వ్యవసాయంలో ప్రపంచంతోనే పోటీ

Chandrababu speech in america - Sakshi

అమెరికా పర్యటనలో సీఎం చంద్రబాబు వెల్లడి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయరంగం ప్రపంచంతో పోటీపడేందుకు భారీగా యంత్రాలను ప్రవేశపెట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఐయోవా విశ్వవిద్యాలయ సహకారంతో కర్నూలులో శంకుస్థాపన చేసిన మెగా సీడ్‌ పార్కును రాష్ట్ర దశ, దిశా మార్చేవిధంగా తీర్చిదిద్దుతానన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన ఐయోవాలో ఏర్పాటైన అమెరికా–భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం సదస్సులో మాట్లాడారు. భారత్‌లో వ్యాపార అనుకూలత కలిగిన రాష్ట్రాల్లో తమ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంక్‌ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ ఇచ్చిందని, తాము ఎంత స్నేహపూర్వకంగా ఉంటామో, ఇక్కడ పెట్టు బడులు పెట్టిన పారిశ్రామి కవేత్తలను అడిగి తెలుసుకోవచ్చని చెప్పారు. అనంతరం పయ నీర్‌ సంస్థ శాస్త్రవేత్తలతో సమావేశమై మెగాసీడ్‌ పార్కు కార్యకలాపాలలో సహకరించాలని కోరారు. జాన్స్‌టన్‌లోని పయనీర్‌ సంస్థ గ్లోబల్‌ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన చంద్రబాబు అక్కడి శాస్త్రవేత్తలతో ఉత్పత్తులు, విశిష్టతల గురించి అడిగి తెలుసుకున్నారు.

మనవడితో పండుగ చేసుకోకుండా
డెమోయిన్స్‌లో తెలుగుదేశం ఫోరం సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు ఇంటిదగ్గర దీపావళి చేసుకోవాల్సిన వారంతా తనతో గడిపేందుకు ఇక్కడికి వచ్చారని, తాను మనవడితో కలసి పండుగ చేసుకోకుండా ప్రజల కోసం ఇక్కడికి వచ్చానన్నారు. ఐయోవా కార్యదర్శి విలియం హోవార్డ్‌ బిల్‌ నార్తేతో సీఎం సమావేశమయ్యారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల ఫెడరల్‌ ప్రభుత్వ వ్యవసాయ శాఖలో ఫామ్‌ ప్రొడక్షన్, కన్జర్వేషన్‌ అండర్‌ సెక్రటరీగా ఇటీవలే ఎంపికైన బిల్‌ నార్తేను సీఎం అభినందించారు.  వేగనింగన్‌ వర్సిటీ అధ్యక్షురాలు ఎల్‌ఓ ఫ్రిస్కోతో సమావేశమై పోషకాహారం, జీవన ప్రమాణాలు కలిగిన వాతావరణం కోసం తమతో పనిచేయాలని కోరారు. అనంతరం మహర్షి విశ్వవిద్యాలయం అధ్యక్షుడు జాన్‌ హామెలిన్, గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ డీన్‌ విలియం గోల్డ్‌స్టీన్‌తో సమావేశమై సేంద్రీయ వ్యవసాయంలో తమ రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం ఐయోవా రాష్ట్ర రాజధానిలో జరిగిన వరల్డ్‌ ఫుడ్‌ప్రైజ్‌–2017 పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. బాబు మూడురోజుల అమెరికా పర్యటన ముగిసింది. అక్కడి నుంచి దుబాయ్‌ పర్యటనకు ఆయన బృందం బయలుదేరింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top