నుంచి జంతర్‌మంతర్‌ వరకు ర్యాలీగా రాష్ట్రపతి భవన్‌కు వచ్చారు. అనంతరం చంద్రబాబు విజయ్‌ చౌక్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా హామీతోపాటు విభజన చట్టంలోని హామీలు, రాజధాని నిర్మాణం, రెవెన్యూ లోటు భర్తీ తదితర హామీల గురించి రాష్ట్రపతికి వివరించామన్నారు. 

మోదీకి సరైన చదువు లేదు
రాజధర్మాన్ని విస్మరిస్తున్న ప్రధాని మోదీ రాష్ట్రాలు, ప్రజలు, కులాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విభజించి పాలించాలని చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. మోదీలో నాయకత్వ లక్షణాల్లేవని, సరైన చదువూ లేదని.. దేశాన్ని అభివృద్ధి చేయాలనే  అజెండా సైతం లేదన్నారు. తమకు న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తామని, చివరగా ప్రజాక్షేత్రాన్ని ఆశ్రయిస్తామని సీఎం చెప్పారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా బీజేపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఇటీవల అమిత్‌ షా తనకు లేఖ రాయడాన్ని ఉద్దేశించి బాబు వ్యాఖ్యానించారు. వారి జాతకాలు విప్పితే తలెత్తుకుని తిరగలేరన్నారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రారావు ఇటీవల రాసిన లేఖ గురించి మీడియా ప్రస్తావించగా.. కేవీపీ కాంగ్రెస్‌తో ఉన్నాడా? లేక ఇంకో పార్టీతో ఉన్నాడో తనకు తెలియదన్నారు. 

మోదీకి ప్రొటోకాల్‌ పాటించాం
మోదీ ఆదివారం గుంటూరుకు వచ్చినప్పుడు ప్రొటోకాల్‌ పాటించామని చంద్రబాబు తెలిపారు. సీఎస్, డీజీపీ, కలెక్టర్‌ వెళ్లి ఆయనకు స్వాగతం పలికారన్నారు. ఏపీకి అన్యాయం చేసినందుకే తాను వెళ్లలేదని చంద్రబాబు అన్నారు. ఇక రాష్ట్రంలో ఓట్ల తొల గింపుపై స్పందిస్తూ.. వైఎస్సార్‌సీపీ నేతలే ఓట్లు తొల గించుకుంటూ తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. హోదా పోరాటంలో అన్ని పార్టీలు కలిసిరావాలని హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ కోరారు. రాష్ట్రపతిని కలసిన వారిలో మంత్రులు చినరాజప్ప, కళా వెంకట్రావ్, నక్కా ఆనందబాబు, ఎంపీ అశోక్‌ గజపతిరాజు తదితరులున్నారు. మరోవైపు.. ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న శ్రీకాకుళం జిల్లా కింతలికి చెందిన అర్జున్‌రావు భౌతికకాయానికి చంద్రబాబు నివాళులార్పించారు. 

త్వరలో టీడీపీలోకి : కిశోర్‌చంద్రదేవ్‌
త్వరలో టీడీపీలో చేరనున్నట్టు కేంద్ర మాజీమంత్రి కిశోర్‌ చంద్ర దేవ్‌ తెలిపారు. ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబును  ఆయన కలి శారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌–టీడీపీ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే తానూ,ఇతర కాంగ్రెస్‌ నేతలు టీడీపీలో చేరుతున్నారన్న ప్రచారం గురించి తనకు తెలియదన్నారు. 

మమతా బెనర్జీతో భేటీ 
చంద్రబాబు మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో  భేటీ అయ్యారు. ఈ సమావేశం సుమారు 30 నిమిషాల పాటు సాగింది. బుధవారం ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతృత్వంలో ఢిల్లీలో జరగనున్న ‘తానా షాహీ హఠావో దేశ్‌ బచావో’ ధర్నాలో పాల్గొనడానికి మమతా బెనర్జీ ఢిల్లీ చేరుకున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top