బాబు రెండు నాల్కలు

Chandrababu Political Drama With His Words - Sakshi

నాలుగేళ్లు ఎన్డీయేతో కలిసి అధికారం అనుభవించిన చంద్రబాబు 

విభజన చట్టంలోని హామీల అమలుపై ఏనాడూ నోరుమెదపని సీఎం 

హోదా బదులు ప్యాకేజీ ఇచ్చినందుకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు 

మళ్లీ మోదీయే ప్రధానిగా రావాలని ఎన్డీఏ సమావేశంలో బాబు తీర్మానం 

ఎన్నికల ముందు యూటర్న్‌ 

మోదీ అన్యాయం చేశారంటూ మండిపాటు.. ధర్మపోరాట దీక్షలు 

కలిసి ఉన్నప్పుడు పొగడ్తలు, విడిపోయాక తెగడ్తలతో బాబు డ్రామాలు 

సాక్షి, అమరావతి: రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్లేట్లు ఫిరాయిస్తూ, మాటలు మారుస్తూ రకరకాల విన్యాసాలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. నాలుగేళ్లపాటు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విపరీతంగా పొగుడుతూ, అధికారం అనుభవిస్తూ, విభజన చట్టంలోని హామీల అమలు, ప్రత్యేక హోదా సాధనపై ఏనాడూ నోరుమెదపని చంద్రబాబు తీరా ఇప్పుడు ఎన్నికల ముందు దీక్షల పేరిట కొత్త డ్రామాలు ఆడుతున్నారని, రంగులు మార్చే ఊసరవెల్లికే బాబు కొత్త పాఠాలు నేర్పుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం కోసం 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.

నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే దేశం గతి మారుతుందని, కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో తాను రావాలని ప్రచారం చేశారు. రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా సాధించుకొస్తానని భీకర ప్రతిజ్ఞలు చేశారు. గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ మంత్రివర్గంలో భాగస్వామిగా మారారు. రాష్ట్రంలోనూ బీజేపీ సభ్యులను తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. నాలుగేళ్లపాటు కేంద్రంలో బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్నప్పుడు మోదీని, కేంద్రాన్ని చంద్రబాబు సహా కేంద్ర మంత్రులు సుజనాచౌదరి, అశోక్‌గజపతిరాజు పొగుడుతూనే ఉన్నారు. రాష్ట్రానికి హోదా వద్దని ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలంటూ ఒప్పుకున్నారు. హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చిచెప్పినా దానికి గంగిరెద్దులా తలూపారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో జరుగుతున్న పోరాటాన్ని అణచివేసేందుకు ప్రయత్నించారు. హోదా సంజీవని కాదని, హోదా వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదన్నారు. 

మోదీకి అభినందనలు తెలుపుతూ తీర్మానం 
2016 సెప్టెంబర్‌ 7న అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన వెంటనే చంద్రబాబు విలేకరుల సమావేశం పెట్టి మరీ దాన్ని స్వాగతించారు. 2017 మార్చి 16న అసెంబ్లీలో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని చంద్రబాబు స్వయంగా ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. మోదీయే అత్యుత్తమ ప్రధాని అని అసెంబ్లీ సాక్షిగా పొగిడారు. మోదీతో కలిసి అధికారాన్ని పంచుకున్నప్పుడు 19 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఆయనకు శాలువాలు కప్పి వంగివంగి దండాలు పెట్టిన దృశ్యాలు ఇంకా ప్రజల దృష్టి నుంచి చెదిరిపోలేదు. 

అప్పుడు బీజేపీ.. ఇప్పుడు కాంగ్రెస్‌ 
ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు అడుగడుగునా విశ్వప్రయత్నాలు చేశారు. జగన్‌ నిర్వహించిన యువభేరి సదస్సుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేవారు. ఆ సదస్సులకు వెళితే జైళ్లలో పెడతామని విద్యార్థులను చంద్రబాబు హెచ్చరించారు. 2017 మార్చిలో ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో ప్రధానిగా మళ్లీ మోదీయే రావాలని చంద్రబాబు స్వయంగా తీర్మానం ప్రవేశంపెట్టి ఆమోదింపజేశారు. నాలుగేళ్లు మోదీ భజన చేసి ఆయన తప్ప దేశానికి మరో గత్యంతరం లేదని చెప్పిన బాబు ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచి అందుకు విరుద్ధంగా మాట్లాడడం మొదలు పెట్టారు.

దేశాన్ని కాంగ్రెస్‌ నాశనం చేసిందన్న నోటితోనే ఇప్పుడు ఆ పార్టీతోనే దేశం అభివృద్ధి చెందుతుందనే పల్లవి అందుకోవడంతో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా ఉద్యమం నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి, ప్రత్యేక హోదా ఉద్యమ క్రెడిట్‌ మొత్తం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతోందనే అక్కసుతో 2018 ఫిబ్రవరిలో చంద్రబాబు ఎన్డీయే నుంచి వైదొలిగారు. అప్పటి నుంచి మోదీ వ్యతిరేక పల్లవి అందుకున్నారు. నాలుగేళ్లపాటు ఆయనను పొగిడిన సంగతిని ఉద్దేశపూర్వకంగా మర్చిపోయారు. మోదీతో కలిసి ఉన్నప్పుడు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌ అని కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీలపై విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే తల్లి కాంగ్రెస్‌ కోసం దేశమంతా పర్యటనలు చేస్తుండడం గమనార్హం. తల్లి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసేందుకు పదేపదే ఢిల్లీకి వెళుతున్నారు. 

చంద్రబాబు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు 
- ఏప్రిల్‌ 29, 2014: ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలని మోదీగారిని కోరుతున్నా (తిరుపతి ఎన్డీఏ సభలో చంద్రబాబు) 
- ఆగస్టు 25, 2015: ప్రత్యేక హోదా సంజీవని కాదు(న్యూఢిల్లీలో ప్రధానితో భేటీ తర్వాత చంద్రబాబు) 
- మార్చి 16, 2017: మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు, ప్యాకేజీకి అధికారికంగా ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు(అసెంబ్లీలో స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన చంద్రబాబు) 
- మార్చి 16, 2017: ప్రపంచంలో అత్యుత్తమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయనను మించిన వారు ఎవరూ లేరు.  
- జులై, 2017: మళ్లీ మోదీయే ప్రధానిగా రావాలి. మోదీ ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది.
- డిసెంబర్‌ 12, 2018: మోదీ మన రాష్ట్రానికి అన్యాయం చేశారు. దేశవ్యాప్తంగా వారిపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. మోదీ గద్దె దిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకం చేస్తున్నాను.  
- డిసెంబర్‌ 16, 2018: దేశంలోని అన్ని వ్యవస్థలను మోదీ నాశనం చేశారు. నా జీవితంలో ఇలాంటి ప్రధానమంత్రిని ఎప్పుడూ చూడలేదు 
- జనవరి 20, 2019: మోదీ దేశాన్ని భ్రష్టు పట్టించారు. ఆయనను పదవి నుంచి సాగనంపేంత వరకూ నిద్రపోకూడదు(కోల్‌కతాలో మమతా బెనర్జీ నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు) 
- ఫిబ్రవరి 9, 2019: ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు ఎలా వస్తారు? మోదీ పర్యటన రోజు ఏపీకి చీకటి రోజు, ఒక దుర్దినం. మోదీ పర్యటన రోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలి. నిరసన దినంగా పాటించాలి. పసుపు, నలుపు రంగు బెలూన్లు ఎగురవేయాలి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top